Telugu Global
Health & Life Style

వర్షాకాలం కీళ్ల నొప్పులతో జాగ్రత్త!

వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ, తక్కువ ఉష్ణోగ్రత, వాతావరణ పీడనంలో మార్పుల కారణంగా కీళ్ల కండరాలు, కదలికల్లో తేడాలు వస్తాయి. దీనివల్ల కీళ్ల నొప్పులతో పాటు తిమ్మిర్లు కూడా ఎక్కువ అవుతాయి.

వర్షాకాలం కీళ్ల నొప్పులతో జాగ్రత్త!
X

వానాకాలంలో కీళ్లనొప్పుల సమస్య ఎక్కువవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ సీజన్‌లో ఉండే వాతావరణానికి కీళ్ల నొప్పులకు సంబంధం ఉంటుందట. అందుకే కీళ్ల నొప్పులు రాకుండా ఈ సీజన్‌లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ, తక్కువ ఉష్ణోగ్రత, వాతావరణ పీడనంలో మార్పుల కారణంగా కీళ్ల కండరాలు, కదలికల్లో తేడాలు వస్తాయి. దీనివల్ల కీళ్ల నొప్పులతో పాటు తిమ్మిర్లు కూడా ఎక్కువ అవుతాయి.

జాగ్రత్తలు ఇలా..

వర్షాకాలంలో ఎండ తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరానికి సరిపడా ‘డి’ విటమిన్‌ అందదు. అలాగే ఈ సీజన్‌లో నీళ్లు కూడా తక్కువగా తాగుతుంటారు. ఈ కారణాల వల్ల కీళ్లలో ఉండే ఫ్లుయిడ్స్ పలుచబడి కీళ్ల సమస్యలకు దారితీస్తాయి. అందుకే ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు, అధిక బరువు ఉన్నవాళ్లు ఈ సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలి.

వర్షాకాలంలో కీళ్ల నొప్పులు రాకుండా ఉండేందుకు విటమిన్‌–బీ12, విటమిన్–ఇ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు నొప్పి, వాపులను కూడా తగ్గిస్తాయి.

వర్షాకాలం తీసుకునే ఆహారంలో క్యాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలి. హై క్యాలరీ ఫుడ్స్‌కు బదులు ప్రొటీన్లు, హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవాలి. వీటికోసం నట్స్, ఆకు కూరలు డైట్‌లో చేర్చుకుంటే సరి.

వర్షాకాలం నీళ్లు తక్కువగా తాగడం వల్ల చాలానే సమస్యలుంటాయి. కాబట్టి దాహం వేయకపోయినా రోజుకి మూడు లీటర్ల నీటిని తాగేలా చూసుకోవాలి.

కీళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు రోజువారీ వ్యాయామం తప్పనిసరి. కాబట్టి వానాకాలంలో తప్పకుండా వ్యాయామం చేయాలి. కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ సలహా మేరకు వ్యాయామాలు ఎంచుకుంటే మంచిది.

ఇప్పటికే కీళ్లనొప్పులతో బాధపడుతున్నవారికి వర్షాకాలం నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇలాంటివాళ్లు హెల్దీ డైట్, వ్యాయామంతోపాటు ప్రతిరోజూ కీళ్లకు ఆయిల్ మసాజ్, వేడి నీటి కాపడం వంటివి చేస్తే నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది.

First Published:  28 July 2024 7:05 AM IST
Next Story