చలికాలంలో ప్రతీ రోజూ గుడ్డు తింటే.. కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
Benefits of Eating Egg Daily: గుడ్డులో అనేక రకాలు పోషకాలు ఉంటాయి. ఒక రకంగా దీన్ని పోషకాల బ్యాంక్ అని చెప్పవచ్చు.
చలికాలం వస్తే చాలా మంది పొద్దున్నే లేవడానికి బద్దకిస్తారు. సాయంత్రం కూడా త్వరగా చీకట్లు కమ్ముకుంటాయి. ఈ కారణాల వల్ల ఎండలో తిరిగే సమయం తగ్గిపోతుంది. దీంతో కొంత మందిలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఇక ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. వీటన్నింటికీ సరైన విరుగుడు ప్రతీ రోజు గుడ్డు తినడమే అని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు మన శరీరం లోపలి నుంచి వెచ్చగా కూడా ఉంటుందని అంటున్నారు.
గుడ్డులో అనేక రకాలు పోషకాలు ఉంటాయి. ఒక రకంగా దీన్ని పోషకాల బ్యాంక్ అని చెప్పవచ్చు. విటమిన్ ఏ, బీ2, బీ5, బీ12, బీ6, విటమిన్ డి, ఈ, కేలతో పాటు ఐరన్, పాస్ఫరస్, జింక్, ఫొలేట్, సెలీనియం వంటి ఖనిజాలు.. అత్యవసరమైన తొమ్మిది అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చిన్నారుల్లో అధిక పోషకాలు కావాలంటే గుడ్డు చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రభుత్వం కూడా అంగన్ వాడీలో గుడ్లు ఉచితంగా పంపిణీ చేస్తుంటుంది.
విటమిన్ డి :
చలికాలంలో చాలా మంది విటమిన్ డి డెఫిషియెన్సీకి గురవుతారు. అయితే రోజుకో గుడ్డు తినడం వల్ల ఆ లోపం నుంచి బయటపడవచ్చని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటి అండ్ న్యూట్రిషన్ (ఐపాన్) పరిశోధనలో వెల్లడైంది. ఒక గుడ్డులో 8.2 మైక్రో గ్రాముల డి విటమిన్ ఉంటుంది. సాధారణంగా మనకు రోజుకు 10 మైక్రోగ్రాముల డి విటమిన్ అవసరం. గుడ్డు తినడం వల్ల 82 శాతం విటమన్ మన శరీరానికి అందుతుంది.
ప్రోటీన్స్ :
గుడ్డును ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని పిలుస్తుంటారు. ఒక మీడియం సైజ్ గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. ఇన్‌ఫెక్షన్ నుంచి మన శరీరాన్ని కాపాడాల్సిన యాంటీ బాడీస్‌ను తయారు చేయడానికి ప్రోటీన్ ఉపయోగపడుతుంది. రోజూ గుడ్డు తినడం వల్ల కండరాల బలహీనత కూడా దూరం అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
జింక్ లోపానికి విరుగుడు:
గుడ్డులో జింక్ పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో మన శరీరంపై ఎటాక్ చేసే ఫ్లూ, జలుబు, ఇన్‌ఫెక్షన్ల నుంచి జింక్ రక్షణ ఇస్తుంది. అంతే కాకుండా ఇమ్యూనిటీని పెంచడంలో కూడా జింక్ ఉపయోగపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ పోతుంది :
ప్రతీ రోజు గుడ్డు తినడం వల్ల శరీరంలోని హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) స్థాయి పెరుగుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. అది చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఇది మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాధారణంగా చలికాలంలో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజూ గుడ్డు తినడం వల్ల ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇక వీటితో పాటు గుడ్డులో ఉండే బీ6, బీ12 కారణంగా ఇమ్యూనిటీ మరింతగా బలోపేతం అవుతుంది. చలికాలంలో వచ్చే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడటానికి ఈ రెండు విటమిన్లు చాలా ఉపయోగపడతాయి.