దగ్గు సిరప్‌తో కోవిడ్‌కు చెక్..! - మూడు వర్సిటీల పరిశోధకుల వెల్లడి
జాదవ్‌పూర్, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలతో కలిసి జరిపిన పరిశోధనలో దగ్గు సిరప్ ద్వారా, ఎక్స్‌పెక్టోరంట్స్ మందుల ద్వారా కోవిడ్ వైరస్ తీవ్రతను తగ్గించవచ్చని గుర్తించినట్టు వారు వెల్లడించారు.
కోవిడ్ రేపిన కల్లోలాన్ని, మారణ హోమాన్ని జనం ఎప్పటికీ మరువలేరు. ఇప్పటివరకు దాని తీవ్రత తగ్గినా.. మళ్లీ అది ఏదోకవిధంగా ముంచుకొస్తుందేమోనన్న భయం జనంలో ఉంది. ప్రపంచమంతటా కోవిడ్ తీవ్రత తగ్గినా.. ఇటీవల చైనాలో కోవిడ్ ఉధృతి తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ విషయంలో జనంలో భయం కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ కూడా విభిన్న కోణాల్లో పరిశోధన చేస్తోంది. జాదవ్‌పూర్, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలతో కలిసి జరిపిన పరిశోధనలో దగ్గు సిరప్ ద్వారా, ఎక్స్‌పెక్టోరంట్స్ మందుల ద్వారా కోవిడ్ వైరస్ తీవ్రతను తగ్గించవచ్చని గుర్తించినట్టు వారు వెల్లడించారు.
పరిశోధకులు వీరే..
ఐఐటీ మద్రాస్‌కు చెందిన డీన్, అప్లయిడ్ మెకానిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మహష్ పంచగ్నుల, జాదవ్‌పూర్ వర్సిటీ న్యూక్లియర్ స్టడీస్ అండ్ అప్లికేషన్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరణ్యక్ చక్రవర్తి, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నీలేశ్ ఎ.పటంకర్ ఈ పరిశోధన బృందంలో ఉన్నారు. కోవిడ్ వైరస్ ముక్కు, గొంతు నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే విధానాలపై వీరు పరిశోధన చేశారు. వ్యాధి తీవ్రత ఎలా మారుతోంది.. దాని నియంత్రణ ఎలా.. అన్న అంశాలపై గణిత శాస్త్ర నమూనాల ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలను బట్టి.. మ్యూకస్ ద్వారా వైరస్ కదులుతూ శ్వాస నాళాల్లోకి వెళుతోందని, ఈ వైరస్ రక్తం ద్వారా ఊపిరి తిత్తుల లోతుల్లోకి చేరుతోందని వీరు చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ తమ పరిశోధనలో వారు పరిగణనలోకి తీసుకున్నారు.
మ్యూకస్ తుంపర్లకు చెక్ పెడితే సమస్య పరిష్కారం..
ఐఐటీ మద్రాస్‌కు చెందిన మహష్ పంచగ్నుల మాట్లాడుతూ.. కోవిడ్ -19 మొదటి లక్షణం బయటపడిన తర్వాత రెండున్నర నుంచి ఏడు రోజుల్లో అది నిమోనియా, ఇతర ఊపిరితిత్తుల సంబంధ ఇబ్బందులకు దారితీస్తోందని వెల్లడించారు. ఇన్‌ఫెక్షన్ కు గురైన మ్యూకస్ తుంపర్లు ముక్కు, గొంతు ద్వారా ఊపిరితిత్తులకు వెళ్లినప్పుడు ఇది సంభవిస్తోందని తెలిపారు. మ్యూకస్ తుంపర్లను ఆదిలోనే తగ్గించగలిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. దగ్గు సిరప్, ఎక్స్‌పెక్టోరంట్స్ మందుల ద్వారా తుంపర్లను నియంత్రించవచ్చని ప్రతిపాదిస్తున్నామని ఆయన తెలిపారు.
మరో పరిశోధకుడు డాక్టర్ అరణ్యక్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఇన్‌ఫెక్షన్ పెరుగుదల, వ్యాధి తీవ్రత అనేది రోగిలోని ఇమ్యూన్ స్పందన మీద ఆధారపడి ఉంటుందని వివరించారు. ఇన్‌ఫెక్షన్‌కు గురైన మ్యూకస్ తుంపర్లు ముక్కు, గొంతు నుంచి ఊపరితిత్తుల లోపలి భాగాల్లోకి వెళ్లకుండా మందుల ద్వారా నియంత్రించవచ్చని, నిమోనియా ఇతర ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులను వ్యాక్సినేషన్ ద్వారా నియంత్రించవచ్చని ఈ పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు.