Telugu Global
Editor's Choice

ఆరు గ్యారెంటీలు ఔట్.. అడుగడుగునా ఆంక్షల కంచెలే

కాంగ్రెస్‌ పాలన అంటేనే కమిటీలు, కాలయాపనలు, అరెస్టులు, అణిచివేతలు, అక్రమ కేసులు.. ఉద్యమకాలంలోనే ఇవన్నీ చూసిన ప్రజలు

ఆరు గ్యారెంటీలు ఔట్.. అడుగడుగునా ఆంక్షల కంచెలే
X

హైదరాబాద్‌లో 24 గంటల పాటు భారతీయ న్యాయ సురక్ష సంహిత 2023 సెక్షన్‌ 163 అమలు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు. 27వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్‌ 28 తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ సెక్షన్‌ అమలులో ఉంటుందని చెప్పారు. ఈ సెక్షన్‌ ప్రకారం ఐదుగురు అంతకంటే ఎక్కువమంది గుమిగూడవద్దని, ధర్నాలు, సమావేశాలు, ర్యాలీలు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో హైదరాబాద్‌లో ఈ ఆంక్షలు పెట్టి ఇరవై నాలుగు గంటల గడవకముందే మరో ప్రకటన వచ్చింది. అదేమంటే 'సెక్రటేరియట్‌ చుట్టూ 2 కిలోమీటర్ల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉన్నదని చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌వో) తెలంగాణ సెక్రటేరియట్‌ భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది కదలికలు, సోషల్‌ మీడియాపై నిఘా ఉందని, పోలీసు అధికారులపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సప్‌ గ్రూప్‌ల నుంచి ఎగ్జిట్‌ కావాలి. ప్రభుత్వం, పోలీస్‌ అధికారులకు వ్యతిరేకంగా పోస్టులు షేర్‌, లైక్‌ చేయవద్దు, తప్పు జరిగితే వెంటనే శాఖాపరమైన చర్యలు తప్పవని' సీఎస్‌వో ఆదేశించారు.

బారికేడ్లు బద్దలు కొట్టాం. ధర్నాలు చేసుకోవడానికి ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాం. ప్రజలు స్వేచ్ఛగా ప్రజాభవన్‌కు, సెక్రటేరియట్‌కు వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చు. ఈ స్టేట్‌మెంట్స్‌ అన్ని ఎక్కడో విన్నట్టు ఉన్నది కదా. డిసెంబర్‌ 7న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలే. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలన్న ఏకైక అజెండాతో అలవిగాని హామీలు ఇచ్చారు. వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జీవో 317 సమస్యను 48 గంటల్లో పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో ఏక్‌ పోలీస్‌ విధానాన్ని తెస్తామన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. పింఛన్‌ రూ. 4000 వేలు ఇస్తామన్నారు. ఎకరానికి ఏటా 15 వేల రైతు భరోసా ఇస్తామన్నారు. ఉద్యోగులకు మూడు డీఏలు ఇస్తామన్నారు. ఇట్లా 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ సర్కార్‌.. పది నెలల కాలంలో కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నది. రేవంత్‌ ప్రభుత్వం హామీలపై నిలదీస్తున్నది విపక్షాలే కాదు రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, కౌలు రైతులు, ధరణి బాధితులు, పింఛన్‌దారులు ఒక్కరేమిటి అన్నివర్గాల వాళ్లను పది నెలల కాలంలోనే రోడ్లపైకి తీసుకొచ్చేలా పాలన సాగించిన రేవంత్‌కే ఈ ఘనత దక్కుతుంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా, వారి సమస్యలను పరిష్కరించకుండా, వారి సమస్యలను వినకుండా, తాము చేయనివి కూడా మైకుల ముందుకు వచ్చి ఉపన్యాసాలు దంచడం, హామీలన్నీ అమలు చేసినట్టు పెద్ద పెద్ద హోర్డింగ్‌లలోనే పెద్ద పెద్ద ఫొటోలతో, తాటాకంత అక్షరాలతో ఆల్‌ ఈజ్‌ వెల్‌ అన్నట్టు ప్రచారం చేసుకోవడం ఫలితమే ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి కారణం.

రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్‌లో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన మూడు అంశాలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేశాయి. మూసీ, హైడ్రా పేరుతో డైవర్షన్‌ పాలిటిక్స్‌, జీవో 29కు వ్యతిరేకంగా నిరుద్యోగుల మెరుపు ధర్నాలు రేవంత్‌ సర్కారుకు షాక్‌ ఇచ్చాయి. ప్రజాభవన్‌, గాంధీభవన్‌లే కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏదో సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిజంగా ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వమైతే స్వల్ప కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చింది అన్నది సమీక్ష చేసుకోవాలి. లోపాలను సరిదిద్దుకోవాలి. అయితే ఎన్నికల్లో గెలువడానికి ఎన్నికల వ్యూహకర్తల సలహాలను ప్రభుత్వంలోనూ కొనసాగిస్తున్నట్టు కనిపిస్తున్నది. అందుకే ఇచ్చిన హామీలే కాదు కొత్తవి అనేకం కోరి తెచ్చుకుంటున్న పరిస్థితి ఉన్నది. తాజాగా ప్రభుత్వం, పోలీస్‌ అధికారులకు వ్యతిరేకంగా పోస్టులు షేర్‌, లైక్‌ చేయవద్దు, ఐదుగురు అంతకంటే ఎక్కువమంది గుమిగూడవద్దని, ధర్నాలు, సమావేశాలు, ర్యాలీలు ఏర్పాటు చేయవద్దనే ఆదేశాలకు కొంతమంది సమాధానం చెప్పాలి. 2023న డిసెంబర్‌ 7న తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందన్న వాళ్లు, స్వేచ్ఛ వచ్చిందన్న ప్రభుత్వంపై నిరసనలు, ఆందోళన చేస్తున్న వారి వద్దకు వెళ్లి ఇదే మాట చెప్పాలి. ఎందుకంటే నిరసనలు, ఆందోళన చేస్తున్న వారికి ఏ పని లేకుండా వాళ్ల కుటుంబాలతో సహా వచ్చి సెక్రటేరియట్‌ ముందు బైఠాయిస్తలేరు. ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాలు చేస్తలేరు. ప్రభుత్వం స్పందించకుండా నిర్బంధకాండ అమలు చేయడం వల్లనే రాజ్యాంగం వాళ్లకు ఇచ్చిన వాక్‌ స్వాతంత్య్రాన్ని, నిరసనల హక్కును వినియోగించుకుంటున్నారు. ఇవేవీ కాంగ్రెస్‌ ప్రజాపాలనలో నడువవు అన్నట్టు ఆదేశాలు, హెచ్చరికలు వస్తున్నాయి. కొన్నిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసిన ప్రజలు పది నెలల పాలనలోనే పెనం మీది నుంచి పొయ్యిల పడినట్లైందని వాపోతున్నారు. కాంగ్రెస్‌ పాలన అంటేనే కమిటీలు, కాలయాపనలు, అరెస్టులు, అణిచివేతలు, అక్రమ కేసులని ఉద్యమకాలంలోనే ప్రజలకు అనుభవం ఉన్నదే. కానీ మార్పు కోరితే మమ్మల్నే ముంచే విధానాలు ఉంటాయని వాళ్లు ఊహించలేదు. ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీలు పోయి ఆంక్షలు వచ్చాయంటున్నారు.

First Published:  28 Oct 2024 9:18 PM IST
Next Story