Telugu Global
Andhra Pradesh

మ‌రో వివాదంలో మాధ‌వ్‌..

మా నీళ్లు, మా భూములు తీసుకున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వండిరా ''ముండ కొడకల్లారా'' అని కియా ప్రతినిధులను తిట్టానని అందులో తప్పేంటని ఎదురు ప్రశ్నించారు మాధవ్.

మ‌రో వివాదంలో మాధ‌వ్‌..
X

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ రాస‌లీలల పేరుతో ఒక వీడియోను ప్రముఖ టీవీ చానళ్లలో ప్రసారం అవడం దుమారం రేపింది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఢిల్లీలోని పలు పార్టీల ఎంపీలకు షేర్ చేసినట్టు చెబుతున్నారు. ఢిల్లీలో ఈ వీడియో వైరల్ అవడం వైసీపీ ఎంపీకి ఇబ్బంది మారింది. గోరంట్ల మాధవ్ తక్షణం మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. మీడియా సమావేశంలో తన సహజ ధోరణిలోనే మీడియా వారిని బూతులు తిట్టారు. చెత్త నాకొడుకులంటూ మాట్లాడారు.

ఈ ప్రసారాలపై హైకోర్టుకు వెళ్తానని.. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఇప్పటికే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. ఏపీలో అధికారంలో ఉన్నది మీ పార్టీనే కాబట్టి అక్కడి పోలీసుల విచారణ నిజాయితీగా జరుగుతుందా అని ప్రశ్నించగా.. ప్రస్తుతం ఏపీలో పోలీసు వ్యవస్థ చంద్రబాబు హయాంలోలాగా లేదన్నారు. జగన్‌మోహన్ రెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ‌ ఇచ్చారని.. తప్పు చేస్తే సొంత పార్టీ వారిపైనా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఏపీ పోలీసులు ప్రస్తుతం ఎవరి పక్షాన పనిచేయడం లేదని.. కాబట్టి ఈ వ్యవహారంలో నిజానిజాలను వారే తేలుస్తారని చెప్పారు.

కియా ప్రతినిధులనూ గతంలో దూషించిన అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మరోసారి నోటి దురుసు ప్రదర్శించారు ఎంపీ. మా నీళ్లు, మా భూములు తీసుకున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వండిరా ''ముండ కొడకల్లారా'' అని కియా ప్రతినిధులను తిట్టానని అందులో తప్పేంటని ఎదురు ప్రశ్నించారు మాధవ్.

తొలి నుంచే అంతే.. హింసావాదిగా పోలీసు శాఖలో ముద్ర

గోరంట్ల మాధవ్‌ ఇప్పుడే కాదు.. పోలీసు శాఖలో ఉన్నప్పుడు ఆయన అనేక సార్లు వివాదాస్పదం అయ్యారు. సర్వీస్‌ మొత్తం ఏమాత్రం ఓర్పు, సహనం లేకుండా పోలీసులంటే లాఠీతోనే పలకరించాలన్న నైజం ఇతడిలో ఉండేది. డజన్ల కొద్ది చార్జీ మెమోలు తీసుకున్నారు. 10కిపైగా ప్రైవేట్ కేసులు నమోదు అయ్యాయి. ఎస్‌ఐగా ఉన్నప్పుడే రెండు సార్లు సస్పెండ్ అయ్యారు. ఏదైనా కేసు నమోదు అయితే ఇరు వర్గాలను స్టేషన్‌కు పిలవడం అక్కడే వార్నింగ్‌లు ఇవ్వడం, పంచాయితీలు చేయడం అప్పట్లో మాధవ్ నైజంగా ఉండేదన్న కథనాలు మీడియాలో వచ్చాయి. వినకుంటే దారుణంగా కొట్టేవారన్న ఆరోపణలు వచ్చాయి. పలుమార్లు వీఆర్‌కు వెళ్లారు. ఎన్నికల ముందు జేసీ దివాకర్ రెడ్డిని బూతులు తిట్టి మీసం మెలేయడం ద్వారా జగన్‌ మనసు గెలిచి ఎంపీ టికెట్ సాధించేశారు. ఈయన పలు కులాలను బహిరంగ వేదికల మీదే హెచ్చరిస్తుంటారు.

