Telugu Global
Health & Life Style

రుచిని బట్టి ఆరోగ్యం!

జలుబు చేస్తే తీపి తినకూడదు. వేడి చేస్తే కారం తినకూడదు. అనే మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. ఆరోగ్యంపై ఆహారం ప్రభావం చూపుతుందని తెలుసు. కానీ రుచులు కూడా జబ్బులపై ప్రభావాన్ని చూపుతాయా? అసలు రుచులకి ఆరోగ్యానికి ఏంటి సంబంధం?

రుచిని బట్టి ఆరోగ్యం!
X

రుచిని బట్టి ఆరోగ్యం!

జలుబు చేస్తే తీపి తినకూడదు. వేడి చేస్తే కారం తినకూడదు. అనే మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. ఆరోగ్యంపై ఆహారం ప్రభావం చూపుతుందని తెలుసు. కానీ రుచులు కూడా జబ్బులపై ప్రభావాన్ని చూపుతాయా? అసలు రుచులకి ఆరోగ్యానికి ఏంటి సంబంధం?

ఆహారమే ఔషదం అన్న సంగతి అందరికీ తెలుసు. అయితే మనం తీసుకునే ఆహారంలో ఒక్కో ఆహారానికి ఒక్కో రుచి ఉంటుంది. ప్రతీ రుచికి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంటుంది. ఆరోగ్యంపై ఒక్కో ఫ్లేవర్ ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే తీసుకునే ఆహారంలో ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటేనే అది ఆరోగ్యకరమైన ఆహారం. లేకపోతే ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుంది. అందుకే ఆహార పదార్థాల్లో వేసే పదార్థాలను బట్టి రుచులను బ్యాలెన్స్ చేసుకోవాలి.

ఒక్కోటి ఒక్కోలా..

మనకున్న రుచులు ఆరు. తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వగరు. ఈ ఆరు రుచుల్లో ఒక్కో రుచికి ఒక్కోరకమైన లక్షణం ఉంటుంది. ఆరోగ్యంపై ఒక్కో రుచి ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపుతుంది. అదెలాగంటే..

తీపి: తీపి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే తీపి కొన్ని రకాల సమస్యలకు మూలంగా ఉంటుంది. ఒబెసిటీ, డయాబెటిస్, గుండె సమస్యలు, హైపో థైరాయిడ్ లాంటి సమస్యలకు తియ్యగా ఉన్న పదార్థాలు సమస్యగా మారొచ్చు. అందుకే ఈ సమస్యలు ఉన్నవాళ్లు తీపికి దూరంగా ఉంటే మంచిది.

పులుపు: పులుపుకి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో హెల్ప్ చేస్తుంది. పులుపు యాసిడ్స్(ఆమ్లాలు)కు ఉండే రుచి. వాటి వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. ఎసిడిటీ, హార్ట్ బర్న్, పూత, తామర, సోరియాసిస్ లాంటి సమస్యలు ఉన్న వాళ్లు పులుపుకి దూరంగా ఉండాలి.

ఉప్పు: రుచులన్నింటిలో ఉప్పు చాలా ముఖ్యమైంది. దీన్ని సరైన మోతాదులో తీసుకుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ జరుగుతుంది. శరీరంలో వ్యర్థాలు తీసివేయడానికి, ఆహారం జీర్ణం చేయడానికి కూడా ఉప్పు సాయపడుతుంది. అయితే ఉప్పు మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు రాలిపోవడం, బట్టతల, రక్తం చిక్కబడడం, బలహీనంగా తయారవడం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే ఉప్పును సరిపడినంత మేరకే తీసుకోవాలి తప్ప ఎక్కువగా వాడడం మంచిది కాదు.

కారం: కారాన్ని చాలారకాల వంటల్లో వాడతాం. కారంతో ఎన్నో ఉపయోగాలున్నాయి. కారం లేదా ఘాటు రుచులు ఆహారం జీర్ణమవ్వడానికి, నోటిని శభ్రపరచడానికి, రక్త ప్రసరణ మెరుగు పడడానికి సాయపడుతాయి. అయితే కారం ఎక్కువైతే కొన్ని సమస్యలు కూడా తప్పవు. కారం ఎక్కువగా తీసుకుంటే ఇంపొటెన్సీ, డయేరియా, గ్యాస్, వికారం, వాంతులు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చేదు: చేదుకు యాంటీ టాక్సిక్ లక్షణం ఉంటుంది. వేడి తగ్గించడానికి, చర్మ సమస్యలు నివారించడానికి, ఎక్కువగా ఉన్న కొవ్వును కరిగించడానికి చేదు బాగా ఉపయోగపడుతుంది. కానీ చేదు ఎక్కువైతే.. కండరాలు, ఎముకల క్షీణతకు దారితీస్తుంది. అంతేకాకుండా చర్మం పొడిబారడం, మలబద్ధకం లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

వగరు: చాలారకాల పండ్లు, కూరగాయలు వగరు రుచితో ఉంటాయి. వగరుకి శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. ఇది వేడి, నోటి పూత, కొన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వగరు ఎక్కువగా తీసుకుంటే న్యూరో మస్కులర్( నాడీ కండరాల) సమస్యలు, మల బద్ధకం, రక్తప్రసరణ సమస్యలు వచ్చే ప్రమాదముంది.

ఏ రుచినైనా తీసుకోవాల్సిన మేరకు తీసుకుంటే ఒక్కో రుచి ఒక్కో రకమైన మేలు చేస్తుంది. కానీ వీటిలో దేని శాతం ఎక్కువైనా ఏదో ఒక సమస్య తప్పదు. అందుకే ఆహారంలో అన్ని రుచులు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి.

First Published:  13 Sept 2023 12:00 PM IST
Next Story