Telugu Global
Health & Life Style

ఉప్పు ఎక్కువ, నీరు తక్కువ తీసుకుంటున్నారా..? ప్రమాదంలో ఉన్నారు జాగ్రత్త..

ఊబకాయుల జీవనశైలిని గమనిస్తే, వారు నీరు తాగడం చాలా తక్కువ. ఆహారం ఎక్కువగా తీసుకుంటారేమో కానీ, నీరు మాత్రం చాలా పరిమితంగా తీసుకుంటారు. దానివల్ల వారి శరీరంలో జరిగే జీవరసాయన క్రియల్లో విపరీతమైన మార్పు వస్తుంది, అది మరింత ఊబకాయానికి దారి తీస్తుంది.

ఉప్పు ఎక్కువ, నీరు తక్కువ తీసుకుంటున్నారా..? ప్రమాదంలో ఉన్నారు జాగ్రత్త..
X

చక్కెర ఎక్కువగా తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం స్థూలకాయానికి ప్రధాన కారణాలనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ చక్కెరకంటే ఉప్పు ఎక్కువ ప్రమాదకారి అంటున్నారు శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో అషుంజ్ మెడికల్ క్యాంపస్ ప్రొఫెసర్ చేసిన ఓ అధ్యయనం ప్రకారం ఆహారంలో ఉప్పు పరిమాణం ఎక్కువైనా కూడా ఊబకాయం వస్తుంది. మంచినీరు తక్కువగా తీసుకునేవారు, తరచూ డీహైడ్రేషన్ కి గురయ్యేవారు ఊబకాయులుగా మారే ప్రమాదం ఉందని ఆ పరిశోధన సారాంశం. అమెరికాలోని ఊబకాయుల్లో ఎక్కువమంది ఇలాంటి లక్షణాలతో ఉన్నారని తెలుస్తోంది.

ఎడారి ఎలుకలపై ప్రయోగం..

ఉత్తర ఆఫ్రికాలోని ఎడారులు, లవణీకరణం ఎక్కువగా ఉన్న చిత్తడి నేలల్లో పెరిగే సామోమిస్ ఒబెసస్ అనే ఎలుక జీవనశైలిని పరిశోధకులు అధ్యయనం చేశారు. సాలికోర్నియా అనే మొక్కల వేరులే దీనికి జీవనాధారం. పురుగూ పుట్రా దొరకని చోట ఆ మొక్కల వేరులతోటే ఈ ఎలుక ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. అయితే ఈ వేర్లు అత్యధిక ఉప్పుని కలిగి ఉంటాయి. సముద్రపు మొక్కలకంటే అత్యధిక లవణీయత వీటిలో ఉంటుంది. ఎక్కువరోజులు సాధారణ ఆహారం లేకపోయినా.. ఉప్పు వల్లే ఈ ఎలుక జీవక్రియలు జరిగి శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఇదే ఎలుకలను ప్రయోగశాలకు తీసుకొచ్చి సాధారణ ఆహారాన్ని ఇస్తే వెంటనే బరువు పెరిగింది, ఊబకాయంతో కదల్లేకుండా మారింది. అదే ఎలుకకు చక్కెర తక్కువగా ఉన్న ఆహారం, కేవలం కాయగూరలను అందిస్తే మాత్రం ఆరోగ్యంగా ఉంది. అంటే.. సాధారణ ఆహారం తీసుకునేవారు, పరిమితికి మించి ఉప్పు తీసుకుంటే.. ఊబకాయం ఖాయం అని ఈ పరిశోధన తెలియజేస్తోంది. ఉప్పు వల్ల మనం తీసుకునే ఆహార పదార్థంలోని కార్బోహైడ్రేట్ లు ఫ్రక్టోజ్ గా మారిపోయే ప్రమాదం ఎక్కువ. ఈ అదనపు శక్తితో చక్కెర నిల్వలు శరీరంలో పెరిగిపోయి ఊబకాయం పెరుగుతుంది.

చక్కెరతోపాటు, అధిక మొత్తంలో కార్న్ సిరప్ ని వాడటం ద్వారా శరీరంలో ఫ్రక్టోజ్ నిల్వలు పెరిగి 15శాతం మంది అమెరికన్లు ఊబకాయులుగా మారారని సర్వేలు చెబుతున్నాయి. ఇది ప్రీ డయాబెటిస్ అనే స్థితికి తీసుకొస్తుంది. ప్రీ డయాబెటిస్ అంటే ఇక షుగర్ వ్యాధి మొదలు కాబోతోందనే వార్నింగ్ అనమాట. రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రక్టోజ్ ఉత్పత్తి పెరుగుతుంది. బంగాళాదుంపలు, అన్నం, మరికొన్ని ఇతర పదార్థాలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ వెంటనే విడుదలవుతుంది. తద్వారా ఫ్రక్టోజ్ ఉత్పత్తి పెరుగుతుంది, దీంతో కొవ్వు ఉత్పత్తి అందిస్తుంది. ఈ కొవ్వు వల్ల నీరు కూడా ఉత్పత్తి అవుతుందని తాజా పరిశోధన చెబుతోంది. అంటే శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవారి శరీరంలో జీవక్రియ ద్వారా నీటి అవసరాలు తీరుతాయి. వారు ప్రత్యేకంగా నీరు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఊబకాయులు నీరు ఎక్కువగా తాగకపోవడానికి ఇదే ప్రధాన కారణం. తిమింగలాలు, ఇతర కొన్ని జంతువులు కూడా ఇదే పద్ధతిని అనుసరించి తమ శరీరంలో కొవ్వుని కరిగించి నీటి అవసరాలను తీర్చుకుంటాయి.

నీరు తీసుకోకపోవడం..

ఊబకాయుల జీవనశైలిని గమనిస్తే, వారు నీరు తాగడం చాలా తక్కువ. ఆహారం ఎక్కువగా తీసుకుంటారేమో కానీ, నీరు మాత్రం చాలా పరిమితంగా తీసుకుంటారు. దానివల్ల వారి శరీరంలో జరిగే జీవరసాయన క్రియల్లో విపరీతమైన మార్పు వస్తుంది, అది మరింత ఊబకాయానికి దారి తీస్తుంది. ఆరోగ్యవంతంగా ఉండాలంటే కచ్చితంగా రోజుకి 8 గ్లాసుల మంచినీరు తాగాలని చెబుతున్నారు నిపుణులు. ఉప్పు తీసుకోవడం, నీరు సరిగా తీసుకోకపోవడం.. ఈ రెండూ ఊబకాయాన్ని కలిగిస్తాయి. నీరు ఎక్కువగా తాగడం అనే సలహా ఆసక్తికరంగా లేకపోయినా అది చాలా ఉపయోగవంతమైనదని అంటున్నారు నిపుణులు. ఊబకాయం సమస్య రాకుండా ఉండాలంటే కచ్చితంగా నీరు ఎక్కువగా తాగాలంటున్నారు. ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని బాగా తగ్గించాలంటున్నారు.

First Published:  31 Aug 2022 7:29 AM IST
Next Story