Telugu Global
Health & Life Style

మహిళలకున్న ఈ శక్తులు తెలుసా మీకు..

పురుషులతో పోల్చితే.. మహిళల శరీర నిర్మాణం, పనితీరుల విషయంలో ఉన్న మరికొన్ని భిన్నత్వాలను ఇప్పుడు తెలుసుకుందాం.. నిద్రలో వినిపించే శబ్దాలకు మగవారికంటే ఎక్కువగా స్పందిస్తారన్నమాట. అందుకే పిల్లలు ఏడ్చినప్పుడు మహిళలకు త్వరగా మెలుకువ వస్తుంది.

మహిళలకున్న ఈ శక్తులు తెలుసా మీకు..
X

వెనుక నుంచి ఎవరైనా పిలిస్తే.. వీలైనంత వరకు మెడని తిప్పి చూస్తాం కదా.. అయితే ఇలా తిప్పటంలో స్త్రీ, పురుషుల్లో తేడాలుంటాయి. మహిళలు మగవారికంటే ఎక్కువగా మెడని వెనక్కు తిప్పగలుగుతారట. మహిళల శరీర కండరాలకు సాగే గుణం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. మగవారి కండరాలకు అలాంటి మృదుత్వం తక్కువ. దాంతో వారి మెడ కదలికలు కూడా అంత మృదువుగా ఉండవు. అందుకే వారు వెనుక నుంచి ఎవరైనా పిలిస్తే.. శరీరం మొత్తం వెనక్కు తిప్పి చూస్తుంటారట. అయితే మెడని ఇలా తిప్పే అవకాశం ఉండటం వలన మహిళలు మగవారికంటే ఎక్కువగా మెడనొప్పుల బారిన పడుతుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషులతో పోల్చితే.. మహిళల శరీర నిర్మాణం, పనితీరుల విషయంలో ఉన్న మరికొన్ని భిన్నత్వాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కొంతమంది నిద్రపోతున్నపుడు చిన్నపాటి శబ్దాలు వచ్చినా వెంటనే మేలుకుంటూ ఉంటారు కదా. అయితే మగవారితో పోల్చినప్పుడు ఇలాంటి సున్నితత్వం మహిళలలో ఎక్కువగా ఉంటుందట. అంటే వారు నిద్రలో వినిపించే శబ్దాలకు మగవారికంటే ఎక్కువగా స్పందిస్తారన్నమాట. అందుకే పిల్లలు ఏడ్చినప్పుడు మహిళలకు త్వరగా మెలుకువ వస్తుంది. అయితే ఈ శబ్దాలు మరీ ఎక్కువ స్థాయిలో ఉన్నపుడు మాత్రమే స్త్రీలకు మెలకువ వస్తుందట. కనుక వారికి మరీ ఎక్కువగా నిద్రాభంగం కాదు.. కాకపోతే మగవారితో పోల్చినప్పుడు మహిళల్లోనే స్లీప్ డిజార్డర్లు ఎక్కువగా ఉంటాయి.

మహిళలు మగవారికంటే ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారని, మగవారి ఆలోచనలు మహిళల కంటే హేతుబద్దంగా ఉంటాయని అనుకుంటాం కదా.. కానీ, అది నిజం కాదట. మన మెదడులో ఉండే కార్టెక్స్ అనే భాగానికి మన తెలివితేటలకు సంబంధం ఉంటుంది. మగవారితో పోల్చినప్పుడు మహిళల్లో ఈ మెదడు భాగం మందంగా ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. అలాగే మగవారిలో.. భావోద్వేగాలు, నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రభావితం చేసే మెదడు భాగాలు పెద్దగా ఉన్నాయని కూడా పరిశోధనలు చెబుతున్నాయి.

మానవ సంబంధాల విషయంలో మహిళలకంటే మగవారు ముందుంటారని మనం భావిస్తుంటాం కదా.. కానీ ఇది కూడా నిజం కాదు. ప్రేమ హార్మోను అని పిలువబడే ఆక్సిటోసిన్ మగవారిలో కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోను ఒత్తిడిని తగ్గించి అనుబంధాలను పెంచుతుంది. కనుక మగవారికంటే మహిళలే బలమైన అనుబంధాలను ఏర్పరచుకోగలుగుతారు.

మగవారితో పోల్చినప్పుడు స్త్రీల శరీరాలు తమ ఇరవైల వయసులో కూడా ఎక్కువ మార్పులకు లోనవుతుంటాయి. కనుక స్త్రీలు తమ ఇరవైల వయసులో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, బాదం పప్పులు వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. అలాగే వ్యాయామం కూడా చేయటం వలన వారి కండరాలు మరింత బలంగా తయారవుతాయి. నిర్ణయాలు తీసుకోవటంలో కీలకంగా వ్యవహరించే మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కూడా స్త్రీలలో వారి ఇరవైల వయసులో కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుందట. కనుక వారిలో నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా ఇరవైల వయసులో మరింతగా పెరుగుతుందని చెప్పవచ్చు.

First Published:  31 July 2022 8:45 AM IST
Next Story