Telugu Global
Health & Life Style

పరుగుతో రోగాలు... పరుగో పరుగు

మన ఆరోగ్యం చాలా వరకు మన చేతుల్లోనే ఉందనే విషయం చాలా సందర్భాల్లో రుజువవుతూ ఉంటుంది.

పరుగుతో రోగాలు... పరుగో పరుగు
X

మన ఆరోగ్యం చాలా వరకు మన చేతుల్లోనే ఉందనే విషయం చాలా సందర్భాల్లో రుజువవుతూ ఉంటుంది. ఎన్నో పరిశోధనలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అమెరికాలోని ఓ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో ప్రతిరోజు చాలా కొద్ది సమయం పాటు పరిగెత్తినా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పు తప్పుతుందని తేలింది. వారంలో కొన్నిసార్లు ఐదునుండి పదినిముషాలపాటు తక్కువ వేగంతో పరిగెత్తినా మంచి ప్రయోజనం లభిస్తుందని పరిశోధకులు అంటున్నారు. 55వేలమందిపై 15ఏళ్లపాటు నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రన్నింగ్ చేసేవారు చేయనివారింటే మూడేళ్లు ఎక్కువకాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.

రన్నింగ్ తో గుండెవ్యాధులు, ఊబకాయం, టైప్ టు డయాబెటిస్ వచ్చే రిస్క్ తగ్గుతుందని తెలుస్తోంది. కరోనా కాలంలో ఫిట్ గా ఉన్నవారు ఆరోగ్యంగా ఉండగలిగారని పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. సౌత్ కరోలినా యూనివర్శిటీలో ఎక్సర్ సైజ్ సైన్స్ డిపార్ట్ మెంట్ లో రీసెర్చి ప్రొఫెసర్ గా పనిచేస్తున్న 76 ఏళ్ల పేట్.... రన్నింగ్ అందరికీ అందుబాటులోఉండే వ్యాయామమని, పైగా ఖర్చులేనిదని, మన శరీరానికి వారానికి 150 నిముషాల ఒక మాదిరినుండి తీవ్రమైన స్థాయి వ్యాయామం అవసరమవుతుందని చెబుతూ... రోజుకి ఇరవై నిముషాల పాటు పరిగెత్తితే చాలు ఫిట్ గా ఉండవచ్చని సలహా ఇస్తున్నారు. అయితే కొత్తగా రన్నింగ్ చేయాలనుకుంటున్నవారు, ఒకసారి చేసి ఆపేసి తిరిగి మొదలుపెట్టాలని అనుకుంటున్నవారు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

రన్నింగ్ వలన కలిగే లాభాలను చెప్పాలంటే...

క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

♦ అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

♦ గుండెవేగం క్రమబద్ధమవుతుంది.

♦ రక్తంలో చెక్కర నియంత్రణలో ఉంటుంది.

♦ చెడు కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

♦ నడుము చుట్టుకొలత తగ్గుతుంది. ఫిట్ నెస్ పెరుగుతుంది.

♦ మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

♦ కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

♦ ఒత్తిడి తగ్గుతుంది. చక్కని ప్రకృతిలో మనతో మనం గడిపేందుకు తగిన సమయాన్ని పరుగుతో పొందవచ్చు.

అయితే ప్రతిరోజు రన్నింగ్ చేసేవారు... తమ శారీరక స్థితి పట్ల అవగాహనని కలిగి ఉండాలి. ఎక్కువ శారీరక వ్యాయామం వలన కలిగే గాయాలు, నష్టాలు కలగకుండా చూసుకోవాలి. కొన్నికండరాలపై ఎక్కువ భారం పడేలా చేయటం, శరీరంలో తగినంత శక్తి లేకుండా రన్నింగ్ చేయటం మంచిది కాదు. అందుకే రన్నింగ్ చేసేవారు వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉండాలి.

First Published:  12 Sept 2022 12:00 PM IST
Next Story