Telugu Global
Editor's Choice

కాంగ్రెస్‌ దక్షిణాదికే పరిమితమవుతుందా?

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర దక్షిణాదిన ప్రారంభమైంది. ఈ యాత్రకు బహుళ వర్గాల నుంచి స్పందన వస్తున్నది. విభిన్న శ్రేణులకు చెందిన వారు రాహుల్‌ యాత్రలో భాగస్వాములవుతున్నారు. ఈ యాత్ర ఉత్తరాదిన ప్రారంభించి వుంటే అక్కడ తిరిగి కాంగ్రెస్‌ పుంజుకోడానికి అవకాశం ఉండేది కదా అన్నవారు లేకపోలేదు.

కాంగ్రెస్‌ దక్షిణాదికే పరిమితమవుతుందా?
X

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే పదవీ బాధ్యతలు స్వీకరించడంతో పార్టీ కొత్త పుంతలు తొక్కే అవకాశముందా? పార్టీ భవిష్యత్తు ఆశావహంగా ఉండే పరిస్థితులు నెలకొంటాయా? పార్టీ పనితీరు మారుతుందా? ముఖ్యంగా దళిత బహుజన వర్గాల్ని ఆకట్టుకుంటుందా? ఉత్తర భారతాన బలహీన పడిన కాంగ్రెస్‌ తిరిగి పుంజుకునే అవకాశముందా? కర్నాటకకు చెందిన సీనియర్‌ నేత, దళితవర్గానికి చెందిన ఖర్గే కాంగ్రెస్‌ సారథిగా ఎన్నికయ్యాక రాజకీయ పరిశీలకుల నుంచి వస్తున్న ప్రశ్నలివి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాదిని పక్కన పెట్టి దక్షిణ భారతదేశం మీదనే ఫోకస్‌ పెట్టిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాలకు రాబోయే రోజుల్లో చెక్‌ పెట్టి ఉత్తర భారతంలో కాంగ్రెస్‌ బలపడటానికి ఖర్గే ఎలాంటి వ్యూహాల్ని అనుసరిస్తారన్నది ఆసక్తికరం.

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర దక్షిణాదిన ప్రారంభమైంది. ఈ యాత్రకు బహుళ వర్గాల నుంచి స్పందన వస్తున్నది. విభిన్న శ్రేణులకు చెందిన వారు రాహుల్‌ యాత్రలో భాగస్వాములవుతున్నారు. ఈ యాత్ర ఉత్తరాదిన ప్రారంభించి వుంటే అక్కడ తిరిగి కాంగ్రెస్‌ పుంజుకోడానికి అవకాశం ఉండేది కదా అన్నవారు లేకపోలేదు. కానీ ఎంతో కొంత కాంగ్రెస్‌ పునాదులు బలంగా ఉన్న దక్షిణాదిన ప్రారంభించడం వల్లనే భారత్‌ జోడో యాత్రకు సానుకూల స్పందన వచ్చింది. దాని ప్రభావంతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది. వ్యూహాత్మకంగా యాత్రని దక్షిణాదిన ప్రారంభించడం సరైనదే అనిపించినప్పటికీ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న అనేకులు దక్షిణాదికి చెందినవారే కావడం గమనార్హం.

పార్టీ వ్యవహారాల్ని చక్కబెట్టే నాయకునిగా, సోనియా, రాహుల్‌ గాంధీలకు అత్యంత విశ్వాసపాత్రునిగా ఉన్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌ కేరళకు చెందినవారు. అలాగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శశిథరూర్‌ సైతం కేరళవాసి. పార్టీ మీద పట్టు ఉన్న రాహుల్‌ గాంధీ కూడా కేరళ లోని వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. భారత్‌ జోడో యాత్రని తమిళనాడులో ప్రారంభించినప్పటికీ కేరళలోనే ఎక్కువ రోజులు యాత్ర సాగడం విశేషం.

ఇపుడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయిన మల్లికార్జున ఖర్గే కర్నాటకకు చెందినవారు. ఇటీవలి కాలంలో కొత్తగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై పార్టీ అధికార ప్రతినిధిగా మీడియాలో క్రియాశీలకంగా ఉన్న జైరామ్‌ రమేశ్‌ సైతం కర్నాటకకు చెందిన నేత. యూత్‌కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు బి.వి. శ్రీనివాస్‌ సైతం కర్నాటకకి చెందిన యువ నాయకుడు. బిజెపి ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాల్ని ఎత్తిచూపుతూ చురుగ్గా ఉంటున్న పి.చిదంబరం తమిళనాడుకు చెందినవారు.

ఈవిధంగా దక్షిణాదికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలే చురుకుగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్ర పోషించడంతో ఉత్తరాదిని పక్కన పెట్టి దక్షిణాదిన తన దృష్టి నిలిపిందా అనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నది.

నిజానికి దక్షిణాదిన కూడా పార్టీ అంత బలంగా లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో అధికారాన్ని చేజిక్కించుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయి కూడా అధికారాన్ని నిలబెట్టుకోలేక బిజెపి క్రీడలకు బలయింది. తమిళనాడులో డిఎంకెతో సఖ్యత ఉన్నా మైనర్‌ భాగస్వామిగా మిగిలింది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నామమాత్రమైంది. తెలంగాణలో ప్రజా పునాది ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేదు. కనుక దక్షిణాదికి పరిమితమైనట్టు కనిపించినా దక్షిణాదిన సైతం బలపడే అవకాశాలు స్వల్పం. దళిత వర్గానికి చెందిన ఖర్గే ఏఐసిసి అధ్యక్షులు కావడం వల్ల కర్నాటకలో దళిత ఓటు బ్యాంకు పెరుగుతుందా? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ విషయం తేలుతుంది. కనుక కాంగ్రెస్‌ పార్టీ దక్షిణాదికి పరిమితం కావడం కాదు దక్షిణాదినైనా బలపడుతుందా అన్నదే అసలు ప్రశ్న.

ఇక ఉత్తర భారతంలో కొన్నాళ్ళుగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎవరి దారి వారు చూసుకున్నారు. చాలామంది నాయకులు ఇప్పటికే బిజెపిలో చేరిపోయారు. జ్యోతిరాదిత్య సింథియా, కపిల్‌ సిబాల్‌, గులాం నబీ అజాద్‌ వంటి వారు పార్టీని వదిలిపోయారు. కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌ లాంటి వారు ప్రభావిత నాయకులుగా లేరు. ఉత్తరాదిన రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌ నుంచి 2019లో లోక్‌సభకు ఎన్నికయిన నేత సోనియాగాంధీ ఒక్కరే. బీహార్‌లో ఆర్‌జెడితో పొత్తు ఉన్నప్పటికీ అక్కడ పార్టీ అంత బలంగా లేదు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో బలపడటం కాంగ్రెస్‌కు అత్యవసరం. మరీ ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ సాధించే ఫలితాలు ఉత్తరాదిలో ఆ పార్టీ భవిష్యత్తుకు సంబంధించి అంచనాకు రావడానికి తోడ్పడతాయి.

భారత్‌ జోడో యాత్రలో నిమగ్నమైన రాహుల్‌ గాంధీని ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి ఖర్గే పంపించగలరా? హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి పార్టీ బాధ్యతలు చూస్తున్న ప్రియాంక గాంధీ ఎంతవరకు సఫలమవుతారు? ఉత్తరాదిన కాంగ్రెస్‌ పుంజుకోడానికి ఖర్గే ఎలాంటి వ్యూహాల్ని అనుసరిస్తారు? ఉత్తరాదిన కాంగ్రెస్‌ స్థానాన్ని ఆక్రమించ జూసే ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) వ్యూహాలను ఎలా అడ్డుకుంటారు? అన్నవి ఖర్గే ముందున్న ప్రశ్నలు. ఈ అంశాలే రానున్న కాలంలో కాంగ్రెస్‌ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. బిజెపి ప్రాబల్యమున్న ఉత్తరాదిన నిలబడలేక దక్షిణాదికే పరిమితవుతున్నదా అనే ప్రశ్నకు జవాబు లభిస్తుంది.

First Published:  25 Oct 2022 6:22 PM IST
Next Story