Telugu Global
Health & Life Style

సరికొత్త కోవిడ్ వేరియంట్! లక్షణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కరోనా ఒమిక్రాన్‌కు చెందిన పిరోలా వేరియెంట్‌లో ‘జేఎన్‌.1’ అనేది ఒక సబ్ వేరియంట్ అని సైంటిస్టులు గుర్తించారు.

సరికొత్త కోవిడ్ వేరియంట్! లక్షణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
X

చాలా రోజుల తర్వాత కోవిడ్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కేరళలో కరోనా వైరస్‌కు చెందిన కొత్త వేరియెంట్‌ కేసులు బయటపడడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఈ కొత్త వేరియెంట్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలను కోరింది.

కరోనా ఒమిక్రాన్‌కు చెందిన పిరోలా వేరియెంట్‌లో ‘జేఎన్‌.1’ అనేది ఒక సబ్ వేరియంట్ అని సైంటిస్టులు గుర్తించారు. ఈ సబ్ వేరియెంట్‌కు చెందిన మొదటి కేసు సెప్టెంబర్ నెలలో అమెరికాలో బయటపడింది. ఆ తర్వాత చైనాలో కూడా కొన్ని కేసులు బయటపడ్డాయి. తాజాగా ఈ వైరస్ మనదేశంలోకి అడుగుపెట్టింది. అయితే కొత్త వేరియంట్‌ వ్యాప్తి వేగంగా ఉండొచ్చని సెంటర్‌ ఆఫ్‌ డిసీజ్‌ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌ హెచ్చరించింది. ఇప్పటికే కేరళ, కర్నాటక రాష్ట్రాలు 60 ఏళ్లు పైబడిన వాళ్లు తప్పక మాస్క్‌ ధరించాలని నిబంధనలు జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు నిర్వహించాలని, అంతకుముందు పాటించిన విధంగా శుభ్రతా నియమాలు పాటించాలని కోరింది.

జాగ్రత్తలు ఇలా..

ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎలాంటి వైరస్ అయినా కాస్త వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్‌ రాకుండా ఎవరికి వారు జాగ్రత్తపడొచ్చు.

గతంలో కొవిడ్ బారిన పడి ఇబ్బంది పడినవాళ్లు, వయసు పైబడిన వాళ్లు, శ్వాస సంబంధిత సమస్యలున్నవాళ్లు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది.

గతంలో లాగానే జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే.. మామూలు ఇన్ఫెక్షన్ అనుకుని వదిలేయకుండా కాస్త జాగ్రత్త పడడం మంచిది. నాలుగు రోజులకు మించి లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేయించుకోవాలి.

ఈ సబ్ వేరియంట్ అంత ప్రమాదకరమైందని చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ, సింగపూర్‌‌లో వారం వ్యవధిలోనే 56 వేల కేసులు, మలేషియాలోనూ 20వేల కేసులు నమోదయ్యాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం లాంటివి చేస్తే సేఫ్‌గా ఉండొచ్చు.

First Published:  19 Dec 2023 3:47 PM IST
Next Story