Telugu Global
Health & Life Style

పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్‌ లాగానే బ్రెయిన్ స్ట్రోక్ కేసులు కూడా పెరుగుతున్నాయని రిపోర్ట్‌లు చెప్తున్నాయి.

పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
X

ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్‌ లాగానే బ్రెయిన్ స్ట్రోక్ కేసులు కూడా పెరుగుతున్నాయని రిపోర్ట్‌లు చెప్తున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ అనేది చెప్పాపెట్టకుండా ఉన్నట్టుండి వస్తుంది. ఇది మెదడుకి తీవ్రమైన హాని చేస్తుంది. స్ట్రోక్ వచ్చినప్పుడు చికిత్సకు చాలా తక్కువ టైం ఉంటుంది. అందుకే ఈ తరహా స్ట్రోక్స్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు ఎవరిలో వస్తుందో ముందుగా గుర్తించడం కష్టం. మెదడులో ఒక ప్రాంతానికి రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల ఇది జరుగుతుంది. దీనివల్ల హఠాత్తుగా మరణం సంభవించొచ్చు లేదా శాశ్వత వైకల్యం రావొచ్చు. అయితే లైఫ్‌స్టైల్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఈ తరహా స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అదెలాగంటే..

రక్తప్రసరణ ఆరోగ్యంగా

బ్రెయిన్ స్ట్రోక్ అనేది రక్తప్రసరణ నిలిచిపోవడం వలన జరుగుతుంది. కాబట్టి శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను అరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చు. దీనికోసం ముందుగా రక్తపోటును నియంత్రించుకోవాలి. హై బీపీ స్ట్రోక్‌కు ప్రధాన కారకం. కాబట్టి ప్రతి ఒక్కరూ బీపీని చెక్ చేసుకుంటూ కంట్రోల్‌లోఉంచుకునే ప్రయత్నం చేయాలి. బీపీని పెంచే స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.

వ్యాయామం చేయాలి

రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం అవసరం. రోజుకి కనీసం ఇరవై నిముషాలు వర్కవుట్స్ చేయడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. తద్వారా గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి.

బరువు అదుపులో..

అధిక బరువు కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణం అవ్వొచ్చు. కాబట్టి బరువుని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. దీనికోసం డైట్‌లో తగిన మార్పులు చేసుకోవాలి. జంక్ ఫుడ్, షుగర్స్, ఉప్పు తగ్గించి పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్ వంటివి తీసుకోవాలి. వ్యాయామం చేస్తుండాలి.

ఒత్తిడి లేకుండా..

బ్రెయిన్ స్ట్రోక్‌కు ఒత్తిడి కూడా కారణమే. ఒత్తిడి, యాంగ్జయిటీ వంటి సమస్యలు మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. దీనికోసం మెడిటేషన్, ప్రాణాయామం వంటివి అలవాటు చేసుకోవచ్చు.

బ్రెయిన్ హెల్త్

మెదడు ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం కూడా ముఖ్యమే. దీనికోసం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, నట్స్ తీసుకోవచ్చు. అలాగే హెల్దీ ఫ్యాట్స్, మినరల్స్ కోసం తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి కూడా డైట్‌లో చేర్చుకోవాలి.

ఇక వీటితోపాటు డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంచుకోవడం, తలకు దెబ్బ తగలకుండా చూసుకోవడం, తగినంత నిద్ర పోవడం, ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండడం, మనసుకి హాయినిచ్చే పనులు చేయడం ద్వారా కూడా బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని అరికట్టొచ్చు.

First Published:  8 March 2024 2:30 AM GMT
Next Story