అంతదూరం పోయి అపెక్స్ కౌన్సిల్ అడగలేదేమి!?
ఏపీ ప్రాజెక్టులపై రేవంత్ చేసింది ఉత్తుత్తి ఫిర్యాదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి ఏపీ తలపెట్టిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గోదావరిలో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని కూడా కోరారు. ఇదంతా ఓకే.. కానీ అదే ప్రాజెక్టుపై చంద్రబాబును, కేంద్ర ప్రభుత్వాన్ని కడిగి పారేయడానికి విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన వేదిక అపెక్స్ కౌన్సిల్.. గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదు. పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సాగర్ కుడికాలువ ఆయకట్టును స్టెబిలైజ్ చేస్తూ బొల్లాపల్లి జలాశయానికి.. అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్‌కు గోదావరి జలాలను మళ్లించే ప్రాజెక్టు ఇది. పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను తరలించి ఉత్తరాంధ్రకు నీళ్లిచ్చే మరో స్కీం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. మొత్తంగా పోలవరం నుంచి గోదావరి నీళ్లను ఉత్తరాంధ్రలోని వంశధార బేసిన్ కు, కుడి కాలువ ద్వారా కృష్ణా, పెన్నా బేసిన్ లకు తరలించేలా భారీ ప్రాజెక్టులకు చంద్రబాబు స్కెచ్ గీశారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాతనే ఈ ప్రాజెక్టుల్లో చంద్రబాబు వేగం పెంచారు.
ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి ఏపీ అక్రమ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి.. అదే ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరకపోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటా అన్న చర్చ ఇప్పుడు ఇరిగేషన్ వర్గాల్లో మొదలైంది. బీఆర్‌ఎస్ ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు తలపెట్టిన ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఉత్తుత్తి కంప్లైంట్లు చేశారే తప్ప నిజంగా వాటిని ఆపాలన్న చిత్తశుద్ధి తెలంగాణ ముఖ్యమంత్రికి లేదని ప్రభుత్వవర్గాలే పెదవి విరుస్తున్నాయి. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు తలపెట్టినా దానికి సంబంధిత రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుతో పాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చైర్మన్‌గా ఉండే అపెక్స్ కౌన్సిల్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సభ్యులు. ఇప్పటి వరకు రెండుసార్లు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. తెలంగాణ చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు, ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతలు, పురుషోత్తమపట్నం, పట్టిసీమ ఎత్తిపోతలపై ఆ సమావేశాల్లో చర్చ జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కడం లేదు కాబట్టి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ -1956లోని సెక్షన్ 3 ప్రకారం నీటి పంపకాలు చేపట్టాలన్న కీలక నిర్ణయం తీసుకున్నది రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే.
తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను దెబ్బతీసే గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని రేవంత్ రెడ్డి కోరితే ఏపీ ముఖ్యమంత్రికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి లేఖ రాసి వెసులుబాటును బట్టి సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉండేది. ఆ సమావేశంలో తెలంగాణ అభ్యంతరాలు.. దానికి సహేతుకమైన వివరణలు ఇచ్చి చంద్రబాబును ఫిక్స్ చేయడంతో పాటు కేంద్రాన్ని ఇరుకున పెట్టే అవకాశం రేవంత్ కు ఉండేది. కానీ అపెక్స్ కౌన్సిల్ ప్రస్థావనే ఇంతవరకు రేవంత్ నోటి నుంచి వినిపించలేదు. ఒకవేళ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే తెలంగాణ హక్కుల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టుబట్టాలి. అది తన మెంటార్ అయిన చంద్రబాబుకు కోపం తెప్పించవచ్చు. కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా అన్ని అనుమతులు తీసుకునే వరకు ప్రాజెక్టును చేపట్టొద్దని ఆదేశించాల్సి రావొచ్చు. అది రేవంత్ కు ఇష్టం లేదని రాష్ట్ర ప్రభుత్వవర్గాలే చెప్తున్నాయి. ప్రజాభవన్‌లో జరిగిన విందు భేటీలో గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తానే ఆ ప్రాజెక్టును వ్యతిరేకించడం సరికాదనే అభిప్రాయంతో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంలో గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని మాత్రం కోరలేదు. ఇరిగేషన్ శాఖ తరపున కనీసం కేంద్రానికి లేఖ కూడా రాయలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తే బీఆర్‌ఎస్ విమర్శల నుంచి తప్పించుకోవడానికే రేవంత్ రెడ్డి కేంద్రానికి ఉత్తుత్తి ఫిర్యాదులు చేశారని తేటతెల్లమవుతోంది.