Telugu Global
Health & Life Style

మిల్లెట్స్ ఎవరైనా తినొచ్చా? ఈ విషయాలు తెలుసుకోండి!

ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ చాలా పాపులర్ అయిన విషయం మనకు తెలిసిందే. బరువు తగ్గాలనుకునేవాళ్లు, డయాబెటిస్ ఉన్నవాళ్లలో చాలామంది మిల్లెట్స్‌ను డైట్‌లో భాగంగా చేసుకున్నారు.

మిల్లెట్స్ ఎవరైనా తినొచ్చా? ఈ విషయాలు తెలుసుకోండి!
X

ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ చాలా పాపులర్ అయిన విషయం మనకు తెలిసిందే. బరువు తగ్గాలనుకునేవాళ్లు, డయాబెటిస్ ఉన్నవాళ్లలో చాలామంది మిల్లెట్స్‌ను డైట్‌లో భాగంగా చేసుకున్నారు. అయితే ఇవి అందరూ తినొచ్చా? మిల్లెట్స్‌తో ఏమైనా సమస్యలుంటాయా? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ప్రతి మనిషికి రోజుకి 38 గ్రాముల ఫైబర్ కావాలి. సిరిధాన్యాలు లేదా మిల్లెట్స్.. ఎక్కువ ఫైబర్ కలిగి ఉండే ఫుడ్స్. అందుకే మిల్లె్ట్స్ తింటే రోజుకు అవసరమయ్యే ఫైబర్ లభిస్తుంది. అలాగే వీటిలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, జింక్, మెగ్నీషియం, సెలీనియం, సోడియం వంటి ఖనిజాలతో పాటు 12 శాతం ప్రోటీన్‌ కూడా ఉంటుంది. ఒక కప్పు సిరి ధాన్యాల నుంచి రోజుకు అవసరమైన మాంగనీస్ 33%, ట్రిప్టోఫాన్ 32%, మెగ్నీషియం 27%, ఫాస్పరస్ 24% లభిస్తాయి. వరి, గోధుమల కన్నా ఎన్నో రెట్లు అధికమైన పోషక విలువలు వీటిలో ఉంటాయి.

ఎవరు తినొచ్చు ?

మిల్లెట్స్..కొద్దికొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్‌ని రక్తంలోకి వదులుతాయి. అంతేకాకుండా కొన్ని రకాల చర్మ రోగాలకు, కిడ్నీ సమస్యలకు, బీపీ, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమాను నివారించడంలో కూడా దోహదపడుతాయి. కాబట్టి వీటిని ఎవరైనా తినొచ్చు. సాధారణంగా ఇవి పడకపోవడం అంటూ ఉండదు. రెగ్యులర్‌గా తినే అన్నం నుంచి వీటికి మారడం వల్ల కొంతమందికి జీర్ణం అవ్వడం కష్టంగా ఉండొచ్చు. డయేరియా ఉన్న వారికి ఒక్కోసారి పడకపోవచ్చు. స్కిన్ ఎలర్జీస్ ఉన్నవారికి కూడా కొన్నిసార్లు ఇవి పడకపోవచ్చు. అలాంటి వాళ్లు రెండు రోజులకొకసారి, వారానికొకసారో తినడం మంచిది. పేగుల్లో సమస్యలు ఉన్నవారికి ఆహారాన్ని శోషించుకునే రేటు తక్కువగా ఉంటుంది. అలాంటివాళ్లు డాక్టర్ల సలహా మేరకు వీటిని తీసుకోవాలి.

రెండు సంవత్సరాలలోపు పిల్లలకు అరుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్లకు మిల్లెట్స్ పెట్టకపోవడమే మంచిది. సిరిధాన్యాల్లో పీచు ఎక్కువ కాబట్టి కనీసం రెండు గంటలు నానబెట్టిన తర్వాత వండుకుని తినాలి. వీటితో అన్నం వండుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోశె ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అలా చేసిపెడితే పిల్లలకు బాగా అరుగుతుంది.

వీళ్లు జాగ్రత్త!

మిల్లెట్స్‌లో ఉండే కంటెంట్స్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్లకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఇలాంటి వాళ్లు రోజుకి 35 గ్రాములకు మించి మిల్లెట్స్‌ని తీసుకోకూడదు. హైపోథైరాయిడిజం అనేది శరీరంలో థైరాయిడ్‌ హార్మోన్లు కావల్సినదాని కంటే తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల వస్తుంది. ఈ సమస్యనే గాయిటర్ అని కూడా అంటారు. ఈ సమస్య ఉన్నవాళ్లు గ్లూటెన్‌ కలిగిన ఆహారాలు తినకూడదు. ఒకవేళ తింటే ఇది పెరిగే ప్రమాదం ఉంది. మిల్లెట్స్‌లో గ్లూటెన్ ఉండదు. కానీ, ఇందులో గ్లూటెన్‌కి బదులు గయిట్రోజన్స్ ఉంటాయి. ఇవి హైపోథైరాయిడిజమ్‌ ఉన్నవారికి కాస్త సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే హైపోథైరాయిడిజమ్‌ ఉండి మిల్లెట్ డైట్ పాటిస్తున్న వాళ్లు, వాళ్లలో వచ్చే మార్పులను కాస్త గమనిస్తూ ఉండాలి. ఎదైనా తేడా గమనిస్తే డాక్టర్లను సంప్రదించడం మంచిది.

First Published:  15 Dec 2023 9:30 AM IST
Next Story