Telugu Global
Health & Life Style

చెమటకాయలకు చెక్ పెడదాం ఇలా..

చెమటకాయలు ఉన్న ప్రాంతంలో ఐస్‌ ప్యాక్ పెట్టండి. దీని వల్ల చర్మం ఎరుపు, దురద, వాపు తగ్గుతుంది.

చెమటకాయలకు చెక్ పెడదాం ఇలా..
X

వేసవి కాలం వచ్చిందంటే చాలు లో ఒకవైపు ఎండవేడి, వడగాలులు, చెమట ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు దురద, చెమటకాయలు చికాకు పెడతాయి. కొంత మందిలో చర్మంపై దద్దుర్లు ఏర్పడి ఇబ్బందిగా ఉంటుంది. మొత్తానికి వేసవి అంటా ఏదో ఒక చర్మ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఈ హాట్‌ సమ్మర్‌లో చాలామందిని ఇబ్బంది పెట్టే కామన్‌ సమస్య చెమట కాయలు. ప్రాంతంలో గుచ్చు తున్నట్టు ఉండే మంట మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు.

కామన్‌గా నుదుటిపై, ముఖం, మెడ, వీపు, ఛాతీ, తొడల మీద చెమట కాయలు ఎక్కువగా వస్తుంటాయి. వీటి తీవ్రత ఎక్కువైతే చర్మం ఎర్రపొక్కులుగా మారటం, గోకటం వల్ల చర్మం చిట్లి రక్తం కారడం జరుగుతుంది. అయితే సాధారణంగా కొన్ని రోజుల తర్వాత ఇది దానంతటదే అదృశ్యమవుతుంది. కొందరికి మాత్రం అంట తొందరగా తగ్గదు సరికదా పెరుగుతుంది. అలా అని అడ్వర్టైస్మెంట్ చూసి మార్కెట్‌లో దొరికే పౌడర్‌ను వాడటంవల్ల చర్మ రంధ్రాలు మరింతగా మూసుకుపోతాయి. అలాంటప్పుడు కొన్ని చిట్కాలతో చెమట పొక్కుల నుంచి కొంత ఉపశమనంపొందవచ్చు. అవేంటో చూద్దాం.

చర్మం చల్లబడితే.. చెమటకాయలు తగ్గుతాయి. రెండు పూటలా చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. చర్మాన్ని సున్నితంగా కడగితే.. రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాగే స్నానం తర్వాత శరీరంపై తడి లేకుండా టవెల్‌తో శుభ్రంగా తుడవండి. వీలైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా ఉండటమే మంచిది. అలాగే స్నానం చేసే నీటిలో గుప్పెడు మల్లెపూలు, జాజిపూలు లేదా వట్టివేళ్ల చూర్ణం వేసి గంటసేపు నాననిచ్చి, ఆ నీటితో స్నానం చేయడం మంచిది. ఇటువంటి స్నానం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

వంటినిండా చెమటకాయలు వచ్చినప్పుడు గంధం ముద్దని పల్చని పూతలా వేసుకుంటే, మంట, దురద తగ్గుతాయి. అందులో కాస్త కర్పూరాన్ని కలిపి రాసినా కూడా సమస్య అదుపులోకి వస్తుంది. అయితే ఇందులో మార్కెట్లో లభ్యమయ్యే గంధం పొడి కాకుండా గంధపు చెక్కని సానపై అరగదీసి, దాన్ని వాడటంమే శ్రేయస్కరం. చందనం, వట్టివేళ్ల పొడిని రోజ్‌వాటర్‌లో కలిపి పల్చని లేపనంలా రాసినా మంచిదే. కలబంద గుజ్జు రాసుకున్నా కూడా చెమటకాయల నుంచి ఉపశమనం కలుగుతుంది.

చెమటకాయలు ఉన్న ప్రాంతంలో ఐస్‌ ప్యాక్ పెట్టండి. దీని వల్ల చర్మం ఎరుపు, దురద, వాపు తగ్గుతుంది. అలా అని ఈ ఐస్‌ ప్యాక్‌ ఎక్కువ సేపు ఉంచొద్దు. ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే ఉంచాలి.

బయట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తినటానికి, తాగటానికి పుచ్చకాయ, కర్బూజా, కీరదోస, ముంజెలు, కొబ్బరి నీళ్లు, నిమ్మర సం, పల్చని మజ్జిగ వంటి చలువచేసే పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. కారం, గరం మసాలా, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

First Published:  24 April 2024 2:14 PM IST
Next Story