Telugu Global
Health & Life Style

జనరల్ వాటర్ vs మినరల్ వాటర్? ఏవి బెటర్?

తాగే నీళ్ల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్దతి. ఒకళ్లు మినరల్ వాటర్ తాగితే ఒకళ్లు మున్సిపల్ వాటర్ తాగుతారు. మరికొందరు వాటర్‌ ప్యూరిఫయర్ వాడతారు.

జనరల్ వాటర్ vs మినరల్ వాటర్? ఏవి బెటర్?
X

తాగే నీళ్ల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్దతి. ఒకళ్లు మినరల్ వాటర్ తాగితే ఒకళ్లు మున్సిపల్ వాటర్ తాగుతారు. మరికొందరు వాటర్‌ ప్యూరిఫయర్ వాడతారు. అసలు ఇంతకీ ఏ నీళ్లు మంచివి? మనం తాగే నీళ్లలో ఏమేం ఉండాలి?

సాధారణంగా తాగే నీటిలో ఖనిజలవణాలు ఉండాలి. ప్రతి లీటర్‌ నీళ్లలో క్యాల్షియం మోతాదు 75 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం 30మిల్లీ గ్రాములు, ఐరన్‌ మోతా దు 0.3 మిల్లీ గ్రాములు ఉండాలి. లీటర్‌ నీటిలో ఫ్లోరైడ్‌ మోతాదు 1 మిల్లీ గ్రాము కంటే తక్కువగా ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచికల ప్రకారం లీటరు నీటిలో టోటల్ డిసాల్వబుల్ సాల్వెంట్స్ (టీడీఎస్) 50 నుంచి100 లోపు ఉండాలి. మరి మనం తాగేనీళ్లలో ఇవన్నీ ఉంటున్నాయా?

ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్

అన్ని ఖనిజలవణాలు సహజంగా లభించే నీళ్లు కొండలు, నదులు లేదా బావుల్లో దొరుకుతాయి. అయితే మినరల్ వాటర్ పేరుతో మనం తాగే నీళ్లలో ఎలాంటి మినరల్స్ ఉండవు. వాటర్ ప్లాంట్లలో శుద్ధి చేసిన వాటర్ క్యాన్‌లపైన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అని స్పష్టంగా రాస్తారు. కానీ, వాడుకభాషలో వాటిని మినరల్ వాటర్ అని పిలుస్తుంటారు. నీళ్ల మీద అవగాహన లేని చాలామంది ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను మినరల్ వాటర్‌ అనుకుంటున్నారు. సహజంగా లేదా కృత్రిమంగా అయినా సరే మినరల్స్ ఉంటేనే దానిని మినరల్ వాటర్ అని పిలవాలి. కేవలం కొన్ని బ్రాండెడ్ కంపెనీలు మాత్రమే నిజమైన మినరల్స్‌ను అందిస్తున్నాయి. వాటి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

ఇవి బెటర్..

ఇళ్లల్లో వాడుకునే వాటర్ ప్యూరిఫయర్లలో ఆర్‌వో(రివర్స్‌ ఆస్మాసిస్‌) టెక్నాలజీ వాడతారు. ఇదొక వాటర్‌ ఫ్యూరిఫికేషన్‌ టెక్నాలజీ. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌‌తో పోలిస్తే ఆర్‌వో వాటర్‌ తాగటం కొంత వరకు మంచిదే. ఆర్‌వో వల్ల నీళ్లలో శరీర పోషణకు అవసరమయ్యే లవణాలు, ఖనిజాలు కొంత వరకు తగ్గినా నాసికరం ప్లాస్టిక్ క్యాన్‌లో అమ్మే ప్యాకేజ్డ్ వాటర్‌ కంటే ఇవి బెటర్. కానీ, ఎక్కువ కాలం వీటిని ఉపయోగిస్తే కూడా కొన్ని సమస్యలు తప్పవు.

ఇక మున్సిపల్ వాటర్ విషయానికొస్తే.. గోదావరి, కృష్ణా, మంజీర నదుల నుంచి ఫిల్టర్ చేసి సరఫరా చేసే ఈ నీళ్లలో మిగతా నీళ్ల కంటే ఎక్కువ మినరల్స్ ఉంటాయి. వీటిలో టీడీఎస్ 50 నుంచి 100 లోపు ఉంటుంది. వీటిని కాచి చల్లార్చుకుని తాగితే ఇంకా మంచిది. మనకున్న అన్ని ఆప్షన్స్‌లో ఇదే మంచి ఆప్షన్.

తాగే నీళ్లవిషయంలో జాగ్రత్త తీసుకోక పోతే మెగ్నీషియం, క్యాల్షియం లోపంతో గుండె సమస్యలు వచ్చే అవకాశముంది. కండరాల నొప్పులతోపాటు బీపీ, గ్యాస్, అల్సర్స్, తలనొప్పి, గుండెకొట్టుకోవడంలో మార్పులు వచ్చే అవకాశముంది. కాబట్టి తాగే నీటి విషయంలో జాగ్రత్త వహించాలి.

First Published:  17 Aug 2024 1:01 PM IST
Next Story