Telugu Global
Health & Life Style

వింటర్‌‌లో విటమిన్–డి అందాలంటే ఇలా చేయాలి!

శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్‌లో విటమిన్–డి కూడా ఒకటి. ఇది సూర్యరశ్మి ద్వారా సహజంగా లభిస్తుంది.

వింటర్‌‌లో విటమిన్–డి అందాలంటే ఇలా చేయాలి!
X

శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్‌లో విటమిన్–డి కూడా ఒకటి. ఇది సూర్యరశ్మి ద్వారా సహజంగా లభిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఈ విటమిన్ ఎంతో అవసరం. అయితే చలికాలం ఎండ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో చాలామందిలో డి– విటమిన్ లోపిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..

సాధారణంగా చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో విటమిన్–డి లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. కాల్షియం, ఫాస్పరస్ వంటి మినరల్స్‌ను గ్రహించడంలో విటమిన్–డి కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్– డి లోపిస్తే అలసట, ఎముకల బలహీనత, కండరాల నొప్పులు, జుట్టు రాలడం, ఒత్తిడి, నిరాశ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే విటమిన్– డి లోపం గుండె సమస్యలకు, రక్తపోటుకు కూడా కారణమవుతుందని రీసెంట్ స్టడీస్‌లో తేలింది. కాబట్టి అలసట, కీళ్లనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే రక్త పరీక్ష చేయించుకుని విటమిన్– డి డెఫీషియన్సీ ఉందో లేదో నిర్ధారించుకోవాలి.

గర్భిణీలు, పాలిచ్చే తల్లులతో సహా ప్రతిఒక్కరికీ రోజుకి పది మైక్రోగ్రాముల విటమిన్– డి అవసరం. విటమిన్– డి డెఫీషియన్సీ ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకు సప్లిమెంట్లు వాడొచ్చు. అలాగే చలికాలంలో కొన్ని ఆహారాలు డైట్‌లో చేర్చుకోవడం, వీలున్నప్పుడు ఎండలో నిల్చోవడం ద్వారా డి–విటమిన్ లోపించకుండా జాగ్రత్తపడొచ్చు.

శరీరంలో విటమిన్–డి లెవల్స్ పెంచడం కోసం అప్పుడప్పుడు సీఫుడ్ తీసుకుంటుండాలి. ట్యూనా ఫిష్ , రొయ్యలు వంటివి తీసుకోవడం ద్వారా విటమిన్– డి లోపించకుండా చూసుకోవచ్చు.

పుట్టగొడుగుల్లో ఉండే ప్రొటీన్, బీటా కెరోటిన్, ఇతర విటమిన్లు డి– విటమిన్ లోపించకుండా అడ్డుకుంటాయి. అలాగే గుడ్డులోని పచ్చసొన కూడా విటమిన్–డి లెవల్స్‌ను పెంచుతుంది.

ఇక వీటితోపాటు పాల పదార్థాలు, సోయా, బాదం, నారింజ పండ్లు, మిల్లెట్స్, టోఫూ వంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా కూడా విటమిన్–డి లోపం నుంచి గట్టెక్కవచ్చు.

First Published:  25 Nov 2023 10:00 AM IST
Next Story