Telugu Global
Health & Life Style

ఒంట‌రిత‌నం అంటే భయపడేవారికి భలే పరిష్కారాలు!!

ఒంటరిగా ఉండాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా ప్రపంచంలో అతిపెద్ద సమస్య అదే అన్నట్టు ఫీలైపోతారు. అలా జరగకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.

ఒంట‌రిత‌నం అంటే భయపడేవారికి భలే పరిష్కారాలు!!
X

ఈ ప్రపంచంలో మనిషిని భయపెట్టే విషయాలు కొన్ని ఉంటాయి. చిన్న విషయమా పెద్దవిషయమా అనే తేడా లేకుండా అన్నివిషయాలు భయపెట్టేవే. అనుభవించేవారికే ఆ భయం వల్ల కలిగే ఇబ్బంది అర్థమవుతుంది. అలాంటి భయాలలో ఒకటి ఒంటరిగా ఉండలేకపోవడం. చాలామంది ఎప్పుడూ ఎవరితోనో ఒకరితో ఉంటారు, ఎవరితోనో ఒకరితో కలసి తిరుగుతూ ఉంటారు. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, చదువుకోవడానికి కాలేజీలకు వెళ్తున్నా, ప్రయాణాలు చేస్తున్నా ఇలా అన్ని సందర్భాలలో తోడుగా ఎవరో ఒకరుంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒంటరిగా ఉండాలంటే భయపడిపోతారు. ఒంటరిగా ఉండాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా ప్రపంచంలో అతిపెద్ద సమస్య అదే అన్నట్టు ఫీలైపోతారు. అలా జరగకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.

◆ ఒంటరితనమంటే భయపడేవారు ఎప్పుడూ బహిర్ముఖులుగా ఉంటారు. వీళ్లకు ఎప్పుడూ తమ చుట్టూ సందడి సందడిగా ఉండాలి. నలుగురిలో కలుస్తూ, నలుగురితో తిరుగుతూ రోజంతా గడిపేస్తారు. వీళ్లకు ఒంటరితనమంటే లోలోపల భయం ఉంటుంది.

◆ అంతర్ముఖులు బహిర్ముఖులకు వ్యతిరేకంగా ఉంటారు. వీళ్లకు ఒంటరిగా ఉండటం నచ్చుతుంది. ఏ పనిచేసిన ఒంటరిగా చేయడానికి ఇష్టపడతారు. ఒంటరితనంలోనే వీళ్లకు సంతోషం ఉంటుంది.

అందుకే ఒంటరితనాన్ని భయపడేవాళ్ళు ఖచ్చితంగా బహిర్ముఖులే అయ్యుంటారని మనస్తత్వవేత్తలు తెలిపారు. అయితే ఒంటరితనమంటే భయం ఉండి ఎవరో ఒకరిని వెంట ఉంచుకున్నా కొన్నిసార్లు ఒక్కరే ఉండాల్సిన సందర్భాలు వస్తుంటాయి. కాబట్టి ఒంటరితనంగా ఉండటం కూడా అలవాటు చేసుకోవాలని, ఒంటరిగా ఉండటం అంటే తమతో తాము ఉండటమని, ఒంటరితనం మనిషికి జీవితంలో ఎంతో గొప్పగా సహాయపడుతుందని, మానసిక ఆరోగ్యాన్ని ఇది పెంచుతుందని ప్రముఖ మనస్తత్వవేత్త మాలిని సభా తెలిపారు.

కొత్తగా నేర్చుకోవడానికి!!

◆ ఒంటరితనం అనేది చాలా విలువైన సమయాన్ని అందిస్తుంది. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి చాలా గొప్ప అవకాశం ఒంటరితనం. ఎవ్వరూ డిస్టర్బ్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల ఎంతో ఏకాగ్రత ఏర్పడుతుంది. వ్యక్తిలో పూర్తి శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి.

◆ రాయడం, బొమ్మలు గీయడం, పాటలు పాడటం, డాన్స్ వేయడం, పెయింటింగ్, ఒంటరిగా సాధన చేసే ఆటలు, ఫొటోగ్రఫీ ఇలా ఏవైనా కావచ్చు. ఒంటరిగా చేసేటప్పుడు చాలా గొప్ప ఫలితాన్ని, చాలా తొందరగా రాబట్టవచ్చు.

సోషల్ మీడియాను దూరంగా!!

