Telugu Global
Health & Life Style

కోవీషీల్డ్ వ్యాక్సిన్‌తో గుండెపోటు వస్తుందా? డాక్టర్లు ఏమంటున్నారు?

కోవీషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందని ఆస్ట్రాజెనెకా కంపెనీ.. ఇంగ్లాండ్ కోర్టులో స్వయంగా ఒప్పుకుంది. ఈ వార్తతో కోవీషీల్డ్ వ్యాక్సిన్ సడెన్‌గా వార్తల్లోకి వచ్చింది. కోవీషీల్డ్ వేసుకున్నవాళ్లందరూ ఈ న్యూస్ తో తెగ భయపడుతున్నారు. అయితే నిజంగా దీంతో ప్రమాదం ఉందా? డాక్టర్లు ఏమంటున్నారు?

కోవీషీల్డ్ వ్యాక్సిన్‌తో గుండెపోటు వస్తుందా? డాక్టర్లు ఏమంటున్నారు?
X

గత రెండు రోజులుగా ఇంటర్నెట్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌పై చర్చ నడుస్తోంది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కోవీషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందని ఆస్ట్రాజెనెకా కంపెనీ.. ఇంగ్లాండ్ కోర్టులో స్వయంగా ఒప్పుకుంది. ఈ వార్తతో కోవీషీల్డ్ వ్యాక్సిన్ సడెన్‌గా వార్తల్లోకి వచ్చింది. కోవీషీల్డ్ వేసుకున్నవాళ్లందరూ ఈ న్యూస్ తో తెగ భయపడుతున్నారు. అయితే నిజంగా దీంతో ప్రమాదం ఉందా? డాక్టర్లు ఏమంటున్నారు?

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. మనదేశంలో కూడా ఈ వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లు కోట్లలో ఉన్నారు. అయితే కోవీషీల్డ్ వేసుకున్నవాళ్లు నిజంగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు. కోవీషీల్డ్ వ్యాక్సిన్‌తో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మాట వాస్తవమే అయినా దీని శాతం చాలా తక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. సరిగ్గా చెప్పాలంటే రెండున్నర లక్షల మందిలో ఒకరికి ఇలా రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుందట. అయితే ఇది కూడా వ్యాక్సిన్ వేయించుకున్న మూడు నెలల్లోపే జరుగుతుంది. ఆస్ట్రాజెనెకా కంపెనీపై కేసు వేసిన జామీ స్కాట్ అనే వ్యక్తి కూడా ఏప్రిల్ 2021లో వ్యాక్సినేషన్ తీసుకున్న కొన్ని రోజులకు రక్తం గడ్డకట్టడం వల్ల గుండె సమస్యలు రావడంతో వ్యాక్సిన్ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాడు. ఆ కేసుకి సంబంధించిన అప్‌డేట్ ఇప్పుడు వచ్చింది. కాబట్టి అందరూ వ్యాక్సిన్ గురించి ఇప్పుడు భయపడుతన్నారు.

డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం.. సైడ్ ఎఫెక్ట్ వస్తే మూడు నెలలలోపే వస్తుందనీ.. కాబట్టి 2021, 2022, 2023 లో వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు ఇప్పుడు భయపడాల్సిన పని ఏమీ లేదనీ సోషల్ మీడియాలో పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండియాలో కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేసిన ‘సీరమ్’ కంపెనీ తాము కేవలం మోడల్ మాత్రమే ఆస్ట్రాజెనెకా నుంచి తీసుకున్నామని ఇక్కడి వ్యాక్సిన్‌తో అలాంటి ప్రమాదం ఉండదని చెప్తోంది.

First Published:  3 May 2024 6:29 PM IST
Next Story