ప్రొటీన్ షేకులు మంచివేనా? ప్రమాదమా?
ప్రపంచవ్యాప్తంగా ప్రొటీన్ షేక్స్ మంచివేనా వీటిని తాగటం సురక్షితమేనా అనే ఆందోళన మొదలైంది. ఈ నేపధ్యంలో వైద్యరంగ నిపుణులు తరచుగా ప్రొటీన్ షేక్స్ ప్యాకెట్ల పైన ఆరోగ్యపరమైన హెచ్చరికలు ఉండాలని సూచిస్తున్నారు.
ప్రొటీన్ షేక్ తాగిన మూడు రోజులకు మెదడు దెబ్బతిని పదహారేళ్ల రోహన్ గోధానియా అనే కుర్రాడు మరణించాడు. ఇది జరిగింది 2020లో. ఈ సంఘటన తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రొటీన్ షేక్స్ మంచివేనా వీటిని తాగటం సురక్షితమేనా అనే ఆందోళన మొదలైంది. ఈ నేపధ్యంలో వైద్యరంగ నిపుణులు తరచుగా ప్రొటీన్ షేక్స్ ప్యాకెట్ల పైన ఆరోగ్యపరమైన హెచ్చరికలు ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ ప్రొటీన్ షేక్స్ అంత ప్రమాదకరమా... తెలుసుకుందాం...
రోహన్ విషయంలో ఏం జరిగింది...
రోహన్ తండ్రి తమ కుమారుడు బాగా సన్నగా ఉండటంతో... అతను కండరాల బలం పెరిగి పుష్టిగా మారతాడనే ఆశతో ప్రొటీన్ షేక్ తెచ్చి తాగించాడు. అయితే ఒక్కసారిగా శరీరంలో ప్రొటీన్ పెరగటంతో రోహన్.. చాలా అరుదుగా కనిపించే జన్యుపరమైన ఓటిసీ (ఆర్నిథిన్ ట్రాన్స్ కార్బమైలేస్) అనే సమస్యకు గురయ్యాడు. దీనివలన రోహన్ శరీరంలో... రక్తంలో అమ్మోనియా ప్రమాదకరమైన స్థాయికి పెరిగింది. అది అతని మరణానికి దారితీసింది. అయితే రోహన్ అవయవాలను దానం చేయటం వలన అతని మరణానికి అసలైన కారణమేంటనేది వైద్యులు తెలుసుకోలేకపోయారు.
ఓటిసీ అనేది ఒక ఎంజైమ్. మన లివర్ లోని అమ్మోనియా యూరియాగా మారాలంటే ఇది చాలా ముఖ్యం. లివర్ లోని అమ్మోనియా యూరియాగా మారాక అది రక్తంలో ప్రవహించి మూత్రపిండాలను చేరి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే ఓటిసి ఎంజైమ్ లేకపోవటం వలన లివర్లోని అమ్మోనియా యూరియాగా మారి బయటకు వెళ్లకపోవటంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ప్రొటీన్ షేక్ తాగినవారిలో ఒక్కసారిగా ప్రొటీన్లు పెరిగిపోవటం వలన ఇలా జరుగుతుంది. అయితే అరుదుగా సంభవించే ప్రమాదమే అయినా... ప్రొటీన్ షేక్స్ వలన ఇలాంటి ప్రమాదమంటూ ఒకటి ఉంది కనుక... వాటి ప్యాకెట్ల పైన ఈ విషయం గురించిన హెచ్చరిక ముద్రించాలని వైద్యరంగ నిపుణులు భావిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
♦ ప్రొటీన్ షేక్స్ తాగేవారు తాము శారీరక వ్యాయామ శిక్షణ పొందుతున్న ట్రైనర్ సలహా తీసుకునే ప్రొటీన్ షేక్స్ ని తాగాలి. తగిన మోతాదులో వీటిని తీసుకోవటం చాలా అవసరం.
♦ ప్రొటీన్ మోతాదు పెరిగితే పేగుల కదలికపైన ప్రభావం పడుతుంది.
♦ మొటిమలు, వికారం, దాహం, కడుపు ఉబ్బరం లాంటి దుష్ప్రభావాలు ఉండవచ్చు. ఆకలి తగ్గుతుంది. తీవ్రమైన అలసట, తలనొప్పికి గురయ్యే అవకాశం ఉంది.
♦ మగవారికి రోజుకి 56గ్రాములు, మహిళలకు 46 గ్రాముల ప్రొటీన్ అవసరమవుతుంది. ఒక గుప్పెడు నట్స్, ఒకటి లేదా రెండు గ్లాసుల పాలు తాగితే సరిపోతుంది. ఒకవేళ మాంసాహారులు అయితే నాలుగు లేదా అయిదు ముక్కల చికెన్ తో తగిన మోతాదు ప్రొటీన్ ని పొందవచ్చు.
♦ ప్రొటీన్ డ్రింక్ వలన అలర్జీ రియాక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. పాలలోని లాక్టోస్ అనే చెక్కరలు పడనివారు అలర్జీకి గురవుతారు. లాక్టోస్ పాలలోని ప్రొటీన్లలో ఉంటాయి.
♦ ప్రొటీన్ పానీయాల్లో మనం ఊహించని స్థాయిలో కేలరీలు ఉండవచ్చు. దీనివలన ఇవి తాగేవారు మోతాదుకి మించిన కేలరీలను తీసుకునే అవకాశం ఉంటుంది. మోతాదుకి మించిన ప్రొటీన్ల వలన కేలరీలు పెరిగి బరువు పెరగడమే కాకుండా ఇంకా అనేక విపరీత పరిణామాలు సైతం సంభవించవచ్చు. మూత్రంలో క్యాల్షియం పెరిగి అది కిడ్నీల్లో రాయికి దారితీయవచ్చు. అలాగే గౌట్ వ్యాధికి కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది. కనుక ప్రొటీన్లు తీసుకునేటప్పుడు వాటిలోని కేలరీలను గురించిన అవగాహన సైతం ఉండాలి.