మద్యంపై జగన్ ముందుకా..? వెనక్కా..?
అప్పులు చేసైనా, ఇబ్బందులు ఎదురైనా, పథకాల విషయంలో మాత్రం ఆలస్యం చేయడంలేదు, ఆపడంలేదు. ఆ మంచిపేరు పోగొట్టుకోవడం ఇష్టం లేకే.. మద్యపాన నిషేధం విషయంలో వెనకడుగు వేస్తున్నారు.
మాట తప్పను, మడమ తిప్పను. ఇది జగన్ మాట. 2019 ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అనే హామీ ఇచ్చారు జగన్. మేనిఫెస్టోలో కూడా దాన్ని పొందుపరిచారు. కానీ కాలక్రమంలో ఆ హామీ ఆలస్యమవుతోంది. అందుకే, నవరత్నాల హామీల్లో 90శాతం అమలు చేశామని చెబుతుంటారు జగన్. వైసీపీ నేతలు కూడా అదే మాట అంటారు కానీ, నూటికి నూరుశాతం అమలు చేశామని చెప్పరు. ఇప్పుడా పది శాతం గురించి ఎవరూ ప్రశ్నించలేదు కానీ, మంత్రి అమర్నాథ్ మద్యపాన నిషేధంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ప్రతిపక్షాలకు అనుకోని అస్త్రాన్ని అందించాయి. మద్యపాన నిషేధం అనే హామీతో అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు మాట తప్పారని, మడమ తిప్పారని విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. గతంలో జగన్ మద్యపాన నిషేధం గురించి చెప్పిన మాటల్ని, ఇటీవల అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల్ని పోలుస్తూ సెటైర్లు వేస్తున్నారు.
నిషేధంపై జగన్ విధానమేంటి..?
మద్యపానాన్ని నిషేధిస్తే రాష్ట్ర ఖజానాకు కష్టకాలం వచ్చినట్టే. సంక్షేమ పథకాలకు సర్దుబాట్లు చేయలేక ఇటీవల ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఉద్యోగుల పీఆర్సీ కూడా అందుకే ఆలస్యమైంది, సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కూడా ఆ కారణంతోనే లేటయింది. ఇలాంటి విషయాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నా, పథకాలను మాత్రం ఎక్కడా ఆగకుండా కొనసాగిస్తున్నారు జగన్. అప్పులు చేసైనా, ఇబ్బందులు ఎదురైనా, పథకాల విషయంలో మాత్రం ఆలస్యం చేయడంలేదు, ఆపడంలేదు. ఆ మంచిపేరు పోగొట్టుకోవడం ఇష్టం లేకే.. మద్యపాన నిషేధం విషయంలో వెనకడుగు వేస్తున్నారు.
పథకాలా..? మద్యపాన నిషేధమా..?
మద్యపానాన్ని నిషేధించడం కంటే దాని రేట్లు పెంచి పేదలకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుందని సర్దిచెబుతున్నారు వైసీపీ నేతలు. కానీ, రేట్లు పెంచడం వల్ల సామాన్యుడి ఇల్లు గుల్లవుతుందే కానీ, మందు మానడంలేదు. ఈ దశలో మద్యపాన నిషేధం అమలు చేస్తే ఖజానాకి కష్టం, సంక్షేమ పథకాలకు ఇబ్బంది ఎదురవుతుంది..? అందుకే మద్యపాన నిషేదం జోలికి వెళ్లే సాహసం చేయడంలేదు ప్రభుత్వం. నవరత్నాలలో ఆ ఒక్కటీ తప్ప అన్నీ అమలు చేశాం కదా అంటోంది ప్రభుత్వం, ఆ ఒక్కటీ ఎందుకు చేయడంలేదని నిలదీస్తోంది ప్రతిపక్షం. మరి మీ హయాంలో ఏం చేశారంటూ టీడీపీని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. ఇలా ఇప్పుడు కొత్త విమర్శలు, కొత్త రాజకీయం మొదలయ్యాయి. ఆమధ్య రోడ్ల సమస్యలపై జనసేన హడావిడి చేసింది, ఆ తర్వాత టీడీపీ వరద రాజకీయం మొదలు పెట్టింది, ఇప్పుడది మద్యపాన నిషేధం చుట్టూ తిరుగుతోంది. 2024 ఎన్నికల నాటికి ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మద్యపాన నిషేధంపై అప్పటికైనా జగన్ ఓ క్లారిటీ ఇస్తారా.. లేక నిషేధం లేదు, నియంత్రణే అని సర్దిచెబుతారా.. వేచి చూడాలి.