మితిమీరిన ఆల్కహాల్ తో .... ముంచుకొచ్చే ముసలితనం
ఆల్కహాల్ అధికంగా తాగేవారిలో శరీరమంతటా అస్థిపంజరంలో ఎముకలకు అంటుకుని ఉండే కండరాలు క్షీణించి పోతాయని ఈ అధ్యయనంలో కనుగొన్నారు.
ఆల్కహాల్ ఆరోగ్యానికి ఎన్నోరకాలుగా హానిచేస్తుందని ఇప్పటికే చాలా అధ్యయనాల్లో రుజువైంది. ముఖ్యంగా గుండె మెదడులకు ఆల్కహాల్ వలన జరిగే హాని మరింత ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈస్ట్ ఏంజిలియా యూనివర్శిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో మరో విషయం వెల్లడైంది. ఆల్కహాల్ వలన శరీరంలోని కండరాలు చాలా వేగంగా కుచించుకుపోతాయని ఈ నూతన అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.
ఆల్కహాల్ అధికంగా తాగేవారిలో శరీరమంతటా అస్థిపంజరంలో ఎముకలకు అంటుకుని ఉండే కండరాలు క్షీణించి పోతాయని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. అంటే మితిమీరిన ఆల్కహాల్ వలన వయసుమీరిన లక్షణాలు త్వరగా కనబడతాయి. సుమారు రెండు లక్షల మంది 37 నుండి 73 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో చాలామంది యాభైలు, అరవైల వయసులో ఉన్నవారు. యుకెలోని ఓ బయో బ్యాంక్ నుండి వీరి జీవనశైలి, ఆరోగ్యాల తాలూకూ వివరాలను సేకరించారు.
రోజుకి పదిలేదా అంతకంటే ఎక్కువ యూనిట్ల ఆల్కహల్ తీసుకునేవారిలో కండరాల క్షీణత చాలా ఎక్కువగా ఉందని, ఆల్కహాల్ తక్కువగా తాగేవారిలో కంటే వీరిలో కండరాలు మరింతగా సాంద్రతని కోల్పోవటం గమనించామని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా ముసలితనంలో కండరాల సాంద్రత తగ్గిపోతుంది. దాంతోవారు బలహీనంగా శక్తిహీనంగా మారుతుంటారు. అనారోగ్యాలకు గురవుతుంటారు. అయితే మధ్య వయసు, ఆపైన వయసులో ఉన్నవారు ప్రతిరోజు అధిక మోతాదులో ఆల్కహాల్ తీసుకోవటం వలన తమ అసలు వయసుకంటే ఎక్కువ వయసున్నవారిలా కనబడతారని, ముందుగానే ముసలితనం తాలూకూ సమస్యలను ఎదుర్కొంటారని అధ్యయనం చెబుతోంది. ఆల్కహాల్ ని మానడానికి మరొక కారణం తెరపైకి వచ్చిందని పరిశోధకులు వెల్లడించారు.
కండరాల సాంద్రత తగ్గిపోతే...
-ఒక కాలు లేదా చేయి... మరొక కాలు లేదా చేయికంటే చిన్నగా కనబడుతుంది
-ఒక కాలు లేదా ఒక చేయి బలహీనంగా మారతాయి.
-కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు ఉంటాయి. మొద్దుబారినట్టుగా అవుతుంటాయి.
-నడవటంలో, శరీరాన్ని బ్యాలన్స్ చేసుకోవటంలో సమస్యలు ఉంటాయి.
-మాట్లాడటం లేదా మింగటం కష్టంగా మారుతుంది.
-క్రమంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.