మీ కళ్లు భద్రమేనా? ఇలా చెక్ చేసుకోండి!
మన శరీరంలోని అవయవాల్లో కళ్లు చాలా ముఖ్యమైనవి అని చెప్తుంటారు. అయితే చాలామంది కంటి ఆరోగ్యాన్ని లైట్‌గా తీసుకుంటారు. దీంతో చిన్న చిన్న కంటి సమస్యలు కూడా కొన్నిసార్లు పెద్ద ప్రాబ్లమ్స్‌గా మారొచ్చు.
మన శరీరంలోని అవయవాల్లో కళ్లు చాలా ముఖ్యమైనవి అని చెప్తుంటారు. అయితే చాలామంది కంటి ఆరోగ్యాన్ని లైట్‌గా తీసుకుంటారు. దీంతో చిన్న చిన్న కంటి సమస్యలు కూడా కొన్నిసార్లు పెద్ద ప్రాబ్లమ్స్‌గా మారొచ్చు. అందుకే కంటి ఆరోగ్యాన్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.
కళ్లలో అప్పుడప్పుడు వచ్చే నొప్పి, అసౌకర్యం లాంటివి కార్నియా, రెటీనాలోని సమస్యలకు సింప్టమ్స్ కావచ్చు. అందుకే కంటి విషయంలో కొన్ని మార్పులను గమనిస్తుండాలి. కళ్ల విషయంలో ఎప్పుడు జాగ్రత్త పడాలంటే..
కంటినొప్పి
కంటిలో ఉన్నట్టుండి నొప్పి మొదలైతే దానికి చాలారకాల కారణాలు ఉండి ఉండొచ్చు. అందుకే కంటినొప్పి వచ్చినప్పుడు వెంటనే కంటి డాక్టర్‌ను కలవాలి. చిన్నపాటి ఇన్ఫెక్షన్ నుంచి గ్లకోమా వంటి తీవ్రమైన కంటి సమస్యల వరకూ అన్ని పరిస్థితుల్లో ఇలాంటి కంటి నొప్పులు వస్తుంటాయి. కాబట్టి నొప్పి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఫ్లాష్‌లు కనిపిస్తే..
రెటీనాలో ఏదైనా సమస్య ఉంటే అప్పుడప్పుడు ఫ్లాష్‌లు కనిపిస్తుంటాయి. దీన్ని తొలిదశలో గుర్తిస్తే ట్రీట్మెంట్ చేయొచ్చు. లేకపోతే రెటీనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.
చూపు మందగిస్తే..
ఉన్నట్టుండి చూపు మందగించడం, లైట్ వైపు చూసినప్పుడు కళ్లు మూసుకుపోవడం, కంటికి వృత్తాలు, మచ్చలు లాంటి ఫ్లోటర్స్ కనిపిస్తున్నప్పుడు అవి కంటి శుక్లాల లక్షణం అవ్వొచ్చు. వయసు పైబడినవాళ్లలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి పరీక్ష చేయించుకోవడం మంచిది.
నలక వేధిస్తుంటే..
కంటిలో దుమ్ము, ధూళి లాంటివి పడినప్పుడు కంటినీరు ద్వారా కన్ను వాటిని బయటకు పంపిస్తుంది. అయితే గాజు, మెటల్స్ వంటి రేణువులు కంటిలో పడినప్పుడు కంటి కణజాలం దెబ్బతింటుంది. కాబట్టి కంటిలో పడిన నలక రెండు రోజులవరకూ తొలగిపోకుండా ఇబ్బంది పెడుతుంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి.
ఇక వీటితో పాటు కంటిలో మంట, దురద లాంటివి రావడం, కంటి నుండి తరచూ నీరు కారడం లాంటివి కూడా కంటి ఇన్ఫెక్షన్లకు కారణం అవ్వొచ్చు. కాబట్టి కంటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త పడాలి.