పుదీనాతో మెదడు ఆరోగ్యం సేఫ్! తాజా స్టడీ వెల్లడి!
వయసు పైబడే కొద్దీ మెదడు ఆరోగ్యం క్షీణిస్తుంది. ముఖ్యంగా పెద్దవాళ్లలో మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే కేవలం పుదీనా ఆకుల వాసనతో ఈ సమస్యను తగ్గించొచ్చట.
వయసు పైబడే కొద్దీ మెదడు ఆరోగ్యం క్షీణిస్తుంది. ముఖ్యంగా పెద్దవాళ్లలో మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే కేవలం పుదీనా ఆకుల వాసనతో ఈ సమస్యను తగ్గించొచ్చట. అదెలాగంటే.
పుదీనా ఆకుల వాసన చూడడం ద్వారా అల్జీమర్స్ వ్యాధిని తగ్గించొచ్చని తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు పుదీనాను ఉపయోగించి ఈ సమస్యను పూర్తిగా నయం చేసే సరికొత్త చికిత్సా విధానాలపై కూడా సైంటిస్టులు పనిచేస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే.
మలి వయసులో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో అల్జీమర్స్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఐదున్నర కోట్లమంది అల్జీమర్స్ బాధితులు ఉన్నారు. నాడీ మండలం పనితీరు నెమ్మదించడం ద్వారా పెద్ద వయసులో మతిమరుపు సంభవిస్తుంది. దాంతో వాళ్లు చాలా విషయాలు మర్చిపోతారు. జ్ఞాపకశక్తితో పాటు ఆలోచనశక్తి కూడా తగ్గిపోతుంది. రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా గుర్తుపట్టలేరు. ఈ వ్యాధిపై ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నా ఇప్పటికీ దీనికి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ కనుగొనలేకపోయారు. అయితే కేవలం పుదీనా వాసనతో అల్జీమర్స్ లక్షణాలను మొదటిదశలో కొంతవరకూ తగ్గించొచ్చని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.
ఎలుకలపై చేసిన ఓ ప్రయోగం ద్వారా పుదీనాకు అల్జీమర్స్‌ను తగ్గించే లక్షణం ఉన్నట్టు తెలిసింది. పుదీనా వాసనను చూపించడం ద్వారా ఎలుకల్లో రోగనిరోధక శక్తి, మెదడులో విషయగ్రహణా శక్తి మెరుగుపడినట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. అల్జీమర్స్ లక్షణాలు కలిగి ఉన్న ఎలుకలకు కొన్ని నెలల పాటు పుదీనా వాసన చూపిస్తూ ఈ పరిశోధన చేశారు. తర్వాత వాటిని గమనిస్తే వాటి రోగనిరోధక వ్యవస్థతో పాటు మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి కూడా ఇంప్రూవ్ అయినట్టు తెలిసింది.
పుదీనా వాసనతో అల్జీమర్స్‌కు కారణమయ్యే ‘ఇంటర్లుకిన్ 1 బీటా’ అనే ప్రొటీన్ పరిమాణం తగ్గుతున్నట్టు సైంటిస్టులు గుర్తించారు. మెదడులో ఇంఫ్లమేషన్‌కు కారణమయ్యే ఈ ప్రొటీన్.. పుదీనా వాసనకు నశిస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి నశించకుండా ఉంటుంది. కాబట్టి రోజువారీ డైట్‌లో పుదీనాను చేర్చుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ముఖ్యంగా వయసుపైబడిన వాళ్లు రోజూ పుదీనా టీ తీసుకుంటే అల్జీమర్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది.