Telugu Global
Health & Life Style

మెనోపాజ్ లో వచ్చే వేడి ఆవిర్లను... ఇలా ఆపొచ్చు

మెనోపాజ్... అంటే నెలసరి ఆగిపోయే దశ. ఈ స్థితిలో ఉన్న స్త్రీలలో పలురకాల సమస్యలు కనబడుతుంటాయి. శరీరంనుండి వేడిఆవిర్లు రావటం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, మానసికస్థితి స్థిరంగా లేకపోవటం, నీరసం, చిరాకు లాంటివి ఉంటాయి.

మెనోపాజ్ లో వచ్చే వేడి ఆవిర్లను... ఇలా ఆపొచ్చు
X

మెనోపాజ్... అంటే నెలసరి ఆగిపోయే దశ. ఈ స్థితిలో ఉన్న స్త్రీలలో పలురకాల సమస్యలు కనబడుతుంటాయి. శరీరంనుండి వేడిఆవిర్లు రావటం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, మానసికస్థితి స్థిరంగా లేకపోవటం, నీరసం, చిరాకు లాంటివి ఉంటాయి. ముఖ్యంగా శరీరం అంతా మంటగా అనిపిస్తూ వేడిఆవిర్లు రావటం తరచుగా కనిపించే సమస్య.

నెలసరి ఆగిపోవడానికి ముందు అండాశయం పనితీరు తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు తగ్గుతుంటాయి. దీనివలన శరీరంలోని పై భాగంలో హఠాత్తుగా వేడిగా అనిపిస్తుంది. అయితే తరువాత అంతే హఠాత్తుగా శరీరం చల్లబడటం, చలిగా అనిపించడం కూడా ఉంటుంది. రాత్రులు ఇలా జరిగితే నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. దీనినుండి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలను పాటించాలి.

♦ శరీరంలో వేడిఆవిర్లు వస్తున్నవారు మసాలాలు, కాఫీ, ఆల్కహాల్, ఒత్తిడి, బిగుతుగా ఉన్నదుస్తులు.... వీటన్నింటికీ దూరంగా ఉండాలి. ఇవన్నీ వేడి ఆవిర్లను మరింతగా పెంచుతాయి. ఒక్కోసారి మేకప్ ఎక్కువగా వేసుకున్నపుడు, జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉన్నపుడు ఈ సమస్య మరింత ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే కోపం, అసహనం, చిరాకు వంటివి కూడా శరీరంలో మంటలను పెంచుతాయి కనుక వీటికి దూరంగా ఉండాలి.

వేడిఆవిర్ల సమస్యను సహజంగా తగ్గించుకోవాలంటే గది ఉష్ణోగ్రత చల్లగా ఉండేలా చూసుకోవాలి. అయితే హఠాత్తుగా వేడి ఆవిర్లు మొదలైతే వెంటనే ఎయిర్ కండీషనర్ ని ఆన్ చేసుకోవటం మంచిది కాదు. శరీరాన్ని వెంటనే చల్లబరచుకోవటం కాకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తరువాత ప్యాన్ కింద కూర్చోవటం, చల్లని నీటిని చిలకరించుకోవటం వంటివి చేయవచ్చు. ఒక్కసారిగా ఏసీ ద్వారా శరీరాన్ని చల్లబరిస్తే బాగా చలిగా అనిపించవచ్చు.

♦ సింథటిక్ దుస్తులకు బదులుగా శరీరానికి చల్లదనం ఇచ్చే కాటన్ దుస్తులను ధరించడం మంచిది. అలాగే ఆందోళనని తగ్గించి, శరీరాన్ని రిలాక్స్ చేసే వ్యాయామాలు చేయాలి. మసాలాలు, నూనెలతో తయారుచేసిన ఆహారాలను తినటం తగ్గించాలి. వేడి పానీయాలు కూడా శరీర ఉష్ణోగ్రతని పెంచుతాయి. వాటివలన కూడా వేడి ఆవిర్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాటిని తగ్గించాలి.

♦ వేడి ఆవిర్లు వస్తున్నపుడు చల్లని పుచ్చకాయని తినటం మంచిది. అలాగే నిమ్మరసం తాగవచ్చు. తమ శరీరానికి పడని ఆహారాలను, అలర్జీని కలిగించేవాటిని తీసుకోకూడదు. ఆహారాలు తాజాగా ఉండేలా చూసుకోవాలి. అలాగే చల్లని పదార్థాలు తినటం మంచిది.

♦ మనసుని సంతోషంగా ఉంచుకోవాలి. ఆనందంగా ఉండటం వలన తమ సమస్యని అంగీకరించే శక్తి వస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన, కోపం లాంటివి తగ్గుతాయి... కనుక వేడి ఆవిర్లు కూడా తగ్గుతాయి.

♦ ఇతరులపైన విసుగు, కోపం, చిరాకు లాంటివి రాకుండా ఉండాలంటే ఇతరులనుండి ఎక్కువగా ఆశించకుండా ఉండటం మంచిది. ఆనందం కోసం ఇతరులపై ఆధారపడకుండా తమకు నచ్చిన పనులను చేయటం ద్వారా ఆనందాన్ని పొందటం అలవాటు చేసుకోవాలి.

First Published:  14 Sept 2023 6:23 AM GMT
Next Story