దేశమే నిర్ఘాంతపోయేలా మాధవ రెడ్డిపై దాడి

పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూ కట్టిన సమయంలోనూ.. అప్పుడు సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ అత్యంత క్రూరంగా వ్యవహరించారు. అనంతపురం సాయినగర్‌ స్టేట్ బ్యాంకు దగ్గర క్యూలైన్‌లో సరిగా నిలబడలేదంటూ భారత వాతావరణ పరిశోధన కేంద్రం ఉద్యోగి మాధవరెడ్డిని అత్యంత దారుణంగా కొట్టిన చరిత్ర మాధవ్‌కు ఉంది. అది కూడా నడి రోడ్లుపై.. ఇద్దరు పోలీసులను మాధవ్‌ రెడ్డిని గట్టిగా పట్టుకోమని ఆదేశించి.. ఆ తర్వాత లాఠీతో చూడడానికే భయమేసేలా కొట్టారు గోరంట్ల మాధవ్. ఆ దాడిలో మాధవ్‌ రెడ్డి చేయి విరిగింది. ఈ వీడియో జాతీయ స్థాయిలో వైరల్ అయింది. మానవ హక్కుల సంఘాలు రంగంలోకి దిగాయి.

అప్పుడు ఇంకా టీడీపీ ప్రభుత్వం ఉండడంతో వైసీపీ నేతలు, వైసీపీ మీడియా కూడా రంగంలోకి దిగి గోరంట్ల మాధవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. మాధవ్‌ రెడ్డికి చేయి విరిగి పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు వెళ్లి మాధవ్‌ రెడ్డి కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పి.. పరిస్థితి తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందినా మాధవ్ మాత్రం తాను చేసిన చర్యను సమర్ధించుకున్నారు.

ఎస్‌ఐతో మాధవ్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు.. వదిలేస్తే పోలీసులపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంటే కొట్టానని ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చెప్పిన వ్యక్తి గోరంట్ల మాధవ్. అంటే కోర్టు వేయాల్సిన శిక్షలను కూడా తానే వేయడంలో తప్పేలేదన్న భావన మాధవ్‌లో ఉండేది. ఇలా నడిరోడ్లపై చిన్నచిన్న కారణాలకే ప్రజలను విచక్షణ కోల్పోయి గోరంట్ల మాధవ్ దాడి చేసిన ఉందంతాలు అనంతపురం జిల్లా ప్రజలకు బాగా పరిచయమే. ప్రభుత్వ ఉద్యోగి మాధవ రెడ్డిపై దాడి చేసిన వ్యవహారంలో మాధవ్‌ను పోలీసు ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు.

అనంత మహిళలు ఒళ్లు అమ్ముకుంటున్నారని లోక్‌సభలో మాటలు

అప్పట్లో ఒకసారి అనంతపురం జిల్లాలో పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నించిన పవన్ కల్యాణ్.. ఇక్కడి మహిళలు బతుకుతెరువు లేక పక్క రాష్ట్రాలకు వెళ్లి వ్యభిచార ఊబిలో కూరుకుపోతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వైసీపీ నేతలంతా పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా మహిళలను పవన్ కల్యాణ్ కించపరిచారని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో జనసేన ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు లోక్‌సభలో ప్రసంగించిన గోరంట్ల మాధవ్‌.. అవే వ్యాఖ్యలు చేశారు. విధిలేక కరువు కారణంగా అనంతపురం జిల్లా మహిళలు ఒళ్లు అమ్ముకోవాల్సి వస్తోందని కామెంట్స్ చేశారు. దాంతో జనసేనతో పాటు ఇతర పార్టీలు వైసీపీపై విరుచుకుపడ్డాయి. వైసీపీ మౌనం దాల్చాల్సిన పరిస్థితి వచ్చింది.

గోరంట్ల మాధవ్‌పై రేప్‌ కేసు

గోరంట్ల మాధవ్‌పై రేప్‌ కేసు అంశాన్ని టీడీపీ పదేపదే ప్రస్తావిస్తుంటుంది. మాధవ్‌పై రేప్‌ కేసు ఉన్న విషయంలో ఎన్నికల అఫిడవిట్‌లోనూ వెల్లడించారని.. అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారని టీడీపీ పలుమార్లు ప్రశ్నించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో సామాన్యులనేనా ఎన్‌కౌంటర్ చేసేది పెద్దపెద్దవాళ్లను చేయరా అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. కొందరురాజకీయ నాయకులు గోరంట్ల మాధవ్‌పై రేప్‌ కేసు ఉందంటూ ఉదాహరణగా చూపుతూ.. ఆయన్నూ ఎన్‌కౌంటర్ చేస్తారా అని ప్రశ్నించేవారు. ఒక దశలో అనంతపురం టీడీపీ నేతలు గోరంట్ల మాధవ్‌ను ఢిల్లీ లెవల్ రేపిస్ట్‌ అంటూ సంబోధించారు.

