Telugu Global
Health & Life Style

చలికాలంలో పిల్లలు దగ్గు, జలుబు బారిన పడితే.. ఈ చిట్కాలు ఉపయోగించండి

వేడి నీళ్లలో మూడు చుక్కల జిందాతిలిస్మాత్ వేసి ఆవిరి పడితే ఊపిరి తీసుకోవడం తేలిక అవుతుంది.

చలికాలంలో పిల్లలు దగ్గు, జలుబు బారిన పడితే.. ఈ చిట్కాలు ఉపయోగించండి
X

అప్పుడే చలి నెమ్మదిగా ప్రారంభం అయ్యింది. నవంబర్ మొదటి వారానికి చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా సీజన్ మారినప్పుడు రోగాల బారిన పడటం సహజమే. ముఖ్యంగా చిన్న పిల్లలు వాతావరణ మార్పుల కారణంగా త్వరగా ప్రభావితం అవుతారు. చలి కాలంలో దగ్గు, జలుబు బారిన పడటం సహజమే. అయితే కంగారు పడి డాక్టర్లను సంప్రదించి, మందులు వాడటం కంటే.. చిన్న చిట్కాలతో నయం చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కాలు వాడినా దగ్గు, జలుబు తగ్గకుండా వేధిస్తుంటే మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

ఆవిరి పట్టడం :

తీవ్రమైన జలుబు కారణంగా ముక్కు రంధ్రాలు మూసుకొని పోతాయి. దీంతో పిల్లలు ఊపిరి తీసుకోవడానికి కష్టం అవుతుంది. అంతే కాకుండా దగ్గు కారణంగా గొంతు నొప్పి కూడా మొదలవుతుంది. దీనికి తక్షణ పరిష్కారం ఆవిరి పట్టడం. వేడి నీళ్లలో మూడు చుక్కల జిందాతిలిస్మాత్ వేసి ఆవిరి పడితే ఊపిరి తీసుకోవడం తేలిక అవుతుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయం, సాయంత్రం ఐదు నిమిషాల చొప్పున జలుబు తగ్గే వరకు చేయండి.

ఉప్పు నీటితో పుక్కిలించడం :

తీవ్రమైన దగ్గు కారణంగా గొంతు మంట, నొప్పు అధికమవుతాయి. దగ్గు ప్రారంభం కావడానికి ముందు కూడా గొంతులో గరగరమంటూ ఉంటుంది. ఇది తగ్గాలంటే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి నోటిని బాగా పుక్కిలించాలి. గొంతు వరకు ఈ నీళ్లు వెళ్లేలా పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా చేయడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా పిల్లకు కోలుకుంటారు. రోజుకు నాలుగైదు సార్లు పిల్లలతో చేయిస్తే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు పాలు :

పసుపు మంచి యాంటీ సెప్టిక్ లాగా పనిచేస్తుంది. జలుబు, దగ్గుతో బాధపడే వాళ్లకు ఇది నేచురల్ రెమిడీలా ఉపయోగపడుతుంది. ప్రతీ రోజు పడుకునే ముందు గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసి తాగించండి. గొంతు నొప్పి తగ్గడంతో పాటు జలుబు నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

వెల్లుల్లి :

జలుబు ఉన్న పిల్లలకు రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి.. తేనె కలిపి తినిపించాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేస్తే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

సూప్, పండ్ల రసాలు:

చిన్న పిల్లలు దగ్గు, జలుబుతో బాధపడుతూ ఎక్కువగా నీళ్లు తాగరు. దీంతో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుంది. అందుకే పిల్లలు హైడ్రేట్‌గా ఉంచడానికి వెచ్చని సూప్స్ లేదా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉండే పండ్ల రసాలు ఇవ్వాలి. దీని వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.

తేనె :

గొంతు ఇన్ఫెక్షన్లను తేనె సమర్థవంతంగా తగ్గిస్తుంది. ప్రతీ రోజు పిల్లలకు రెండు లేదా మూడు స్పూన్ల తేనె తాగించడం వల్ల ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. గొంతులో గరగర కూడా మాయం అవుతుంది. తేనెలో కాస్త దాల్చిన చెక్క పొడి కలిపి ఇస్తే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ టిప్స్ అన్నీ సీజనల్‌గా వచ్చే గొంతు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి వాడవచ్చు. అయితే వ్యాధి తీవ్రత పెరుగుతుందని అనిపించిన వెంటనే డాక్టర్లును సంప్రదించాలి.

First Published:  28 Oct 2022 3:36 PM IST
Next Story