◆ ఒంటరిగా ఉన్నప్పుడు చాలామంది సోషల్ మీడియాలోకి దూరిపోతుంటారు. దానివల్ల ఒంటరితనం అనేది మనసులో ఉండనే ఉండదు. అయితే సోషల్ మీడియా అనేది మెల్లిగా చాపకింద నీరులా మారిపోయే వ్యసనం.

◆ సోషల్ మీడియా వల్ల వ్యక్తుల మధ్య పోలికలు, పోటీలు, కౌంటర్లు, గొడవలు చాలా తొందరగా జరుగుతాయి. వ్యక్తిగత విషయాలు ఏవైనా షేర్ చేసుకున్నా చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. అందుకే సోషల్ మీడియా నుండి దూరం ఉండటానికి ఒంటరితనం చాలా బాగా పనిచేస్తుంది. ఒంటరితనానికి అలవాటు పడితే సోషల్ మీడియా వ్యసనం చాలా తగ్గుతుంది.

వ్యక్తిగత శ్రద్ధ!!

◆ వ్యక్తిగత శ్రద్ధ పెరగాలంటే ఒంటరిగా ఉన్నప్పుడే సాధ్యమంటున్నారు మాలిని సభా!! ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని చాలా బాగా గమనిస్తూ చేయడమే ఇందుకు కారణం. వ్యాయామం చేయడం, యోగ, ధ్యానం వంటివి శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి.

◆ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కరే నచ్చిన ఆహారం వండుకుని ఆస్వాదిస్తూ తినడం, లేకపోతే బయటకెళ్లి నచ్చినట్టు తినడం, నచ్చిన చోటుకు ప్రయాణం చేయడం, పరిసరాలను పరిశీలిస్తూ అనుభూతి చెందడం వల్ల వ్యక్తి ఆలోచనల్లో చాలా పరిపక్వత వస్తుంది.

ప్రకృతికి దగ్గరగా!!

◆ మనిషికి ప్రకృతి ఇచ్చినంత ఊరట ఇంకేదీ ఇవ్వదు. చెట్లు, చల్లని వాతావరణం, పక్షులు, జంతువులు, నీటి ప్రవాహాలు మొదలైనవి మనిషిలో ఒక శక్తిని నింపుతాయి.

◆ తోటపని చేయడం, చిన్నచిన్న ట్రెక్కింగ్, దగ్గరలో ఉన్న పార్క్ లకు వెళ్లడం, సైకిల్ పైన వాహనాలు లేని ప్రాంతాలకు అలా వెళ్ళిరావడం, అప్పుడప్పుడు అడవులలో ఉన్న పచ్చదనం మధ్యకు విహార యత్రలా వెళ్ళిరావడం. గొప్ప అనుభూతిని, గొప్ప మానసిక, శారీరక శక్తిని ఇస్తాయి.

◆ సాధారణంగా మనుషుల్లో ఉండే స్వల్పకాలిక అనారోగ్యాలు , దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటే తగ్గుతాయి.

కృతజ్ఞతాభావం!!

◆ మనకున్నదానితో తృప్తి పడటం అనేది చాలా గొప్ప లక్షణం. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరినివారు తరచిచూసుకుని తమకున్నదానిపట్ల తృప్తిపడటం, తమకు తాము కృతజ్ఞత చెప్పుకోవడం వల్ల వ్యక్తులలో ఏదో లోటు ఉండిపోయింది అనే అసంతృప్తిని పోగొట్టుకోవచ్చు.

◆ మనుషుల్లో నిరాశ, నిస్పృహ, ఆత్మన్యూనతాభావం, తమని తాము తక్కువ చేసుకోవడం వంటివన్నీ ఒంటరితనంగా ఉండి ఆత్మవిమర్శ చేసుకోవడం వల్ల తగ్గిపోతాయి.

◆ జీవితంలో తీసుకోవలసిన నిర్ణయాలు, చేయాలనుకునే పనులు, చేయకూడనివి, భవిష్యత్తు కోసం ధైర్యంగా వేయవలసిన అడుగులు. ఇలా అన్ని విషయాల గురించి ఆలోచించికునే అవకాశం కేవలం ఒంటరిగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.

కాబట్టి ఒంటరితనం అనేది సమస్య కాదు, అది మనిషిని ఇబ్బందిపెట్టే అంశం అంతకన్నా కాదు. ఆలోచన ఉండాలి కానీ ఒంటరితనంలోనే చాలా గొప్పగా ఆలోచించి, మంచి నిర్ణయాలు తీసుకోగలుతారు. కాబట్టి ఒంటరిగా ఉండే సమయం దొరికితే వదులుకోకండి.

First Published:  24 July 2022 1:32 PM IST
Next Story