వడదెబ్బ విషయంలో తెలుసుకోవాల్సిన విషయాలివే..
సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో వేడి ఎక్కువై.. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎంతలా అంటే ఇండ్లలో నుండి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట తిరిగినవారు వడదెబ్బకు గురవుతున్నారు. . ప్రజలు తమ జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో వడదెబ్బ అంటే ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసుకుందాం.
సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో వేడి ఎక్కువై.. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో శరీరం ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది. ఆ సమయంలో అత్యవసర చికిత్స అందించకపోతే.. శాశ్వత వైకల్యం లేదా మరణానికి కారణమవుతుంది. అందుకే ఈ హీట్ స్ట్రోక్ పట్ల అందరూ అవగాహనతో ఉండాలి.
లక్షణాలు . .
వడదెబ్బ వల్ల శరీరంలోని నీటి శాతం కోల్పోతారు. చెమట పట్టడం నిలిచిపోతుంది. నాడి వేగం పెరుగుతుంది. శరీరం అదుపు తప్పుతుంది. మెదడు స్వాధీనంలో ఉండకపోవడం వల్ల గందరగోళానికి గురవుతారు. కళ్లు మసకబారుతాయి. వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే కోమా లోకి జారుకుంటారు. పొడి చర్మం ఉండేవారు కూడా త్వరగా వడదెబ్బకు గురవుతారు. శరీరంలోని రక్త కణాలు కుంచించుకుపోవడం వల్ల కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయి. వడదెబ్బ యాక్సిడెంట్ లాంటిది.. అనుకోకుండా సంభవిస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు తీస్తుంది.
జాగ్రత్తలు
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. లేత రంగులు, తేలికై న కాటన్ దుస్తులు ధరించాలి. భోజనం మితంగాను , నీళ్ళు ఎక్కువగానూ తీసుకోవాలి. రోజుకు 15 గ్లాసుల నీళ్లు తాగాలి. ఎండ వేళ ఇంటి పట్టును ఉండటం అన్ని విధాలా శ్రేయస్కరం. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపి వంటివి తీసుకెళ్లాలి.