కమల వికాసం... కాంగ్రెస్ సీఎం సహకారం
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి దక్కింది గుండుసున్నానే

బీజేపీకి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ మినహా అన్నిజిల్లాల్లో క్యాడర్ ఉన్నది. అయినా వాళ్లు అధికారంలోకి రావడానికి సంఖ్యా బలం సాధించడానికి, మెరుగైన స్థానాలు దక్కించుకోవడానికి పదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నది. అప్పుడప్పుడు మెరుపులు మినహా ఆ పార్టీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎన్నడూ చూడలేదు. కానీ తాజాగా పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చాయి. ఆరేళ్ల కిందట ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో దక్కించుకున్నది. అధికారంలో ఉండి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ స్వయంకృతం కాదు కాదు సీఎం వైఖరి అంటే బాగుంటుందేమో.
కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రులఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం 15 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నది. ఈ జిల్లాల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు మంత్రులు, నలుగురు ఇన్‌ఛార్జి మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి నలుగురు ఎంపీలున్నారు. అయినా భవిష్యత్తు ఎన్నికల వ్యూహాన్ని అమలుచేయడానికి కాషాయ పార్టీ హైకమాండ్ దీన్ని అవకాశంగా వినియోగించుకున్నది. దీనికి ఆ పార్టీ చేసిన వర్కౌట్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రచార సమయంలో సాక్షాత్తూ సీఎం చేసిన కామెంట్లు పట్టభద్రులు అంజిరెడ్డి వైపు, ఉపాధ్యాయులు మల్క కొమురయ్య, శ్రీపాల్‌రెడ్డిలవైపు వైపు మొగ్గుచూపెట్టేలా చేశాయి. మొత్తానికి మూడుకు మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గుండుసున్నానే దక్కించుకున్నది.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని స్థానిక నాయకత్వానికే అప్పగించి బీజేపీ సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం వరకు పూర్తిగా వెనుకబడిపోయింది. సీఎం మాత్రం అనవసరంగా ప్రచారానికి పోయి అక్కడ ప్రధానంగా పోటీలో ఉన్న బీజేపీ కంటే పోటీలో లేని బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేయడం, నరేందర్ రెడ్డి ఓడినా గెలిచినా తమ ప్రభుత్వానికి ఒరిగేది ఏమీ లేదన్నారు. పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులకు డీఏలు అన్నీ క్లియర్ చేస్తామని, పీఆర్‌సీ ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో మూడు డీఏలు పెండింగ్‌లో పెట్టడమే కాకుండా పీఆర్‌ఎసీ గురించి ఊసే లేదు. దీంతో నోటిఫికేషన్లపై నిరుద్యోగులు, టీచర్లకు ఇచ్చిన హామీల వైఫల్యంపై వారిలోనూ అసంతృప్తి ఉన్నది. ఫలితంగా అటు టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీని కాషాయ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది.
ఇక ఓటమి తర్వాత మంత్రుల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కానీ ఓడిన అభ్యర్థి మాత్రం చెల్లని ఓట్లే తన ఓటమికి కారణం అన్నారు. నిత్యం అసలు బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, కేసీఆర్ మాట ఇక వినిపించదు అంటూనే బీఆర్‌ఎస్ వల్లనే తాము ఓడిపోయామని చెప్పుకోవడం సిగ్గుచేటు. పదిహేను నెలల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను తిడుతూ.. కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత ఉన్న పతారా పోగొట్టుకున్నారు. చివరికి ఎక్కడికి వెళ్లిందంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కట్టర్ కాంగ్రెస్ నేతలే కాషాయ పార్టీ అజెండాలో పనిచేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డే అని చాలారోజులుగా చెబుతున్నారు. ఈ ఫలితాల తర్వాత మరోసారి కుండబద్దలు కొట్టారు. కమల వికాసానికి కాంగ్రెస్ సీఎం సహకారం అందిస్తున్నారని పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.