సీ వెజిటేబుల్స్.. వచ్చేస్తున్నాయ్..!
ఇజ్రాయిల్‌కు చెందిన ఓ కంపెనీ అయితే సేంద్రియ సీ వెజిటబుల్స్‌ను సాగుచేసే ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఆహార ఉత్పత్తులకు అదనపు పోషకాలు జోడించడానికి, ఔషధాల ఉత్పత్తిలో వీటిని విరివిగా వాడుతున్నారు.
సీ ఫుడ్స్‌లో నాన్‌వెజ్ గురించి మాత్రమే మనకు ఎక్కువగా తెలుసు. కానీ మన పాలకూర మాదిరిగానే సముద్రంలో పుష్కలంగా ప్రొటీన్లతో ఉన్న ఇంకో పాలకూర కూడా ఉందనే విషయం మీకు తెలుసా. వాటిని తినేందుకు ఇప్పుడు ప్రత్యేకంగా సాగు కూడా చేస్తున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. వీటినే సీ వీడ్స్ అంటారు. మన పాలకూర మాదిరిగా ఉండటంతో వీటిని సముద్రపు పాలకూర అంటున్నారు. ఇవి సముద్రపు నీటిలో పెరిగే నాచు వంటి మొక్కలు. వీటిలో పుష్కలంగా పోషక విలువలున్నాయనే విషయం గుర్తించిన తర్వాత వీటిని సీ వెజిటబుల్స్ అని, సీ ప్లాంట్స్ అని పిలుస్తున్నారు. వాటి సాగుకు ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు.
చైనా, జపాన్‌లలో తరతరాలుగా తినే అలవాటు..
చైనా, జపాన్ తదితర ఆసియా దేశాల్లో సహజసిద్ధంగా సముద్రపు నీటిలో పెరిగే వీటిని సేకరించి తినే అలవాటు తరతరాలుగా ఉంది. వీటి విలువను గుర్తించి.. అమెరికా, కెనడాల్లో ఇప్పుడు వీటిని కొన్ని కంపెనీలు చెరువుల్లో పెంచటం ప్రారంభించాయి. ఇజ్రాయిల్‌కు చెందిన ఓ కంపెనీ అయితే సేంద్రియ సీ వెజిటబుల్స్‌ను సాగుచేసే ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఆహార ఉత్పత్తులకు అదనపు పోషకాలు జోడించడానికి, ఔషధాల ఉత్పత్తిలో వీటిని విరివిగా వాడుతున్నారు.
సేంద్రియ సీ వీడ్స్ సాగు ఇలా..
సీ వీడ్స్ సముద్రపు నీటిలో సహజసిద్ధంగా పెరుగుతుంటాయి. వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని సీజన్లలోనే ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని తీరం వెంట సముద్రపు నీటిలో కేజెస్‌లలో సాగు చేయటం ప్రారంభించారు. తీర ప్రాంతాల్లో కృత్రిమంగా నిర్మించిన చెరువుల్లో సముద్రపు నీటిని తోడి వీటిని సాగు చేస్తున్నారు. సాధారణ సముద్ర జలాల్లోని భార ఖనిజాలు, ఇతర కాలుష్యాలు అంటకుండా సముద్ర గర్భం నుంచి శుద్ధమైన నీటిని తోడి తెచ్చి తీరానికి దగ్గరలో నేలపై కృత్రిమ ఉప్పు నీటి చెరువుల్లో సాగు చేసే విధానమే సేంద్రియ సీ వీడ్స్ సాగు. నీటి ఉష్ణోగ్రతను, కాంతిని నియంత్రించడం ద్వారా ఏడాది పొడవునా వీటిని నిరంతరాయంగా సాగు చేపట్టవచ్చని సంస్థ చెబుతోంది. సీ వీడ్‌ల ముక్కలను వేస్తే కొద్దిరోజుల్లోనే అవి పెరుగుతాయి.
పెరుగుదల క్రమంలో వయసును బట్టి మూడు దశలు ఉంటాయి. ఒక్కో దశకు వేర్వేరు చెరువుల వ్యవస్థను ఈ కంపెనీ డిజైన్ చేసింది. సముద్రపు జలాల్లోని సహజ పోషకాలు, బ్యాక్టీరియా ఆధారంగా ఇవి వేగంగా పెరుగుతాయి. సాగు పూర్తయి సీవీడ్స్‌ను పట్టుబడి చేసిన తర్వాత ఆ నీటిని ఆక్వా సాగుకు కూడా వినియోగించవచ్చు. లేదా తిరిగి సముద్రంలోకి వదిలేయవచ్చు. దీనిలో కాలుష్యం అనే మాటే ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ప్రొటీన్లు పుష్కలం..
సముద్రపు పాలకూరలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా సీ వీడ్స్ రకాలు వేలాదిగా ఉంటాయి. వాటిలో ప్రొటీన్లు, ఇతర పోషకాలు అధికంగా కలిగివున్న రెండు రకాలను తాము సాగు చేస్తున్నామని సీకురా అనే సంస్థ సీఈవో ఓజ్ చెబుతున్నారు. మటన్‌లో 25 గ్రాములు, చికెన్‌లో 21.7 గ్రాములు, కోడిగుడ్డులో 12 గ్రాములు ప్రొటీన్ ఉంటుంది. అయితే తాము సాగు చేసే ఉల్వా, గ్రేసిలేరియా రకాల ఉత్పత్తుల్లో 32 గ్రాముల ప్రొటీన్ ఉంటుందని ఓజ్ చెబుతున్నారు. సముద్రపు పాలకూర అని పిలిచే ఆకు ఈ ఉల్వా రకమే. గ్రేసిలేరియా రకం.. ముదురు ఎరుపు రంగుతో సున్నితమైన కాడలతో కూడి ఉంటుంది.
ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు వీటిలో ఏమేరకు ఉన్నాయో గుర్తించడానికి కంపెనీ నిర్వహించిన జన్యు పరిశోధనల్లో వీటిలో అయోడిన్ శాతం ఎక్కువగా ఉందని తేలింది. అధిక అయోడిన్ ఉన్న సూపర్ ఫుడ్స్ అయిన.. కాలే, స్పియా, చిరులినా.. వంటివాటితో పోల్చితే వీటిలోనే అయోడిన్ శాతం ఎక్కువగా ఉంది. అయోడిన్ లోపం నేడు ప్రపంచంలోని ప్రధాన పోషకాహార లోపాల్లో ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ లోపం వల్ల గాయిటర్, గర్భధారణ వంటి సమస్యలకు దారితీసే అవకాశముంది. ఈ సమస్యల నివారణకు ఉల్వా, గ్రేసిలేరియా ఉపకరించనున్న నేపథ్యంలో సీవీడ్స్ సాగుకు ఇప్పుడు ప్రాధాన్యం పెరుగుతోంది. సేంద్రియ సీవీడ్స్‌పై మన శాస్త్రవేత్తలు కూడా దృష్టి పెడితే. ఇతర దేశాల మార్కెట్లనూ భారత్ చేజిక్కించుకునే అవకాశాలు ఏర్పడతాయి.