Telugu Global
Health & Life Style

నరాలు ఉబ్బుతున్నాయా? వెరికోస్ వీన్స్ కావొచ్చు! జాగ్రత్తలు ఇలా..

వెరికోస్ వీన్స్‌.. ఈ పదం గురించి పెద్దగా తెలియకపోయినా.. ఈ సమస్య గురించి తెలిసే ఉంటుంది. చాలామందికి కాలి వెనుక వైపు రక్తనాళాలు ఉబ్బి బయటకు కనిపిస్తాయి. దీన్నే వెరికోస్ వీన్స్ అంటారు.

నరాలు ఉబ్బుతున్నాయా? వెరికోస్ వీన్స్ కావొచ్చు! జాగ్రత్తలు ఇలా..
X

వెరికోస్ వీన్స్‌.. ఈ పదం గురించి పెద్దగా తెలియకపోయినా.. ఈ సమస్య గురించి తెలిసే ఉంటుంది. చాలామందికి కాలి వెనుక వైపు రక్తనాళాలు ఉబ్బి బయటకు కనిపిస్తాయి. దీన్నే వెరికోస్ వీన్స్ అంటారు. ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువైంది. పదిమందిలో నలుగురికి ఈ సమస్య ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. అసలు ఇది ఎలా వస్తుంది? వస్తే ఏం చేయాలి?

వెరికోస్ వీన్స్‌ను గుర్తించడం చాలా తేలిక. కాళ్లపై రక్తనాళాలు ఉబ్బి బయటకు కనపడుతుంటాయి. వంకర్లు తిరిగి, బ్లూ కలర్ చారలు కనిపిస్తుంటాయి. గుండెకు రక్తాన్ని పంప్‌ చేసే నాళాల్లో అడ్డంకులు వచ్చి రక్తం అక్కడే నిలిచిపోవడం వల్ల కాళ్ల నరాలు (సిరలు) ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఎక్కువసేపు నిలబడి పని చేయడం, ఎక్కువగా కూర్చోవడం, ఒబెసిటి, హార్మోన్ల లోపం, వంశ పారంపర్యం వల్ల ఇది వస్తుంది.

మామూలుగా నడుస్తున్నప్పుడు కాలి నరాల్లో ఒత్తిడి తగ్గుతుంటుంది. కానీ వెరికోస్‌ వీన్స్‌ ఉన్నవారిలో ఒత్తిడి తగ్గకపోగా పెరుగుతుంటుంది. దీంతో నడుస్తున్నప్పుడు, నిలబడినప్పుడు పిక్క కండరాల్లో నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. రక్తం సరిగ్గా పైకి వెళ్లట్లేదు కాబట్టి కాళ్ల వాపులు కూడా రావచ్చు. ఈ సమస్య మొదటిదశలో ఉన్నప్పుడు దాన్ని అదుపు చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

వ్యాయామాలు ఇలా.

వెరికోస్ వీన్స్ తగ్గడం కొసం లెగ్ ఎక్స్‌టెన్షన్ వ్యాయామం చేయొచ్చు. కుర్చీలో నిటారుగా కూర్చొని, రెండు కాళ్లు కింద ఉంచాలి. తర్వాత ఒక కాలిని స్ట్రైట్‌గా చాపాలి. ఇలా ఒక కాలి తర్వాత మరో కాలుతో ఈ వ్యాయామాన్ని రిపీట్ చేయాలి. ఇలా కాళ్లు సమాంతరంగా చాపడం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కాలి వెనుక భాగంలో నరాలు స్ట్రెచ్ అవుతాయి.

వెరికోస్ వీన్స్‌కు వాకింగ్ కూడా మంచి వ్యాయామం. రోజూ ఒక అరగంట నడవడం వల్ల శరీరమంతా యాక్టివేట్ అవుతుంది. శరీరంలోని ప్రతి అవయవంలో, ముఖ్యంగా కాళ్లలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వెరికోస్ వీన్స్ ఉన్నవాళ్లు కాళ్లపై ఎక్కువగా భారం పడకుండా ఫ్లెక్సిబిలిటీ ఉన్న షూ వేసుకుని వాకింగ్ చేయడం మంచిది.

జాగ్రత్తలు ఇలా..

రోజూ వ్యాయామం చేయడం వల్ల కండరాల పనితీరు ఇంప్రూవ్ అయ్యి, వెరికోస్‌ వీన్స్‌ సమస్య ముదరకుండా ఉంటుంది.

కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు కాళ్లు ఎత్తు మీద పెట్టుకోవడం లాంటివి చేస్తే కాస్త లాభం ఉంటుంది. జాగింగ్‌, స్విమ్మింగ్, సైక్లింగ్‌ లాంటి వ్యాయామాలు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి.

ఒబెసిటీ.. వెరికోస్‌ వీన్స్‌ బాధను మరింత పెంచటమే కాదు. వాటివల్ల ట్రీట్‌మెంట్ కూడా కష్టంగా తయారవుతుంది. ఒబెసిటీ ఉన్నవాళ్లలో రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల రక్తనాళాల్లో తగినంత ఫ్లో ఉండదు. కాబట్టి సమస్య ఉన్నవాళ్లు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.

వెరికోస్ వీన్స్ లక్షణాలు కనిపించగానే డాక్టర్‌‌ని సంప్రదించడం మంచిది. లేకపోతే సమస్య బాగా ముదిరి, బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదముంది.

First Published:  19 April 2024 10:04 AM
Next Story