ఆరు రోజుల్లో 18 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు
సత్యసాయి సంజీవని ఆస్పత్రి సేవలను అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు
ఆరు రోజుల్లో 18 మంచి చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన సత్యసాయి సంజీవని హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బందిని మాజీ మంత్రి హరీశ్ రావు అభినందించారు. శనివారం సిద్దిపేట జిల్లా కొండపాకలోని ఆస్పత్రిని ఆయన సందర్శించారు. చిన్న వయసులోనే గుండె సమస్యలతో బాధ పడుతున్న కుటుంబాలకు ఈ ఆప్పత్రి ఆశాజ్యోతిగా నిలుస్తోందని హరీశ్ అన్నారు. సత్యసాయి హాస్పిటల్ దేశంలోని 10 వేల గ్రామాల్లోని చిన్నారులకు సేవలందిస్తున్నాయని, 18 దేశాల్లోనూ పిల్లలకు వైద్య చికిత్సలు అందజేస్తున్నాయని డాక్టర్లు తెలిపారు. 12 ఏళ్లలో 33,600 మందికి పైగా చిన్నారులకు సర్జరీలు చేశామని చెప్పారు. చిన్న వయస్సులో ఆరోగ్య సమస్యలను అధిగమించిన పలువురు చిన్నారులను హరీశ్ ఎత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు, రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చయ్యే ఆపరేషన్లను ఉచితంగా చేయడం ఎంతో గొప్పదని, వాళ్ల కుటుంబాలు ఆస్పత్రి సేవలను ఎప్పటికీ మర్చిపోవన్నారు. సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్, మధుసూదనసాయిని హరీశ్ రావు ప్రత్యేకంగా అభినందించారు.