Telugu Global
Editor's Choice

బతుకమ్మ చీరలేవి?

ఒకటి కాదు, రెండు చీరలు పంపిణీ చేస్తుందన్న సీఎం ప్రకటన ఉత్త ముచ్చటే

బతుకమ్మ చీరలేవి?
X

బీఆర్‌ఎస్‌ బతుకమ్మ పండుగకు ఒక్క చీరే ఇచ్చింది. కానీ తాము రెండు చీరలు ఇస్తామని రేవంత్‌ ప్రభుత్వం చెప్పింది. ఒక్కటీ లేదు.. రెండూ లేవు. అంతేకాదు బతుకమ్మ చీరలకు బదులు నగదు ఇస్తామని ప్రభుత్వ వర్గాల నుంచి ఇచ్చిన లీకులపై విధివిధానాలు లేవు. ఇవాళ్టి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. కానీ ఇప్పటివరకు చీరల పంపిణీపై ఆర్డర్లు ఇవ్వలేదు. వాటికి బదులు నగదు పంపిణీ చేస్తుందన్న నమ్మకం లేదు. బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేత కార్మికుల జీవితాలపై ప్రభావం పడింది. చీరల ఆర్డర్లు ఆపేశాక ఉపాధి కోల్పోయిన నేతన్న ఆర్థిక ఇబ్బందులతో మళ్లీ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాజకీయ కక్షతో మా పొట్ట కొట్టవద్దని నేత కార్మికులు కోరుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల ఏటా 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక బృందం సభ్యులకు (దాదాపు 1.3 కోట్ల చీరలు) రెండు చీరలు పంపిణీ చేస్తుందని ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడినా దానిపై ఇప్పటివరకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదు. బతుకమ్మ చీరల పంపిణికి బదులు నగదు పంపిణీ చేసే ఆలోచన ఉన్నదనే ప్రభుత్వ వర్గాల నుంచి వెలువడిన లీకులపై స్పష్టత లేదు. బతుకమ్మ చీరలు బంద్‌ పెట్టడంపై మహిళలు, నేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్రంలో పండుగలా సాగేది. 2017 నుంచి 2023 వరకు గత ప్రభుత్వం ఏటా సుమారు కోటి మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసింది. ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరిగేది. ప్రభుత్వం అందించే ఆ కానుకతో పండుగను సంబురంగా చేసుకునే వారు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ ప్రభుత్వం చీరల పంపిణీ బంద్‌ పెట్టడమే కాదు, ఆర్డర్లూ నిలిపేసింది. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ లేదు. నగదు కానుకలు లేవుని స్పష్టమౌతున్నది. ప్రభుత్వ వైఖరిపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ. 2,500 హామీని అమలు చేయకపోగా చీరల పంపిణీ నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

బతుకమ్మ చీరల పంపిణీ అనేది కేసీఆర్‌ ప్రభుత్వం సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయం. తెలంగాణలో దసరా అనేది పెద్ద పండుగ. అలాగే తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ. అందుకే పేద మహిళలు సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని.... అలాగే చేనేత కార్మికులకు దీని ద్వారా ఉపాధి కల్పించింది. ప్రతి సంవత్సరం, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 డిజైన్లు మరియు 20 రకాల రంగులలో దాదాపు కోటి చీరలను మహిళలకు పంపిణీ చేసింది. చీరల రూపకల్పనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి చెందిన నిపుణులను కూడా నియమించింది. 2017 నుంచి 2023 వరకు బతుకమ్మ చీరల పంపిణీ కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2,157 కోట్ల నిధులు కేటాయించింది. బతుకమ్మ చీరలు తయారు చేసే నేత కార్మికులకు దాదాపు ఏడాదంతా పని ఉండేది. వారికి ఒక భరోసా ఉండేది. దానికి ప్రస్తుత రేవంత్‌ ప్రభుత్వం తూట్లు పొడిచింది.

First Published:  2 Oct 2024 7:38 AM GMT
Next Story