ఆడపిల్లలు తప్పక చేయించుకోవాల్సిన టెస్ట్‌లు ఇవి!
ముఖ్యంగా ఆడపిల్లలు టీనేజ్ వయసు నుంచే తరచూ కొన్ని మెడికల్ టెస్ట్‌లు చేయిస్తూ ఉండడం ద్వారా ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని మానిటర్ చేసుకోవచ్చు.
మనదేశంలో మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ అనారోగ్య సమస్యలను, పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు టీనేజ్ వయసు నుంచే తరచూ కొన్ని మెడికల్ టెస్ట్‌లు చేయిస్తూ ఉండడం ద్వారా ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని మానిటర్ చేసుకోవచ్చు.
ఆడపిల్లలు ఎదుగుతున్న కొద్దీ వయసుని బట్టి ప్రత్యేకమైన పోషకాలు అవసరమవుతాయి. అవి తగిన పాళ్లలో అందకపోతే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎదిగే ఆడపిల్లలు కొన్ని మెడికల్ టెస్ట్‌లు తప్పనిసరిగా చేయించుకోవాలంటున్నారు డాక్టర్లు. అవేంటంటే.
మనదేశంలోని మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువ. కాబట్టి ఆడపిల్లలు టీనేజ్ వయసు నుంచే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ చేయిస్తుండాలి. ఈ టెస్ట్ వల్ల రక్తంలోని కణాలు, ఐరన్ కంటెంట్ వంటివి తెలుస్తాయి. తద్వారా రక్త హీనత రాకుండా జాగ్రత్త పడొచ్చు. రక్త హీనత ఉన్నవాళ్లు ముందునుంచే డాక్టర్ల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ఆడపిల్లల్లో హార్మోనల్ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే విటమిన్లు తగిన పాళ్లలో ఉండడం అవసరం. దీన్ని తెలుసుకునేందుకు విటమిన్‌ప్రొఫైల్ టెస్ట్స్ చేయించాలి. ఈ టెస్ట్ వల్ల ఏదైనా విటమిన్లు లోపించాయేమో తెలుస్తుంది. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
మధ్య వయసులోని ఆడవాళ్లలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటివి రాకుండా ఉండేందుకు తరచూ యూరిన్ కల్చర్ టెస్ట్ చేయిస్తుండాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటివి ఉంటే ఈ పరీక్షతో తెలుస్తుంది.
ఇక వీటితో పాటు థైరాయిడ్ టెస్ట్ ద్వారా థైరాయిడ్ హార్మోన్ సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే తరచూ కంటి పరీక్ష చేయించడం ద్వారా కంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడొచ్చు. దీంతోపాటు హార్మోనల్ వర్కప్ టెస్ట్ చేయించడం ద్వారా మహిళల్లో నెలసరి సమస్యలను ముందుగానే అంచనా వేయొచ్చు. ఇలా ముందస్తు పరిక్షలు చేయిస్తూ ఉండడం ద్వారా సమస్యలు మరింత ముదరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వీలుంటుంది.