వైసీపీకి ఇతర వర్గాలను దూరం చేసేలా మాధవ్ కుల రాజకీయాలు

మొన్నటి ఎన్నికల్లో జగన్‌మోహన్ రెడ్డి గోరంట్ల మాధవ్‌కు టికెట్‌ ఇవ్వడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని చెబుతుంటారు. అందులో జేసీ దివాకర్ రెడ్డిపై మీసం తిప్పి తోడ కొట్టడం ఒకటి అయితే.. రెండు కురవ కులానికి చెందిన వ్యక్తి కావడం. అప్పటికే తన కులంలో గుర్తింపు తెచ్చుకున్న మాధవ్‌కు టికెట్ ఇస్తే కురవ ఓట్లు మొత్తం పడుతాయన్న ఆలోచన జగన్ చేశారని చెబుతుంటారు. ఈ ఫార్మూలా విజయవంతమైంది. కానీ ఎన్నికల తర్వాత ఎంపీ హోదాలో గోరంట్ల మాధవ్ ఇతర వర్గాలకు వార్నింగ్‌లు ఇవ్వడం, తన కులం జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ కులాల పేర్లు ప్రస్తావిస్తూ వార్నింగ్‌లు ఇవ్వడం దుమారం రేపింది.

2020 డిసెంబర్లో కురవ కుల సంఘాలు ఏర్పాటు చేసిన వన భోజనాలకు వెళ్లిన గోరంట్ల మాధవ్.. రెడ్డి కులస్తులకు, కమ్మ కులస్తులకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. తన కులం వారి జోలికి వస్తే రెడ్లు, కమ్మవారి సంగతి తేలుస్తానని హెచ్చరించారు. కురవలకు తాను ఉంటానని.. ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్తానని పదేపదే వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల ముందు తనకు కులం లేదు, మతం లేదు, తనది ఖాకీ కులం అంటూ మాట్లాడిన గోరంట్ల మాధవ్ ఎంపీ అవగానే.. బహిరంగ వేదికలపై ఇతర కులాలను తిట్టడం దుమారం రేపింది. ఆయన పదేపదే తన కులాన్ని వెనకేసుకొచ్చేలా మాట్లాడడం.. ఆయనపై ఇతర వర్గాల్లో వ్యతిరేకతను పెంచిందన్న అభిప్రాయం ఉంది.

జగన్‌ మనసు గెలిచిన జేసీతో వివాదం

తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమం వద్ద జేసీ దివాకర్ రెడ్డి ఆందోళనకు దిగిన సమయంలో ఆయనపై ప్రబోధానంద భక్తులు రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదని జేసీ కొన్ని ఘాటు పదాలతో పోలీసులను తిట్టారు. దాంతో యూనిఫాంలోనే మీడియా ముందుకొచ్చిన గోరంట్ల మాధవ్‌.. జేసీ దివాకర్‌ రెడ్డి నాలుక కోస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. తొడ కొట్టారు, మీసం తిప్పారు. ఆ సమయంలో జేసీ దివాకర్ రెడ్డి అంతే తీవ్రంగా స్పందించారు. జేసీపై తొడ కొట్టి మీసం తిప్పి వార్నింగ్ ఇవ్వడంతో గోరంట్ల మాధవ్‌పై జగన్ దృష్టి పడింది. తర్వాత కొద్ది రోజులకే మాధవ్ రాజీనామా చేయడం, జగన్ టికెట్ ఖాయం చేయడం, వైసీపీ గాలిలో గెలవడం జరిగింది. గోరంట్ల మాధవ్‌ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన సమయంలో అనంతపురం జిల్లా ప్రజలు ఒక విధమైన ఆనందానికి లోనయ్యారు. మాధవ్ పనిచేసే ఏరియాలో ప్రజలు రోడ్ల మీద కాస్త స్వేచ్చగా నడవాలన్నా జంకే వారు. ఏ చిన్న కారణంతో మాధవ్ వచ్చి కొడుతారో అన్న భయంతో ప్రజలుండే వారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇక అతడి చేతిలో లాఠీ ఉండదన్న రిలీఫ్‌ను ప్రజలు ఫీల్ అయ్యారు.

First Published:  4 Aug 2022 2:49 PM IST
Next Story