సువాసనలు మెదడు శక్తిని పెంచుతాయా?
మనకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే అంశాల్లో సువాసనకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. సువాసనలు వెదజల్లే ఆహారమైనా పూలైనా మరే ఇతర వస్తువులైనా మన మనసుకి ఎంతో హాయినిస్తుంటాయి.
మనకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే అంశాల్లో సువాసనకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. సువాసనలు వెదజల్లే ఆహారమైనా పూలైనా మరే ఇతర వస్తువులైనా మన మనసుకి ఎంతో హాయినిస్తుంటాయి. అయితే సుగంధ పరిమళాలు ఆనందాన్ని ఆహ్లాదాన్నే కాదు... ఆరోగ్యాన్ని సైతం ఇస్తాయని అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా పెద్దవయసువారిలో పరిమళాలు మెదడు శక్తిని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కాలిఫోర్నియా యూనివర్శిటీ అందించిన ఈ వివరాలను ఫ్రంటీర్స్ ఇన్ న్యూరోసైన్స్ అనే పత్రికలో ప్రచురించారు. ప్రతిరోజు చక్కని పరిమళాలు వెదజల్లుతున్న ప్రదేశంలో నిద్రపోవటం వలన ఆయా వ్యక్తుల మెదళ్లలో జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాలకు సంబంధించిన మెదడు భాగాల మధ్య అనుసంధానం బాగుంటుందని, దీంతో వారి మెదడు పనితీరు, శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయని ఈ అధ్యయనంలో రుజువైంది. 60-85 సంత్సరాల మధ్య వయసున్న 43 మంది వ్యక్తులపై నిర్వహించిన పరిశోధనలో నిద్రపోయేటప్పుడు మంచి వాసనలను పీల్చడం వలన మెదడు క్షీణత, డిమెన్షియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతున్నట్టుగా తేలింది. సుగంధపరిమళాలను ఆస్వాదిస్తూ నిద్రించినవారిలో అలా నిద్రించనివారిలో పోలిస్తే 226శాతం వరకు మెదడు చురుకుదనం పెరగటం పరిశోధకులు గుర్తించారు.
సాధారణంగా మనుషుల్లో శారీరక, మెదడుకి సంబంధించిన శక్తి సామర్ధ్యాలు క్షీణించడం మొదలుకాకముందే వాసనలను గుర్తించే సామర్ధ్యం తగ్గుతుంటుంది. మెదడు కణాల క్షీణత వలన వాసనలను గుర్తించలేని స్థితి ఏర్పడుతుంది. వాసన గ్రహించే శక్తికి, నరాల పనితీరుకి సంబంధం ఉన్నదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాసన తెలుసుకునే సామర్ధ్యాన్ని కోల్పోవటం అనేది సుమారు 70 రకాల నరాల సంబంధమైన, మానసికపరమైన వ్యాధులు వచ్చే ముప్పుని తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. అల్జీమర్స్, డిమెన్షియాలు, పార్కిన్సన్స్, స్కిజోఫ్రీనియా, ఆల్కహాలిజం ఆ వ్యాధుల్లో ఉన్నాయి. కళ్లు, నోరు, చెవులు లాంటి ఇంద్రియాల ద్వారా మెదడుకి చేరే అంశాలు మొదటగా థాలమస్ అనే గ్రంథికి చేరి తరువాత మెదడుకి చేరుతుంటాయి. కానీ ముక్కుద్వారా వాసనని గ్రహించే వ్యవస్థ మాత్రం నేరుగా మెదడులోని జ్ఞాపకశక్తికి సంబంధించిన భాగాలతో అనుసంధానమై ఉంటుందని న్యూరో బయాలజిస్టులు చెబుతున్నారు.
అరవై ఏళ్ల వయసు తరువాత మనుషుల్లో వాసనని గ్రహించే శక్తి తగ్గుతుంది. అలాగే మెదడు పనితీరు ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. పుదీనా యూకలిప్టస్ వంటి వాసనలు మెదడు ఏకాగ్రతని, శక్తిని పెంచుతాయి. వాసనలతో మెదడు గతాన్ని గుర్తు చేసుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్నిరకాల సుగంధ పరిమళభరితమైన నూనెలు యాంగ్జయిటీని తగ్గించి మెదడు సామర్ధ్యాన్ని పెంచుతాయి. అవి మెదడుకి సంబంధించిన వ్యాధులకు ఉపశమనంగా పనిచేస్తాయని అధ్యయనాల్లో తేలింది.