సిగరెట్ తాగితే శరీరంలో జరిగే మార్పులివే!
లంగ్స్ నుంచి కిడ్నీల వరకూ స్మోకింగ్‌తో చాలా అవయవాలు పాడవుతాయని డాక్టర్లు చెప్తున్నారు.
మనదేశంలో సుమారు 28 శాతం మందికి పొగాకు అలవాటు ఉందని సర్వేలు చెప్తున్నాయి. లంగ్స్ నుంచి కిడ్నీల వరకూ స్మోకింగ్‌తో చాలా అవయవాలు పాడవుతాయని డాక్టర్లు చెప్తున్నారు. పలు అనర్థాలకు దారి తీసే ఈ సిగరెట్ అసలు శరీరంలోకి వెళ్లాక ఏం చేస్తుందో తెలుసా?
రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఓ కథనం ప్రకారం ఒక్క సిగరెట్ తాగినా కూడా నష్టమేనట. సిగరెట్ పొగ శ్వాస మార్గాలలో కఫం పెరిగేలా చేసి శ్వాస వ్యవస్థను బలహీనపరుస్తుందట. దీంతోపాటు సిగరెట్ ఏయే నష్టాలు తెచ్చిపెడుతుందంటే..
పొగాకు మానేయమని చెప్పడానికి.. అందులో ఉండే హానికరమైన రసాయనాలే కారణం. పొగాకులోని హానికరమైన కెమికల్స్‌తో పాటు దాన్ని కాల్చడం వల్ల ఏర్పడే కార్బన్ మొనాక్సైడ్ శరీరంలోని ఆక్సిజన్ శాతాన్ని తగ్గిస్తుంది. శరీర కణాలు ఆక్సిజన్ శోషించుకునే శక్తిని కోల్పోయేలా ప్రేరేపిస్తుంది.
సిగరెట్ పొగలోని కెమికల్స్ ముందుగా నోటిలోని అవయవాల మీద ప్రభావం చూపుతాయి. సిగరెట్ కాల్చగానే నోటిలోని నాలుక, గొంతు, చిగుళ్లు, పెదవులు వంటివి ఇరిటేట్ అవుతాయి. వాటిపై కూడా కార్బన్ మొనాక్సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవారి పెదవులు, చిగుళ్లు రంగు మారుతుంటాయి.
సిగరెట్ కాల్చడం మొదలుపెట్టిన వెంటనే రక్తంలోకి నికోటిన్ చేరి రక్తపోటుని అమాంతం పెంచేస్తుంది. హార్ట్ రేట్ పెరుగుతుంది. సిగరెట్ తాగిన కాసేపటి వరకూ ఆ ఎఫెక్ట్ అలాగే ఉంటుంది. ఇది క్రమంగా బీపీ, హార్ట్ ఎటాక్ రిస్క్‌ను పెంచుతుంది.
సిగరెట్ కాల్చిన వెంటనే అందులోని నికోటిన్.. మెదడులో డోపమైన్ అనే హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది. దీనివల్ల మళ్లీ మళ్లీ సిగరెట్ తాగాలి అనిపిస్తుంది. ఇలా క్రమంగా అదొక అలవాటుగా మారుతుంది.
సిగరెట్‌లోని టాక్సిన్స్ చర్మాన్ని కూడా పాడుచేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు వంటి సమస్యలతోపాటు పొడి చర్మానికి కూడా సిగరెట్ కారణమవుతుంది.
ఇకపోతే సిగరెట్ కాల్చడం వల్ల శరీరంలోకి వెళ్లే కార్బన్‌మోనాక్సైడ్.. కణజాలాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. తద్వారా గుండె, కిడ్నీ, లివర్, లంగ్స్ వంటి పలు అవయవాల పనితీరు దెబ్బతింటుంది. అలాగే ఎక్కువ కాలం పాటు సిగరెట్ తాగడం వల్ల లంగ్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.