Telugu Global
Editor's Choice

పింఛన్ల పెంపు ముచ్చటే లేదు

మహిళలకు రూ.2,500 సాయం హామీకి మంగళం

పింఛన్ల పెంపు ముచ్చటే లేదు
X

పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఇతరులకు మరోసారి నిరాశే మిగిలింది. పింఛన్ల పెంపునకు తెలంగాణ బడ్జెట్‌ లో అదనంగా నయా పైసా కేటాయించలేదు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే వృద్ధులు, వితంతువులు, ఇతరుల పింఛన్లను రూ.2,016 నుంచి రూ.4 వేలకు, వికలాంగుల పింఛన్‌ ను రూ.6 వేలకు పెంచుతామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీని పిలిపించి ఆమె చేతుల మీదుగా ఆరు గ్యారంటీలను ఆవిష్కరింపజేసింది. నిరుడు (2024 -25) బడ్జెట్‌ లో ఏప్రిల్‌ నెల నుంచే పెంచిన పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ లో పింఛన్ల పెంపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు పింఛన్ల ముచ్చటే బడ్జెట్‌ ప్రసంగంలో లేకుండా జాగ్రత్త పడింది. నిరుడు బడ్జెట్‌ లో ఆరు గ్యారంటీలను ప్రారంభించేందుకు రూ.53 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌ లో శాఖల వారీగా కేటాయింపులు తప్ప ఆరు గ్యారంటీల ముచ్చట ఎత్తలేదు. అభయహస్తంలో భాగంగా మహాలక్ష్మీ, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం కింద పింఛన్లు పంపిణీ చేస్తున్నామని మాత్రమే పేర్కొన్నది.

తెలంగాణలో 2023 - 24 ఆర్థిక సవంత్సరంలో వృధ్యాప్య, వితంతు, వికలాంగ, చేనేత, గీత కార్మిక, హెచ్‌ఐవీ పేషంట్స్‌, ఫైలేరియా పేషంట్స్‌, డయాలసిస్‌ పేషంట్స్‌, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ పింఛన్లు పొందుతున్న వారు 44,10,320 మంది ఉండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 -25 ఆర్థిక సంవత్సరంలో 1,09,917 మంది తగ్గి 43,00,403 మంది పింఛన్లు పొందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వారికి చేయూత పథకంలో భాగంగా పింఛన్లు ఇవ్వడానికి రూ.14,861 కోట్లు కేటాయించారు. దీంతో కేసీఆర్ ఇచ్చిన పింఛన్లనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించబోతుంది. తద్వారా నిరుడు బడ్జెట్‌ లో ప్రకటించిన పింఛన్ల పెంపు హామీని పూర్తిగా పక్కన పెట్టేసింది. పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్తగా మంజూరు చేస్తామన్న హామీ కూడా ఇవ్వలేదు. శాసన మండలిలో పింఛన్ల పెంపు హామీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానమిస్తూ పింఛన్ల పెంపుపై తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టకుంటామని సమాధానం ఇచ్చారు. కొత్త పింఛన్లను కూడా మంజూరు చేస్తామని చెప్పారు. కానీ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో మాత్రం అలాంటి ప్రయత్నమేది చేయలేదు.

మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీకి రూ.4,305లు కేటాయించారు. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చే పథకానికి రూ.723 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లలోపు కరెంట్‌ వినియోగించుకునే వారికి సబ్సిడీగా రూ.2,080 కోట్లు కేటాయించారు. ఉచిత బస్సు, కరెంట్‌ సబ్సిడీ, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్లు తప్ప మహిళలకు నెలకు రూ.2,500 సాయం ఇస్తామన్న హామీకి ప్రభుత్వం మంగళం పాడింది. కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని మాత్రం ప్రకటించింది. భూమిలేని నిరుపేద కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున అందజేసే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి రూ.600 కోట్ల కేటాయింపులు చేసింది. అమలులో ఉన్న పథకాలను కొనసాగించడం మినహా కొత్తగా ఏ ఒక్క పథకాన్ని బడ్జెట్‌ లో ప్రకటించలేదు. కొత్త ఉద్యోగ నియామకాలకు బడ్జెట్‌ లో కేటాయింపుల గురించి ప్రస్తావించలేదు. దీంతో జాబ్‌ క్యాలెండర్ అమలుపై అనుమానాలు అలుముకున్నాయి. ఆరు గ్యారంటీల్లో ప్రకటించిన మిగతా హామీలను బడ్జెట్‌ లో ఎక్కడా ప్రస్తావించలేదు.

First Published:  19 March 2025 1:24 PM IST
Next Story