చెవి, ముక్కు, గొంతు సమస్యలు రాకుండా ఉండాలంటే..
చెవి, ముక్కు, గొంతు అవయవాలు తల భాగంలో ఉండడం మూలంగా బాధ తీవ్రత, నొప్పి భరించలేనంతగా ఉంటాయి.
మిగతా అనారోగ్య సమస్యలతో పోలిస్తే చెవి, ముక్కు, గొంతుకి వచ్చే సమస్యల్లో బాధ ఎక్కువగా ఉంటుంది. పైగా వీటికి ట్రీట్‌మెంట్ కూడా కష్టమే. అందుకే వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.
చెవి, ముక్కు, గొంతు అవయవాలు తల భాగంలో ఉండడం మూలంగా బాధ తీవ్రత, నొప్పి భరించలేనంతగా ఉంటాయి. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు విడివిడిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..
చెవి ఆరోగ్యం
చెవి సమస్యలు, వినికిడి లోపం వంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యాయి. దానికి గల కారణం ఇయర్ ఫోన్స్ వాడకం పెరగడమే. గ్యాప్ లేకుండా చెవుల్లో బడ్స్‌ను ఉంచుకోవడం కారణంగా చెవుల్లో బ్యాక్టీరియా పెరగడమేకాక కర్ణభేరి ఒత్తిడికి గురవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి చెవి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఇయర్ ఫోన్స్ వాడకాన్ని తగ్గించాలని గుర్తుంచుకోవాలి.
ఇక దీంతోపాటు చెవుల్లో కాటన్ బడ్స్ పెట్టి తిప్పడం, పెద్ద శబ్దాలు వినడం ద్వారా కూడా చెవి సమస్యలు వస్తాయి. చెవులను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం అప్పుడప్పుడు గోరు వెచ్చని నీటితో చెవులను శుభ్రం చేసుకోవాలి. చెవి ప్రాంతంలో నొప్పిగా అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా ఈఎన్‌టీ డాక్టర్‌ను సంప్రదించాలి.
ముక్కు ఆరోగ్యం
ముక్కు ఆరోగ్యం శ్వాస వ్యవస్థ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సైనస్ వంటి సమస్యలు, దగ్గు, జలుబు వంటివి ఈ కోవలోకి వస్తాయి. ముక్కు కారడం, పట్టేయడం, నొప్పి వంటివి రాకుండా ఉండేందుకు ఇమ్యూనిటీని సరిగ్గా చూసుకోవాలి.
స్మోకింగ్, డ్రగ్స్ వంటివి ముక్కు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అలాగే కాలుష్యం, పొగ, దుమ్ము వంటి వాటికి కూడా వీలైనంత దూరంగా ఉంటే సైనస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
గొంతు ఆరోగ్యం
గొంతు ఆరోగ్యంగా ఉండేందుకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండడం అవసరం. గొంతు ఇన్ఫెక్షన్లను నివారించడం కోసం చల్లని పదార్థాలను తగ్గించాలి. అలాగే రోజులో ఎక్కువగా మాట్లాడుతూ ఉండే వాళ్లు అంటే టీచర్లు, ప్రొఫెసర్లు, సింగర్ల వంటి వాళ్లు గొంతుకి తగినంత రెస్ట్ ఇవ్వాలి. వీలైనంతవరకూ వేడిగా ఉన్న ద్రవపదార్థాలు తీసుకోవాలి.