Telugu Global
Health & Life Style

కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్ నిజమే..అంగీకరించిన ఆస్ట్రాజెనెకా

కొవిషీల్డ్‌ తీసుకున్నవారిలో అరుదుగా రక్తం గడ్డ కట్టడంతో పాటు ప్లేట్‌ లెట్స్‌ తగ్గే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఆస్ట్రాజెనెకా.

కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్ నిజమే..అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
X

కరోనా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌కు సంబంధించి ఓ సంచలన నిజం బయటకు వచ్చింది. కరోనాను అరికట్టేందుకు ఇండియాలో కోవాక్సిన్, కోవిషీల్డ్‌, స్పుత్నిక్-వి టీకాలను పెద్ద ఎత్తున పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ సంబంధించి ఓ భయంకరమైన నిజాన్ని ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా రివీల్ చేసింది. కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని మొదటిసారి అంగీకరించింది.

కొవిషీల్డ్‌ తీసుకున్నవారిలో అరుదుగా రక్తం గడ్డ కట్టడంతో పాటు ప్లేట్‌ లెట్స్‌ తగ్గే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఆస్ట్రాజెనెకా. కరోనా వ్యాప్తి సమయంలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ కోవిషీల్డ్‌ను డెవలప్‌ చేశాయి. మన దేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను భారీగా ఉత్పత్తి చేయగా..కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.

ఆస్ట్రాజెనెకా సంస్థ ప్రస్తుతం యూకేలో క్లాస్ యాక్షన్‌ దావాను ఎదుర్కొంటుంది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ చాలా మరణాలకు కారణమైందని, కొందరిలో తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపిందని పలువురు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. దాదాపు ఇలా 51 కేసులు నమోదైనట్లు సమాచారం. బాధితులు ఆస్ట్రాజెనెకా నుంచి 100 మిలియన్ పౌండ్ల నష్టపరిహారం కోరుతున్నారు.

2021 ఏప్రిల్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న జెమీ స్కాట్ అనే వ్యక్తి..ఆస్ట్రాజెనెకాపై తొలి ఫిర్యాదు చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డం కట్టి బ్రెయిన్‌పై తీవ్ర ప్రభావం చూపిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐతే ఈ ఆరోపణలను మొదట్లో ఖండించిన ఆస్ట్రాజెనెకా..ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన పత్రాల్లో మాత్రం అరుదైన సందర్భాల్లో ఈ వ్యాక్సిన్‌ థ్రంబోసిస్‌ విత్ థ్రంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)కు కారణమవుతుందని అంగీకరించింది. ఈ సిండ్రోమ్ రక్తం గడ్డకట్టడంతో పాటు ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గేందుకు దారి తీస్తుంది.

First Published:  30 April 2024 4:40 AM GMT
Next Story