ఆ శాఖ అనాథ అయ్యిందా!?
కీలక శాఖను మంత్రి ఎందుకు అటకెక్కించారు.. రోజూ సీఎం ను కలిసే మంత్రి శాఖ ముచ్చట ఎందుకు ఎత్తుత లేరు?
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ.. రాష్ట్రంలో అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖ. పీపుల్ ఫ్రెండ్లీ లీడర్ గా చెప్పుకునే సీతక్క ఆ శాఖ మంత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు. హైదరాబాద్ లో ఉంటే ఏదో ఒక సందర్భంలో ముఖ్యమంత్రిని ఆమె కలవడం పరిపాటి. కేబినెట్ లో ఉన్న మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ దొరకక పోవచ్చు కానీ సీతక్కకు ఆ పరిస్థితి ఉండదు. సీఎం దగ్గరే కాదు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ దగ్గర, ముఖ్యనేత రాహుల్ గాంధీ దగ్గర ఆమెకు ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతక్క మంత్రిగా ఉన్న కీలక శాఖ అనాథగా మారిందట. ఇది ఆమెపై అభాండాలు వేయడానికి చెప్తున్నది కాదు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నది.
రాష్ట్రంలోని 70 శాతం జనాభా కు నిత్యం రక్షిత నీటిని సరఫరా చేయడంతో పాటు, వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించే కీలక శాఖకు మంత్రిగా ఉన్న సీతక్క కొన్ని నెలలుగా ఆ శాఖ వ్యవహారాలను పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఆగస్టులో చివరిసారిగా సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పై రివ్యూ చేశారు. ఆ తర్వాత ఆ శాఖ ను మంత్రి, సీఎం పట్టించుకున్న పాపాన పోలేదు. భారీ వర్షాలకు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయి. ఎమ్మెల్యేలు ముందు పడి వాటికి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. ఆ రోడ్లకు పర్మినెంట్ రిపేర్లు చేయించాలని ఎమ్మెల్యేలు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సూర్యాపేట జిల్లాకు ఒక ఎమ్మెల్యే రోడ్ల రియర్లతో పాటు కొత్త రోడ్లకు ప్రపోజల్స్ ఇచ్చి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తిరిగి తిరిగి విసుగెత్తిన సదరు ఎమ్మెల్యే అధికారులపై ఫైర్ అయ్యారు. మంత్రిని, సీఎం ను కలిసి అడగండి తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏమోస్తుందని అధికారులు చెప్పారట. మంత్రిని కలిస్తే చూద్దాం చేద్దాం అనడం తప్ప పనులు కావడం లేదని సదరు ఎమ్మెల్యే తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. జనవరిలో పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయని.. మంత్రి శాఖ ను పట్టించుకోకుంటే కాంగ్రెస్ పార్టీకే నష్టమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇకనైనా మంత్రి కీలక శాఖ ను పట్టించుకోవాలని.. సీఎం తో మాట్లాడి నిధులు విడుదల చేయించి అవసరమైన పనులు చేపట్టాలని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలే కోరుతున్నారు.