Telugu Global
Health & Life Style

కార్డియాక్ అరెస్ట్... స్త్రీపురుషుల్లో లక్షణాలు భిన్నం

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చక్కని జీవనశైలి చాలా ముఖ్యం. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలను త్వరగా గుర్తించడం, ఎలాంటి అసౌకర్యం ఉన్నా వెంటనే అప్రమత్తమై హాస్పటల్ కి వెళ్లటం మరింత ప్రధానం.

కార్డియాక్ అరెస్ట్... స్త్రీపురుషుల్లో లక్షణాలు భిన్నం
X

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చక్కని జీవనశైలి చాలా ముఖ్యం. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలను త్వరగా గుర్తించడం, ఎలాంటి అసౌకర్యం ఉన్నా వెంటనే అప్రమత్తమై హాస్పటల్ కి వెళ్లటం మరింత ప్రధానం. కార్డియాక్ అరెస్టుకు ముందు కొన్నిరకాల సంకేతాలు కనబడతాయని వాటిని అశ్రద్ధ చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఒక నూతన అధ్యయనం ప్రకారం కార్డియాక్ అరెస్ట్ కి ఇరవై నాలుగు గంటలముందు యాభై శాతం మందిలో ప్రమాదాన్ని సూచించే లక్షణాలు కనబడుతున్నాయి. సాధారణంగా గుండె రక్తాన్ని పంప్ చేసి శరీరంలోని ఇతర భాగాలకు పంపుతుంది. ఆ పనిని ఆపేయడాన్ని కార్డియాక్ అరెస్టని అంటారు. ఈ స్థితిలో శ్వాస తీసుకోవటం కూడా ఆగిపోతుంది.

స్త్రీ పురుషుల్లో భిన్నంగా...

లాన్ సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్ లో ప్రచురితమైన ఆర్టికల్ లో అధ్యయన ఫలితాలను వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం కార్డియాక్ అరెస్ట్ కి కారణాలు స్త్రీపురుషుల్లో భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. మగవారికి కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు ఛాతీ నొప్పి లక్షణం కనబడుతుండగా మహిళల్లో శ్వాస ఆడకపోవటం ఎక్కువగా కనిపించినట్టుగా పరిశోధకులు గుర్తించారు. అలాగే కొందరు స్త్రీ పురుషుల్లో ఇరు వర్గాల్లోనూ చెమటలు పట్టటం, మూర్ఛ లక్షణాలు కనిపించాయి.

వెంటనే చికిత్స అవసరం...

కార్డియాక్ అరెస్టుని సడన్ కార్డియాక్ అరెస్టని కూడా అంటారు. ఎందుకంటే గుండె హఠాత్తుగా కొట్టుకోవటం మానేస్తుంది. దాంతో మెదడు, ఇతర అవయవాలకు రక్త సరఫరా ఉండదు. దానికి గురయిన వ్యక్తి స్పృహని కోల్పోతాడు. వెంటనే చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం లేదా మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. కార్డియాక్ అరెస్టుకి గురయ్యే ముందు కొందరిలో లక్షణాలు కనిపించకపోవచ్చు. కొందరిలో గుండెదడ, ఛాతీనొప్పి, వికారం, ఆయాసం, మగత, స్పృహ కోల్పోవటం లాంటి సమస్యలుంటాయి.

ఎవరికి వచ్చే ప్రమాదం ఎక్కువ

- ఆల్కహాల్, డ్రగ్స్ వాడే వారికి

-కుటుంబంలో ఎవరైనా గుండెవ్యాధులు లేదా కార్డియాక్ అరెస్ట్ కి గురయి ఉంటే

- అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు సమస్యలు ఉన్నవారికి

-పొటాషియం, మెగ్నీషియం లోపం ఉన్నవారికి

-అధిక బరువున్నవారికి

దీనిని నివారించాలంటే...

-గుండెకు మేలు చేసే ముడి ధాన్యాలు, చేపలు, పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి ఆహారాలను తీసుకోవాలి.

-బరువు తగ్గించుకోవాలి. క్రమబద్ధంగా వ్యాయామం చేయాలి.

-ఆల్కహాల్ సిగరెట్ అలవాట్లు ఉంటే వదిలేయాలి.

-ఒత్తిడిని తగ్గించుకోవాలి.

First Published:  30 Aug 2023 3:51 AM GMT
Next Story