తిన్న వెంటనే ఈ పనులు చేయకూడదని తెలుసా?
భోజనం చేసిన వెంటనే కాఫీ, టీ తాగడం, స్వీట్ తినడం, కునుకు తీయడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటుంటుంది.
భోజనం చేసిన వెంటనే కాఫీ, టీ తాగడం, స్వీట్ తినడం, కునుకు తీయడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటుంటుంది. అయితే ఇవి ఎంతవరకూ మంచివి? డాక్టర్లు ఏమంటున్నారు?
భోజనం తర్వాత చేసే కొన్ని పొరపాట్ల కారణంగా జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయకూడదని చెప్తున్నారు.
ముందుగా తిన్నవెంటనే పడుకునే అలవాటు వలన పొట్టలో ఉత్పత్తయ్యే రసాలు మరింత ఎక్కువై గుండె మంట, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం.. లాంటి సమస్యలొస్తాయి. తిన్న తర్వాత పడుకోవడానికి కనీసం రెండు గంటల గ్యాప్ ఇవ్వాలి. రాత్రి పడుకోవడానికి మూడు గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలి.
తిన్న తర్వాత స్నానం చేసే అలవాటుంటుంది కొంతమందికి. ఇలా చేస్తే.. శరీర ఉష్ణోగ్రతల్లో తేడాలొచ్చి ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. ఈ అలవాటు జీర్ణ సమస్యలకు దారి తీయొచ్చు.
భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలు తాగడం వల్ల శరీరానికి పోషకాలు గ్రహించే శక్తి తగ్గుతుంది. అలాగే భోజనం తర్వాత వెంటనే నీళ్లు తాగడం కూడా అంత మంచిది కాదు. తినడానికి గంట ముందు అలాగే తిన్న గంట తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి.
భోజనం చేసిన తర్వాత వ్యాయామం లాంటివి చేయకూడదు. ఇలా చేస్తే.. కడుపునొప్పి, అజీర్తి లాంటి సమస్యలొస్తాయి.