Telugu Global
Health & Life Style

చలికాలం చంటిపిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలికాలంలో ఏడాది లోపు వయసున్న పిల్లల్ని చూసుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే కాస్త వయసు పెరుగుతున్న కొద్ది పిల్లల సమస్యలు మనం గుర్తించగలం కానీ చంటి పిల్లల విషయంలో అలా కాదు.

చలికాలం చంటిపిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
X

చలికాలంలో ఏడాది లోపు వయసున్న పిల్లల్ని చూసుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే కాస్త వయసు పెరుగుతున్న కొద్ది పిల్లల సమస్యలు మనం గుర్తించగలం కానీ చంటి పిల్లల విషయంలో అలా కాదు. ఇది పేరెంట్స్‌కి ఓ పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఈ కాలంలో జలుబు నుంచి మొదలు పెడితే జ్వరం, జీర్ణ సమస్యలు ఇలా రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. వీటన్నింటిని దూరం చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి.

సాధారణంగా చంటిపిల్లలకి రెండు పూటలా స్నానం చేయించటం మంచిది. కానీ, చలికాలంలో మాత్రం ఒకసారి చేయిస్తే చాలు. స్నానానికి ముందు మంచి ఆయిల్ తో వారికి మసాజ్ ఇవ్వాలి. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి రక్తప్రసరణని మెరుగ్గా చేస్తుంది. జీర్ణ‌‌శక్తి పెరుగుతుంది. తరువాత వేడి నీటితో, కాస్త త్వర త్వరగా చేయించేయాలి. శిశువుల చర్మ ముడతలు, మెడభాగాన్ని చక్కగా క్లీన్ చేయాలి.


స్నానం తరువాత కాస్త తడి ఉన్నప్పుడే శరీరం అంతా మాయిశ్చరైజర్ రాయాలి. అప్పుడే వారి శరీరం పొడిబారకుండా ఉంటుంది. తరువాత వెచ్చని బట్టలు వేయాలి. పిల్లల బట్టల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్త అవసరం. కాస్తా మందమైన బట్టలు వేయాలి కానీ అవి వారికి బిగుతుగా గానీ, చెమటలు పట్టేలా ఉండకుండా చూడాలి. మెత్తని మృదువైన బట్టలు పిల్లలకు హాయిగా ఉంటాయి. బట్టలతో పాటూ, పాదాలు, చేతులు, తల కూడా కవర్ అయ్యేలా చూసుకోవాలి. చలికాలం పిల్లల తల కూడా పొడిగా మారుతుంది. తప్పకుండా వారి తలకు కాస్త అయినా హెయిర్ ఆయిల్ పెట్టండి.


చలికాలంలో వైరల్ ఫీవర్స్, జలుబు, దగ్గు, తుమ్ములు ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి. అటువంటి సమస్యలు ఉన్నవారికి పిల్లలను దూరంగా ఉంచాలి. చంటిపిల్లలకు ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే తల్లిపాలే సరైన మందు. అందుకే బాలింతలు కూడా మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. అలాగే పిల్లలకి సీజనల్ వ్యాక్సిన్స్ తప్పకుండా వేయించాలి. వారికి వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను గుర్తించాలి. అవసరాన్ని బట్టి వైద్యులను సంప్రదించాలి.. కానీ మనం తీసుకొనే చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటూనే ఉండాలి.

First Published:  27 Nov 2023 5:30 AM GMT
Next Story