Telugu Global
Health & Life Style

ఒంటరిగా ఫీలవుతున్నారా? ఇలా చేసి చూడండి!

యాంగ్జైటీ, డిప్రెషన్ లాగానే ఒంటరితనం అనేది కూడా ఒక మానసిక సమస్య

ఒంటరిగా ఫీలవుతున్నారా? ఇలా చేసి చూడండి!
X

యాంగ్జైటీ, డిప్రెషన్ లాగానే ఒంటరితనం అనేది కూడా ఒక మానసిక సమస్య. ఇటీవలి కాలంలో ఇది మరింత ఎక్కువవుతోందని స్టడీలు చెప్తున్నాయి. టీనేజ్ పిల్లల నుంచి మధ్య వయస్కుల వరకూ చాలామంది లోన్లీనెస్‌తో బాధ పడుతున్నారట. మరి దీన్నుంచి బయటపడేదెలా?

లోన్లీనెస్ అనేది తట్టుకోలేని మానసిక వ్యధ. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతూ, తమపై తమకు ద్వేషం పెంచుకుంటారు. కారణం లేకపోయినా అనవసరంగా బాధ పడుతుంటారు. ఈ బాధతో కొంతమందికి విపరీతమైన ఆలోచనలు కూడా వస్తాయి. అందుకే ఒంటరితనాన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవాలి.

రెండు రకాలు

ఒంటరితనం అనేది ప్రతీ ఒక్కరికీ ఏదో దశలో ఎదురయ్యే ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్ మారినప్పుడో, హాస్టల్‌లో చేరినప్పుడో, బ్రేకప్ అయినప్పుడో, ఇష్టమైన వాళ్లు దూరం అయినప్పుడో.. ఇలా ఏదో ఒక టైంలో ఒంటరిగా ఫీలయ్యే ఉంటారు. అయితే ఇలాంటి ఒంటరితనం కొంతకాలానికి పోతుంది. ఈ తరహా లోన్లీనెస్ గురించి అంతగా బాధపడాల్సిన పని లేదు. కానీ, కొన్ని సందర్భాల్లో వచ్చే ఒంటరితనం ఎప్పటికీ పోకుండా అలానే ఉంటుంది. ఉదాహరణకు జీవితంలో ఏదైనా పెద్ద ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు, ఇష్టమైన వాళ్లు మరణించినప్పుడు.. తీవ్రమైన డిప్రెషన్‌తో ఒంటరితనంలోకి వెళ్లిపోతారు కొంతమంది. అప్పుడు అదొక సమస్యలా కాకుండా డిజార్డర్‌‌గా మారుతుంది. దీన్నుంచి వీలైనంత త్వరగా బయటపడాలి.

బయటపడాలంటే..

లోన్లీగా ఫీలయ్యే వాళ్లు ఎప్పుడూ డల్‌గా కూర్చోకుండా యాక్టివ్‌గా ఉండే ప్రయత్నం చేయాలి. వ్యాయామం, ఆటల వంటివి అలవాటు చేసుకోవాలి. అలా బయటకు వెళ్లి వస్తుండాలి. మనుషులతో ఎక్కువగా గడుపుతుంటే ఒంటరితన క్రమంగా తగ్గుతుంది.

ఈమధ్య కాలంలో లోన్లీనెస్ పెరగడానికి టెక్నాలజీ కూడా ఒక కారణం. మొబైల్స్ మనుషుల్ని మరింత ఒంటరిగా మారుస్తున్నాయని స్టడీలు చెప్తున్నాయి. చాలామంది ఒంటరిగా అనిపించినప్పుడు టీవీ, మొబైల్ లాంటి ఎలక్ర్టానిక్‌ వస్తువులతో టైం స్పెండ్ చేస్తారు. ఈ అలవాటు వల్ల ఒంటరితనం మరింత పెరుగుతుంది.

ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్లకు మనుషులంతా నెగెటివ్‌గా కనిపించడం సహజం. చుట్టుపక్కల వాళ్లు నన్ను ఇష్టపడడం లేదు అనే భావన ఉంటుంది. ఇలాంటి అభిప్రాయాన్ని వదిలేయాలి. అలాంటి ఆలోచనలన్నీ ఒంటరితనం వల్ల కలిగేవే.. కానీ నిజమైనవి కావని గుర్తించాలి.

ఒంటరిగా ఫీలయ్యే వాళ్లు ఎవరితో అంతగా మాట్లాడ్డానికి ఇష్టపడరు. అందుకే ముందు మాట్లాడ్డంతో మొదలు పెట్టాలి. ఎప్పుడు, ఎక్కడున్నా.. మనసులో అనిపిస్తున్న భావాన్ని ఎవరో ఒకరితో చెప్పుకోవాలి. మొహమాటాన్ని వదిలేసి కలుపుగోలుగా ఉండడానికి ట్రై చేయాలి.

ఒంటరితనం ఒక ఉచ్చు లాంటిది. దీన్నుంచి బయటపడటానికి చాలా ప్రాక్టిస్, ఎంతో ధైర్యం కావాలి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఒంటరి వ్యక్తులు కారు. కలుపుకుంటూ పోతే అందరూ స్నేహితులే. చేయాల్సిందల్లా ఒక మాట కలపడం అంతే.

ఇకపోతే ఒంటరితనం బాగా వేధిస్తున్నప్పుడు, దాన్నుంచి బయటపడలేకపోతున్నప్పుడు సైకాలజిస్టుల సాయం తీసుకోవడం మేలు చేస్తుంది.

First Published:  22 May 2024 9:53 AM IST
Next Story