మోచేతుల నలుపుని ఇలా పోగొట్టొచ్చు!
మోచేతుల నలుపు పోగొట్టడానికి ఇంటి చిట్కాలు పనికొస్తాయి.
అందమంటే కేవలం ముఖ సౌందర్యం ఒక్కటే కాదు. ముఖ్యంగా అమ్మాయిలయితే చేతులు, కాళ్లు కూడా సున్నితంగా అందంగా ఉండాలనుకుంటారు. దానికోసం మెనిక్యూర్, పెడిక్యూర్ లాంటివి కూడా చేయిస్తూ ఉంటారు. అయితే ఎన్ని క్రీములు రాసినా మోకాళ్లు, కాలి మడమలు, మోచేతుల దగ్గర ఉండే నలుపు మాత్రం అంత ఈజీగా తగ్గుముఖం పట్టదు. మరి దీనికి సొల్యూషన్ ఏది?
మోచేతుల నలుపు పోగొట్టడానికి ఇంటి చిట్కాలు పనికొస్తాయి. ముందుగా చర్మం పొడిబారకుండా ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తుండాలి. అలాగే శరీరానికి సరైన హైడ్రేషన్ ఉండేలా చూసుకోవాలి. పొడిచర్మాన్ని కంట్రోల్ చేయగలిగితే మోచేతులు, మోకాళ్ల నలుపుని తగ్గించొచ్చు.
ఇకపోతే -బాదం పప్పులను పాలలో నానబెట్టి పేస్టులా చేసి చేతులు, కాళ్లు, నల్లగా ఉన్న చోట రాసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే.. నలుపు తగ్గించొచ్చు. బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నల్లని చర్మంలో ఉండే డెడ్ సెల్స్‌ను పోగొడతాయి.
నల్లగా ఉన్నచోట కలబంద గుజ్జు రాసినా మంచి ఫలితం ఉంటుంది. చర్మ సమస్యలకు కలబంద మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. నలుపు చర్మం, గరుకు చర్మం లాంటి సమస్యలకు కలబంద బెస్ట్ ఆప్షన్. కలబంద గుజ్జుని చర్మంపై రాసి మృదువుగా మర్దన చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చాలు.
నిమ్మరసం, వెనిగర్ కూడా సహజమైన క్లెన్సర్స్‌గా పనిచేస్తాయి. ఇవి చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగిస్తాయి. నిమ్మచెక్కపై కొద్దిగా చక్కెర వేసి మోచేతి, కాళ్లు, మడమలపై రుద్దినా లేదా వెనిగర్‌లో పెరుగు కలిపి రాసినా మంచి ఫలితం ఉంటుంది.
వీటితోపాటు నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని చర్మంపై మర్థన చేసి వేడినీటి స్నానం చేసినా రిజల్ట్ ఉంటుంది. అలాగే చర్మానికి రోజూ పొద్దుటి ఎండ తగిలేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మృదువైన తాజా స్కిన్ పొందొచ్చు.