Telugu Global
Health & Life Style

డయాబెటిస్ ముప్పును ఇలా గుర్తించొచ్చు!

డయాబెటిస్ వస్తే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు డయాబెటిస్ శరీరంలోని చాలా అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది.

డయాబెటిస్ ముప్పును ఇలా గుర్తించొచ్చు!
X

డయాబెటిస్ వస్తే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు డయాబెటిస్ శరీరంలోని చాలా అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. అందుకే డయాబెటిస్ రాకుండా ఉండేందుకు చాలామంది జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్ పెరుగుతున్నప్పుడు ముందే కొన్ని అవయవాలు సూచనలిస్తాయి. వీటిని గమనించడం ద్వారా డయాబెటిస్ సమస్య ముదరకుండా జాగ్రత్తపడొచ్చు.

రక్తంలో షుగర్‌ లెవల్స్ పెరిగినప్పుడు శరీరంలో రకరకాల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా కంటి రెటీనాలోని రక్తనాళాలు ప్రభావితం అవుతాయి. తద్వారా కంటి చూపు మందగించడం, కంటిశుక్లం, గ్లకోమా వంటి కంటి సమస్యలు వస్తుంటాయి. సరైన సమయంలో డయాబెటిస్‌ను గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే కంటిచూపు కోల్పోయే ప్రమాదముంది. కాబట్టి కంటి ఆరోగ్యంలో మార్పులొస్తే జాగ్రత్తపడాలి.

డయాబెటిస్ పాదాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. డయాబెటిస్ వల్ల అరికాళ్లలో రక్త ప్రసరణ తగ్గి పుండ్లు, ఇన్‌ఫెక్షన్‌ లాంటివి వస్తుంటాయి. కాబట్టి కాలికి పుండ్లు అయినప్పుడు తేలిగ్గా తీసుకోకుండా పరీక్షలు చేయించాలి.

రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే కిడ్నీల పనితీరుపై ఎఫెక్ట్ పడుతుంది. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్లు లాంటివి వస్తుంటాయి. కాబట్టి ఇలాటి లక్షణాలు కనిపించినప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.

రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు నరాల పనితీరు కూడా దెబ్బతింటుంది. దానివల్ల కాళ్లు, చేతులు, పాదాలు తిమ్మిరి పడుతుంటాయి. నరాలు లాగడం, మంట, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డయాబెటిస్ వల్ల చిగుళ్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫలితంగా చిగుళ్లలో రక్తస్రావం, నొప్పి వంటివి వస్తుంటాయి. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే షుగర్ టెస్ట్ చేయించాలి.

ఇకపోతే డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన, ప్రాసెస్ చేయని ఆహారాన్ని తీసుకోవాలి. బరువు అదుపులో ఉంచుకోవాలి. రోజూ ఎక్సర్‌‌సైజ్ చేయడం మర్చిపోకూడదు. స్మోకింగ్, డ్రింకింగ్ మానేస్తే మంచిది. గ్లూకోజ్ లెవల్స్ పెంచే హైక్యాలరీ ఫుడ్స్‌కు బదులు ఫైబర్, ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. షుగర్‌‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌‌ను కలిసి సలహా తీసుకోవడం మంచిది.

First Published:  21 Jan 2023 4:56 PM IST
Next Story