కలబందతో అందంగా ఉండొచ్చు!
చర్మంపై మచ్చలు, మొటిమలు, పొడి చర్మం, జిడ్డు చర్మం, చర్మం ముడతలు పడడం, దద్దుర్లు ఇలా.. ప్రతి చర్మ సమస్యకు కలబందతో చెక్ పెట్టొచ్చు.
చర్మాన్ని అందంగా ఉంచుకోవడం కోసం రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడేబదులు కలబందను రకరకాలుగా వాడుకోవచ్చంటున్నారు బ్యూటీ ఎక్స్‌పర్ట్స్. అందానికి కలబంద ఎలా ఉపయోగపడుతుందంటే..
చర్మంపై మచ్చలు, మొటిమలు, పొడి చర్మం, జిడ్డు చర్మం, చర్మం ముడతలు పడడం, దద్దుర్లు ఇలా.. ప్రతి చర్మ సమస్యకు కలబందతో చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖంపై మచ్చలు పోగొట్టుకోవడం కోసం స్పూను కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు, రోజ్‌వాటర్, తేనె కలిపి ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్ వేసుకుని ఇరవై నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయొచ్చు.
ముఖాన్ని డీట్యాన్ చేసుకోవాలంటే కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, పసుపు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు వేసుకుంటే ముఖంపైని ట్యాన్ తగ్గి స్కిన్ బ్రైట్‌గా మారుతుంది.
జిడ్డు చర్మం ఉన్నవాళ్లు కేవలం కలబంద గుజ్జుని ముఖానికి రాసుకోవడం ద్వారా జిడ్డు చర్మం తొలగించుకోవచ్చు. రోజూ రాత్రి పడుకునేముందు గుజ్జుని ముఖానికి పట్టించి తెల్లవారాక కడిగేసుకోవచ్చు.
పొడి చర్మం ఉన్నవాళ్లు కలబంద గుజ్జులో కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ని కలిపి ముఖానికి పట్టించడం ద్వారా చర్మంలో తేమ శాతాన్ని పెంచుకోవచ్చు. ఇలా తరచూ చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే చర్మం పొడిబారడం తగ్గుతుంది.
ముఖంపై మొటిమలు ఉన్నవాళ్లు కలబంద గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవచ్చు. ఇరవై నిముషాల తర్వాత చల్లటినీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం ద్వారా కొద్దిరోజుల్లోనే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
ఇక వీటితోపాటు చర్మంపై దద్దుర్లు, మచ్చలు, దురద వంటి సమస్యలు ఉంటే కలబంద గుజ్జులో పసుపు, నిమ్మరసం వేసి ఆయింట్‌మెంట్‌లా పూసుకోవచ్చు. సమస్య తగ్గకపోతుంటే డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.