తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలివే
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం అన్న విషయం తెలిసిందే. ఎన్నో పోషకాలు ఉన్న ఈ పాలు పసిపిల్లల్ని చాలా ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి.
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం అన్న విషయం తెలిసిందే. ఎన్నో పోషకాలు ఉన్న ఈ పాలు పసిపిల్లల్ని చాలా ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి. అయితే గత కొంత కాలంగా తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వకపోవడం అనే ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అప్పుడే తల్లయిన వాళ్ళలో దాదాపు 30 శాతం మంది మహిళలు ఏదో ఒక కారణం వల్ల తల్లిపాలు ఇవ్వడం లేదు. గత రెండు మూడేళ్లుగా ఇలాంటి మహిళల సంఖ్య వేగంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
అప్పుడే పుట్టిన బిడ్డ తీసుకున్న ఆహారం తేలిగ్గా, సులభంగా జీర్ణం కావడానికి తల్లిపాలే సరైనవి. ఈ తల్లిపాల ద్వారానే బిడ్డకు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు, మిటమిన్లు, మినరల్స్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అందుతాయి. అంతేకాదు.. వాటిలో ఎలాంటి హానికరమైన సూక్ష్మక్రిములు ఉండవు. కాబట్టి వీటిని తీసుకున్న పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల మెదడు చురుగ్గా పని చేస్తుందని, అలాంటి వారు చదువులో బాగా రాణిస్తారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నాలుగు నుంచి 5 రోజులపాటూ తల్లి వక్షోజాల్లో ఉత్పత్తయ్యే పాలను 'ముర్రు పాలు' అంటారు. ఇవి పాపాయికి ఎలాంటి అలర్జీ, ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయి. అలాగే ఈ పాలు బిడ్డ జీర్ణవ్యవస్థకు ఎలాంటి హాని కాలగనివ్వవు. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అంతే కాదు ఎదిగే బిడ్డ వయసుకు తగ్గ బరువు ఉండేలా చూడడంలోనూ తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి. కేవలం చిన్నప్పుడే కాదు.. పెద్దయ్యాక కూడా అధిక బరువు, స్థూలకాయం.. వంటి సమస్యల బారిన పడకుండా కూడా కాపాడతాయి. బిడ్డకు ఆరు నెలల వయసొచ్చే వరకు తల్లిపాలే సంపూర్ణ ఆహారం. అయితే ఆరు నెలలు దాటిన తర్వాత చాలామంది పిల్లలకు ఘనాహారం ఇవ్వటం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో తల్లిపాలు ఇవ్వడం ఆపేస్తుంటారు. దీని ఫలితంగా పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆరు నెలలు దాటిన తర్వాత కూడా పిల్లలకు ఘనాహారంతో పాటు మధ్యమధ్యలో తల్లిపాలు కూడా ఇవ్వడం మంచిది. కనీసం సంవత్సరం వరకైనా వీటిని కొనసాగించడం బిడ్డకే కాదు తల్లికి కూడా శ్రేయస్కరం.