భయపెడుతున్న 'చండీపురా’ వైరస్.. లక్షణాలివే..
ఇప్పుడు ప్రజలను భయపెడుతున్న వైరస్ లలో చండీపురా ఒకటి. గుజరాత్‌లోని సబర్‌కాంత, ఆరావళి జిల్లాల్లో చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది.
కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గనే లేదు. ముందంతా రకరకాల వేరియెంట్‌లు , ఆ తరువాత సైడ్ ఎఫెక్ట్ లతో ఏదో ఒక రకంగా తన పంజా విసురుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మరిన్ని ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి.
ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రజలను భయపెడుతున్న వైరస్ లలో చండీపురా ఒకటి. గుజరాత్‌లోని సబర్‌కాంత, ఆరావళి జిల్లాల్లో చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఐదు రోజుల్లో ఆరుగురు పిల్లలను బలి తీసుకుంది.
వైద్యుల సమాచారం ప్రకారం.. గుజరాత్‌లో విధ్వంసం సృష్టిస్తున్న చండీపురా వైరస్ మొదట ఫ్లూ వంటి జ్వరానికి కారణమవుతుంది. మూర్ఛ, వాంతులు, వికారం వంటి సమస్యలతో అపస్మారక స్థితి లోకి వెళ్ళిపోతారు. పిల్లల మెదడు వాచిపోతుంది. దీనినే ఇన్‌సెఫలైటిస్ అంటారు. రోజురోజుకి బాధితుల పరిస్థితి దిగజారుతుంది. 1966 సంవత్సరంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని చాందీపూర్ గ్రామంలో ఇదే వైరస్ కారణంగా 15 ఏళ్లలోపు పిల్లలు చనిపోయారని భావిస్తున్నారు. అప్పటి నుంచి ఈ వైరస్‌కు చండీపురా వైరస్ అని పేరు పెట్టారు.
ఇప్పుడు ఈ వైరస్ గుజరాత్‌లోని పలు జిల్లాలకు వ్యాపించింది. చండీపురా వైరస్ వ్యాప్తికి దోమలు, ఈగలు మరియు రెక్కపురుగులు వంటి కీటకాలు కారణమని భావిస్తున్నారు. ఈ వైరస్ ప్రధానంగా 2-16 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకు సోకుతుంది. ఈ వ్యాధి సోకితే కనిపెట్టడానికి చాలా సమయం పడుతుంది. అలాగే 55-75 శాతం మధ్య మరణాలు సంభవించే అవకాశం కూడా ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. నివారణ చర్యలకు ఉపక్రమించింది.