తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న ఊబకాయులు
ఊబకాయం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకప్పుడు పశ్చిమ దేశాలకే పరిమితమైన ఊబకాయం ఇప్పుడు భారత్‌కు విస్తరించి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ NIN నిర్వహించిన తాజా అధ్యయనం తెలుగు రాష్ట్రాల్లోనూ ఊబకాయుల సంఖ్య పెరిగిపోతోందని హెచ్చరించింది. ఊబకాయం అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకుంటే ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం రోగం కాకపోయినా ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుందని వివరిస్తున్నారు.
ఊబకాయం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఊబకాయం, అధిక బరువు సమస్య ఆందోళనకర స్థాయిలో ఉందని పట్టణాలు, నగరాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఊబకాయం సమస్య ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం వివరాలు అంతర్జాతీయ జర్నల్ న్యూట్రియంట్స్‌లో ప్రచురితమయ్యాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు వర్గాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం పోషకాల స్థాయిని అంచనా వేశారు. హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామాల నుంచి మొత్తం 10,350 మంది వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఇందులో 8,317 మంది హైదరాబాద్‌కు చెందిన వారు కూడా ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో 47.7 శాతం పెద్దలు ఊబకాయంతో బాధపడుతుండగా.. 14.8 శాతం మంది అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో ఊబకాయం సమస్య 46.7 శాతం ఉంది. అధికబరువు సమస్య 14.8 శాతం నమోదైంది. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో వయసు తేడా తెలంగాణలో 50.6 శాతమైతే.. ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో 33.2 శాతం మంది ఉన్నారు. అంతేకాదు అధ్యయనంలో పాల్గొన్న హైదరాబాదీల్లో 11 శాతం మంది అధిక రక్తపోటు సమస్యను కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. వృద్ధుల్లో పట్టణ ప్రాంతాల్లో 50.6% మంది గ్రామాల్లో 33.2% ఊబకాయంతో బాధపడుతున్నారని అధ్యయనం నివేదించింది. వేర్వేరు వయసుల వారిలో పోషకాల స్థాయి, ఆ స్థాయిల్లో ఉండేందుకు గల కారణాలను ఈ అధ్యయనం ద్వారా అర్థం చేసుకున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ శుక్రవారం తెలిపింది.
హైదరాబాద్, చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామీణ ప్రాంతాల్లోని వారు 5 శాతం మధుమేహంతో బాధపడుతున్నట్లు అధ్యయనం తెలిపింది. అధ్యయనంలో పాల్గొన్న వారు కొంతమందిలో అవసరమైన దానికంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆహారం, పర్యావరణం, శారీరక శ్రమ లేకపోవడం, వంటివి ఇందుకు కారణం కావచ్చని, చాలామందిలో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయమాల ప్రాధాన్యత కూడా తెలియదు’’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ సమరసింహా రెడ్డి తెలిపారు. జాతీయ సగటుకు అనుగుణంగా పిల్లలలో పోషకాహారం తక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది.