Telugu Global
Family

బంధాలను పాడుచేసేవి ఇవే..

ఏదైనా ఒక రిలేషన్ నిలబడాలంటే... ప్రేమ, నమ్మకం, నిజాయితీ ఉండాలని అందరూ చెప్పేదే. అయితే ఎంత ప్రేమ ఉన్నా , ఎంత నిజాయితీగా ఉన్నా ఏదో ఒక టైంలో ఎన్నో రోజుల నుంచి కాపాడుతూ వస్తున్న రిలేషన్ ఏదో ఒక కారణానికి పుటుక్కుమంటుంది.

బంధాలను పాడుచేసేవి ఇవే..
X

ఏదైనా ఒక రిలేషన్ నిలబడాలంటే... ప్రేమ, నమ్మకం, నిజాయితీ ఉండాలని అందరూ చెప్పేదే. అయితే ఎంత ప్రేమ ఉన్నా , ఎంత నిజాయితీగా ఉన్నా ఏదో ఒక టైంలో ఎన్నో రోజుల నుంచి కాపాడుతూ వస్తున్న రిలేషన్ ఏదో ఒక కారణానికి పుటుక్కుమంటుంది. దీనికి పెద్ద కారణమేమీ ఉండదు. కానీ తెలియకుండానే రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. అయితే అలా బ్రేక్ చేసే కిల్లర్స్ మనకు కనిపించకుండా మనలోనే ఉంటాయట. వాటినే సైలెంట్ కిల్లర్స్ అంటారు. అందుకే కాస్త జాగ్రత్తగా ఆ కిల్లర్స్ మీద కూడా ఓ కన్నేయాలి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాలి.

ఒక రిలేషన్ బ్రేక్ అయిన తర్వాత ఎందుకిలా జరిగిందని ఆలోచిస్తే... పెద్ద కారణమేదీ కనిపించదు. పోనీ పార్ట్‌నర్ మీద ప్రేమ తగ్గిందా అంటే అదీలేదు. ఎలాంటి మార్పు ఉండదు. కానీ కలిసి ఉండడానికి మనసు ఒప్పుకోదు. అందుకే అసలింతకీ తప్పెక్కడ జరుగుతుందో కనుక్కుందామని ఇటీవల సైకాలజిస్టులు ఓ పరిశోధన చేశారు. చిన్న చిన్న ప్రవర్తనలోపాల వల్లే ఇలా జరుగుతోందని ఆ పరిశోధనలో తేలింది. అవేంటి? వాటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం.

బిట్టర్‌‌నెస్

బిట్టర్‌‌నెస్ అంటే మనలో ఉండే చేదు. అంటే.. మనలో దాచుకున్న కొన్ని భయాలు, కోపాల వంటివి. పార్ట్‌నర్ మీద ఎప్పుడైనా కోపం వస్తే దాన్ని అప్పటికప్పుడు చూపించకుండా దాచుకోవడం వల్ల అది తెలియకుండా లోపల నెగెటివ్ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుంది. ఏదో ఒక టైంలో అది అసహనంలా మారి రిలేషన్‌ని బ్రేక్ చేస్తుంది. ఇది మనకు తెలియకుండా లోపల జరిగే ఫీలింగ్. దీని నుంచి బయటపడాలంటే.. వీలైనంత ఓపెన్‌గా ఉండాలి. కోపం వస్తే మీ కోపాన్ని చూపించేయాలి. అప్పుడది అక్కడితో పోతుంది. దాచుకోవడం వల్ల అది రోజు రోజుకి పెరిగి ఒకేసారి తుఫాన్‌లా విరుచుకుపడొచ్చు. అందుకే కోపం చిన్నదైనా పెద్దదైనా ఎప్పటికప్పడు చూపిస్తేనే బెటర్. దాచుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.

అంచనాలొద్దు

రిలేషన్‌లో ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి ఉంటుంది. వాళ్ల ఇష్టాయిష్టాలు అన్నీ తెలుసుకొని ఉంటారు. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అనుకుంటారు. అలా ఒకరినొకరు తెలుసుకోవడం బాగుంటుంది. కానీ, అలా అని అన్ని విషయాలు తెలుసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే.. మరీ ఎక్కువ తెలుసుకున్న కొద్దీ ‘తన గురించి నాకు మొత్తం తెలుసు’, ‘తనకి ఇది కచ్చితంగా నచ్చదు’.. అనే అంచనాలు ఏర్పడుతాయి. ఈ అంచనాలు అంత మంచివి కావు. ఒక్కోసారి మీకు తెలిసింది, అవతలి వ్యక్తి అనుకుంటుంది వేరుగా ఉండొచ్చు. మీరు మొత్తంగా తన మైండ్ అయితే చదవలేరు కదా! అందుకే కొంతవరకైనా ఎవరి పర్సనల్ స్పేస్‌లో వాళ్లు ఉండటం మంచిది. ముందే అన్నీ తెలుసుకోవడం, ఆపై ఒక అంచనాకు రావడం వల్ల కొత్తదనాన్ని కోల్పోతారు. వెతికేకొద్దీ ప్రతి మనిషిలో ఎంతో కొంత కొత్తదనం కనిపిస్తుంది. దానిని ఎంజాయ్ చేయగలగాలి. అందుకే అంచనాలొద్దు.

తెగే దాకా లాగొద్దు

ఏదైనా చిన్న గొడవైనప్పుడు అది ఎక్కడ మొదలై ఎక్కడి దాకా వెళ్తుందో తెలీదు. తెలియకుండానే దాన్ని చాలా దూరం సాగదీస్తారు. నిజానికి ఆ గొడవకి అంత సీన్ ఉండదు. మనమే లాగిలాగి తెగేదాకా తెస్తాం. ఇలాంటప్పుడే ఎక్కడో ఓ చోట గొడవని ముగిస్తే మంచిది. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు గొడవలు కాకుండా అభిప్రాయాలను నిజాయితీగా ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా వేటినైనా పరిష్కరించుకోవచ్చు. మనసిచ్చిన వ్యక్తి దగ్గర ఓ మెట్టు తగ్గినా పర్వాలేదు.

ఏదో ఒకటి మాట్లాడితేనే..

ఇద్దరూ కలిసి ఉన్నపుడు మధ్యలోకి మౌనాన్ని రానివ్వకూడదు. పరిచయమైన కొత్తలో బాగా మాట్లాడుకొని ఉంటారు. రాను రాను మాట్లాడుకోడానికి మాటలు దొరక్క కాదు.. కానీ, ఎందుకో రోజూ మాట్లాడే మాటలే కదా అని మాట్లాడ్డం తగ్గిస్తారు. అప్పడు ఇద్దరి మధ్యా ప్రవేశించిన మౌనం తర్వాత ఎంతదూరం వరకైనా తీసుకెళ్లొచ్చు. ఒక్కోసారి మామూలుగా లేదా ఏదైన చిన్న గొడవైన తర్వాత కూడా చాలా సేపు మాట్లాడకుండా సైలెన్స్ మెయింటెయిన్ చేస్తారు. అలాంటి సందర్భాల్లోనే మీ మధ్య దూరాన్ని మాటలతో నింపేయాలి. రిలేషన్‌షిప్‌లో సైలెన్స్ అంత మంచిది కాదు.

‘నేను’ వద్దే వద్దు

ఇదొక చిన్న చిట్కా. కానీ, ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. అదేంటంటే... మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా ‘నేను’ అనే మాటను వీలైనంత వరకూ తగ్గించాలి. ‘నేను’కి బదులు ‘మనం’ అనే మాటను రీప్లేస్ చేయాలి. ఈ చిన్న చిట్కా మీ రిలేషన్‌ను చాలా స్ట్రాంగ్‌గా చేయగలదు.

First Published:  16 Aug 2023 2:15 PM IST
Next Story